Telugu Global
National

హిందువుల మనోభావాలను గాయపర్చినందుకు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌పై ఫిర్యాదు

భగవత్ పాంచజన్య, ఆర్గనైజర్ పత్రికల‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హిందూ నాగరికత ఎల్‌జిబిటిక్యూ కమ్యూనిటీని సాంప్రదాయకంగా గుర్తించిందని చెప్పారు. అతను మహాభారతం నుండి కొన్ని ఉదహరణలు కూడా చెప్పారు.

హిందువుల మనోభావాలను గాయపర్చినందుకు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్‌పై ఫిర్యాదు
X

హిందువుల మనోభావాలను గాయపర్చినందుకు ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ఆరెస్సెస్ అధికార పత్రికలు, పాంచజన్య, ఆర్గనైజర్ పత్రికలపై రైట్ వింగ్ రచయిత, ఎడిటర్, యూ ట్యూబర్ సందీప్ డియో పోలీసులకు పిర్యాదు చేశాడు. అయితే, ఈ వ్యవహారంపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని శనివారం ఒక అధికారి తెలిపారు.

యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్న ఇండియా స్పీక్స్ డైలీ ఎడిటర్-ఇన్-చీఫ్ అయిన సందీప్ డియో తన ఫిర్యాదులో, భగవత్ ఇటీవల రెండు పత్రికలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహాభారతంలోని వ్యక్తులను ప్రస్తావిస్తూ వారు స్వలింగ సంపర్కానికి పాల్పడ్డారని చెప్పారని పేర్కొన్నారు.

భగవత్ పాంచజన్య, ఆర్గనైజర్ పత్రికల‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హిందూ నాగరికత ఎల్‌జిబిటిక్యూ కమ్యూనిటీని సాంప్రదాయకంగా గుర్తించిందని చెప్పారు. అతను మహాభారతం నుండి కొన్ని ఉదహరణలు కూడా చెప్పారు.

"జరాసంధుడికి ఇద్దరు సైన్యాధ్యక్షులు ఉండేవారు. వారి పేర్లు హన్స్, డింభక్. వీరిద్దరూ స్వలింగ స‍ంపర్కులు. దాంతో వాళ్ళను చంపాలని ప్లాన్ వేసిన కృష్ణుడు డింభక చనిపోయాడని పుకారు వ్యాప్తి చేశాడు. దాంతో హన్స్ ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఆ తర్వాత డింబక్ కూడా చనిపోయాడు. ఆ విధంగా కృష్ణుడు ఆ ఇద్దరిని చంపాడు…అంటే అర్దం ఏమిటి? అప్పటికే స్వలింగ సంపర్కం ఉంది. ఇది ప్రాచీన కాలం నుండి ఉనికిలో ఉంది. వెటర్నరీ డాక్టర్‌గా, ఇది జంతువులలో కూడా ఉందని నాకు తెలుసు. ఇది జీవసంబంధమైన స్వభావం.ఈ సంబంధాల గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. వారు కూడా బతకాలి. " అని భగవత్ తన ఇంటర్వ్యూలో చెప్పారు.

ఈ ఇంటర్వ్యూ ఆధారంగా డియో పిర్యాదు చేశాడు. భగవత్ చెప్పింది నిజం కాదని అసలు చరిత్ర గీతా ప్రెస్ నుండి ముద్రించిన శ్రీ హరివంశ్ పురాణంలో 1303వ పేజీ నుండి 1366 వరకు వివరించారని డియో తెలిపారు.

అందువల్ల IPCలోని సెక్షన్ 295 A (ఉద్దేశపూర్వకంగా, హానికరమైన చర్యలు, వారి మతం లేదా మత విశ్వాసాలను అవమానించడం ద్వారా ఒక‌ వర్గానికి చెందిన వారి మతపరమైన భావాలను రెచ్చగొట్టే ఉద్దేశ్యం) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

“భగవత్ వ్యాఖ్యలు చాలా మంది హిందువుల‌ మనోభావాలను గాయపరిచాయి. మహాభారతం, హర్వంశ్‌పురాణం వంటి గ్రంధాన్ని తప్పుగా అర్థం చేసుకున్నందుకు వారికి వ్రాతపూర్వక క్షమాపణలు చెప్పాలి” అని డియో తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

First Published:  28 Jan 2023 7:02 AM GMT
Next Story