Telugu Global
National

రాయితీల్లో రైల్వే నిర్వాకం.. నాయకులకు ఓకే, వృద్ధులకు నో

కరోనా కాలంలో అన్ని వర్గాలతో పాటు వృద్ధుల రాయితీని పూర్తిగా నిలిపివేశారు. ఇప్పుడు దాన్ని కొనసాగించే అవకాశం లేదని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంట్ లో ప్రకటించారు.

రాయితీల్లో రైల్వే నిర్వాకం.. నాయకులకు ఓకే, వృద్ధులకు నో
X

రైలు టికెట్ పై ఇచ్చే రాయితీల విషయంలో వృద్ధుల కేటగిరీ ఇక శాశ్వతంగా తొలగించినట్టే. కరోనాకి ముందు వృద్ధులకు కూడా రాయితీ ఇస్తున్నా.. కరోనా తర్వాత మాత్రం పునరుద్ధరించలేదు. పదే పదే వృద్ధులు అభ్యర్థిస్తే, చివరకు కేంద్రం తేల్చిందేంటంటే.. ఇప్పుడే కాదు భవిష్యత్తులోనూ వృద్ధులకు రాయితీ ఇవ్వలేమని స్పష్టం చేసింది. విచిత్రం ఏంటంటే.. రైల్వేలో రాజకీయ నాయకులకు రాయితీ కొనసాగుతోంది. ఎంపీలు, మాజీ ఎంపీలు.. హాయిగా తమ హోదా ప్రకారం రైల్వే టికెట్ లో రాయితీపై ప్రయాణిస్తున్నారు. నాయకులకు ఉన్న రాయితీ వృద్ధులకు తీసేయడంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మలి వయసులో ఎవరిపై ఆధారపడలేని వృద్ధులకు రైల్వే టికెట్ లో రాయితీ ఇచ్చే ప్రక్రియ చాన్నాళ్లనుంచి కొనసాగుతోంది. 50 ఏళ్ల వయసు పైబడిన మహిళలకు రైల్వే టికెట్ లో 50శాతం రాయితీ ఉండేది. 60 ఏళ్లు దాటిన పురుషులకు 40 శాతం రాయితీ ఉండేది. కరోనా కాలంలో అన్ని వర్గాలతో పాటు వృద్ధుల రాయితీని పూర్తిగా నిలిపివేశారు. ఇప్పుడు దాన్ని కొనసాగించే అవకాశం లేదని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంట్ లో ప్రకటించారు. రైల్వేకి నష్టం వస్తుందని చెబుతున్నారు సరే, మరి ప్రజల ద్వారా మనగలుతున్న ఆ వ్యవస్థ వృద్ధులపై కనికరం చూపలేకపోవడం నిజంగా దారుణం. పోనీ రాయితీల ద్వారా వచ్చే నష్టాన్ని రైల్వే సంస్థ భరించలేని స్థితికి చేరుకుందనుకుందాం.. మరి రాజకీయ నాయకుల సంగతేంటి. వారికి ప్రయాణ భత్యాలు ప్రభుత్వం నుంచి బాగానే ముడుతుంటాయి కదా. ఇక్కడ కూడా రాయితీలిచ్చి వారిని దర్జాగా సాగనంపాలా..? వృద్ధులపై మాత్రం కనికరం చూపించలేరా..?

రైల్వేలో వివిధ కేటగిరీల వారికి రాయితీలు ఇస్తుంటారు. జర్నలిస్ట్ లు, తాజా ఎంపీలు, మాజీ ఎంపీలు, వృద్ధులు, వికలాంగులు, విద్యార్థులు.. ఇలా వివిధ కేటగిరీలు ఉంటాయి. ఇలా అన్ని కేటగిరీలకు కలిపి రాయితీ వల్ల 2017-20 మధ్య రూ.4,794 కోట్ల ఆదాయాన్ని భారతీయ రైల్వేలు కోల్పోయాయని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ చెబుతున్నారు. అయితే కరోనా కాలంలో ఈ రాయితీలను రైల్వే శాఖ వ్యూహాత్మకంగా ఆపివేసింది. వాటిని పునరుద్ధరించే విషయంలో ఎప్పటికప్పుడు వెనకడుగు వేస్తూ పోయింది. చివరకు రాయితీలు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ఎంపీలు, మాజీ ఎంపీలకు ఇచ్చే రాయితీని కొనసాగిస్తున్నట్టు తెలిపారు రైల్వే మంత్రి. వికలాంగుల కోటాలో 4 కేటగిరీల వారికి, విద్యార్థులు, రోగులు విషయంలో 11 కేటగిరీల వారికి రాయితీలు కొనసాగిస్తున్నామని చెప్పారు. వృద్ధుల విషయంలో మాత్రం పూర్తిగా రాయితీ ఆపేశారు.

First Published:  21 July 2022 4:45 AM GMT
Next Story