Telugu Global
National

బెంగళూరులో ట్రాఫిక్ పన్ను.. ఎలా వసూలు చేస్తారంటే..?

కర్నాటకలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు బెంగళూరులో కంజెషన్ ట్యాక్స్ తెరపైకి తెస్తోంది. రద్దీ సమయాల్లో, ఎంపిక చేసిన కొన్ని రోడ్లపైకి వాహనాలు వస్తే ఈ ట్యాక్స్ వసూలు చేస్తారు.

బెంగళూరులో ట్రాఫిక్ పన్ను.. ఎలా వసూలు చేస్తారంటే..?
X

బెంగళూరులో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. దీన్ని నివారించడానికి వ్యక్తిగత వాహనాల రద్దీ తగ్గించడానికి ప్రభుత్వం కొత్త ఆలోచన చేస్తోంది. ట్రాఫిక్ పన్ను పేరుతో వ్యక్తిగత వాహనాలు వాడేవారిపై భారం వేయడానికి సిద్ధపడింది. కంజెషన్ ట్యాక్స్ పేరుతో దీన్ని వసూలు చేస్తారు. పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ విషయంలో మినహాయింపు ఉంది. కేవలం వ్యక్తిగతంగా ఉపయోగించే కార్లు, ఇతర వాహనాలపై మాత్రమే ఈ పన్ను విధిస్తారు.

ఆ సమయాల్లో, ఆ రోడ్లపై..

కంజెషన్ ట్యాక్స్ అనేది ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల అమలులో ఉంది. లండన్ లో సోమవారం నుంచి శుక్రవారం వరకు జనరల్ షిఫ్ట్ టైమ్ లో రోడ్లపైకి వచ్చే ప్రైవేటు వాహనాలపై ఈ ట్యాక్స్ విధిస్తారు. సింగపూర్, స్టాక్ హోమ్ వంటి నగరాల్లో కూడా ఈ పన్ను ఉంది. భారత్ లో ఢిల్లీలో దీన్ని ప్రవేశ పెట్టాలని చూసినా రాజకీయ కారణాలతో వెనక్కి తగ్గింది ప్రభుత్వం. కర్నాటకలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు బెంగళూరులో కంజెషన్ ట్యాక్స్ తెరపైకి తెస్తోంది. రద్దీ సమయాల్లో, ఎంపిక చేసిన కొన్ని రోడ్లపైకి వాహనాలు వస్తే ఈ ట్యాక్స్ వసూలు చేస్తారు.

ఎలా వసూలు చేస్తారు..?

ప్రస్తుతం టోల్ ట్యాక్స్ వసూలు చేసినట్టే కంజెషన్ ట్యాక్స్ వసూలు చేస్తారు. టోల్ గేట్ల వద్ద ఉండే క్యూఆర్ కోడ్ మెషీన్లు ప్రధాన రోడ్లపై అమర్చుతారు. రద్దీ సమయాల్లో మాత్రమే అవి పనిచేసేలా కోడింగ్ ఉంటుంది. ఆ సమయాల్లో మాత్రమే వ్యక్తిగత వాహనాలైన కార్లు, ఇతర వాహనాలు రోడ్లపైకి వస్తే ట్యాక్స్ పడుతుంది. వారాంతాల్లో మాత్రం మినహాయింపు ఇస్తారు. ఈ పన్ను విషయంలో ప్రభుత్వం సుముఖంగానే ఉన్నా.. ప్రజలనుంచి వ్యతిరేకత వస్తుందనే భయం మాత్రం ఉంది. అయితే బెంగళూరు లాంటి పట్టణాల్లో ట్రాఫిక్ ని నియంత్రించాలంటే మాత్రం ఇలాంటి నియమాలు తప్పనిసరి అంటున్నారు. అప్పుడే వ్యక్తిగత వాహనాల వాడకం తగ్గుతుందని, ఎక్కువమంది ప్రజా రవాణాని ఉపయోగించుకుంటారని చెబుతున్నారు. ఈ ప్రయోగం బెంగళూరులో సక్సెస్ అవుతుందో లేదో చూడాలి.

*

First Published:  22 Sep 2023 10:21 AM GMT
Next Story