Telugu Global
National

అదానీ వ్యవహారంలో మోడీకి, యోగీకి మధ్య కోల్డ్ వార్!

అదానీ అంశంలో మోడీ డిఫెన్స్ లో పడిపోయిన పరిస్థితుల్లో ఆయన పార్టీ సహచరులు, ఆరెస్సెస్ అటు అదానీకి, ఇటు మోడీకి మద్దతుగా నిలబడ్డారు. అయితే ఆశ్చర్యంగా ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ భిన్నంగా స్పందించారు.

అదానీ వ్యవహారంలో మోడీకి, యోగీకి మధ్య కోల్డ్ వార్!
X

న్యూయార్క్ కు చెందిన హిండెన్ బర్గ్ సంస్థ అదానీ కంపెనీల అక్రమాలపై గత నెల 25న నివేదిక విడుదల చేసిన నాటి నుండి దేశంలో ఆందోళన చెలరేగింది. ఒక వైపు అదానీ ఆస్తులు హారతి కర్పూరంలా కరిగిపోయాయి. 10 లక్షల కోట్లకు పైగా ఆస్తి ఆవిరయిపోయింది. ప్రపంచ కుబేరుల జాబితాలో మూడవ స్థానంలో ఉన్న అదానీ ఏకంగా 21వ స్థానానికి దిగజారాడు.

మరో వైపు, విపక్షాలు అదానీపైనే కాకుండా ఆయనకు అన్ని వేళలా మద్దతుగా నిల్చిన ప్రధాని మోడీపై విరుచుకపడుతున్నాయి. అదానీ స్కాంపై విపక్షాలే కాకుండా మెజార్టీ ప్రజల వేళ్ళన్నీ మోడీ వైపు చూపిస్తున్నాయి. పార్లమెంటులో, బైటా విపక్షాలు మోడికి వ్యతిరేకంగా నిరసనలకు దిగుతున్నారు. అదానీ స్కాం వెలుగులోకి వచ్చాక మోడీ డిఫెన్స్ లో పడిపోయిన పరిస్థితుల్లో ఆ యన పార్టీ సహచరులు, ఆరెస్సెస్ అటు అదానీకి, ఇటు మోడీకి మద్దతుగా నిలబడ్డారు. అయితే ఆశ్చర్యంగా ఈ విషయంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ భిన్నంగా స్పందించారు. పైకి ఏం మాట్లాడకపోయినప్పటికీ ఆయన ఆచరణ అదాని భుజంపై తుపాకీ పెట్టి మోడీకి గురి చూస్తోంది.

దీనికి ఒకటో రెండొ ఉదహరణలు కాదు ఈ మధ్య జరిగిన మూడు సంఘటనలున్నాయి. ఈ మూడు సంఘటనలు చూస్తే మోడీ తో యోగీ అమీతుమీ తేల్చుకోవడానికి సిద్దమవుతున్నట్టు కనపడుతోంది.

మొదట ఉత్తరప్రదేశ్ కు అదానీ సరఫరా చేయాల్సిన విద్యుత్ స్మార్ట్ మీటర్ల ఆర్డర్ ను యోగీ రద్దు చేయడంతో ఈ కోల్డ్ వార్ మొదలయ్యింది.

ఉత్తరప్రదేశ్‌కు చెందిన మధ్యాంచల్ విద్యుత్ విత్రన్ నిగమ్ (ఎంవివిఎన్‌ఎల్) విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కామ్)కి స్మార్ట్ మీటర్లు సరఫరా చేయడానికి టెండర్లను పిలిచింది. అదానీ గ్రూప్‌తో పాటు, GMR, L&T, ఇంటెలిస్మార్ట్ ఇన్‌ఫ్రా ఈ ప్రాజెక్ట్ కోసం తమ టెండర్లను సమర్పించాయి. అయితే అదానీకి ఈ టెండర్ దక్కింది. ఈ విద్యుత్ సంస్థకు అదానీ 7.5 మిలియన్ స్మార్ట్ మీటర్లను సరఫరా చేయాల్సి ఉంది. వాటి విలువ 5,400 కోట్లు.

అయితే గత నెల 25న అదానీ స్కాం వెలుగులోకి రాగానే ఫిబ్రవరి 4వ తేదీన అదానీకి ఇచ్చిన ఆర్డర్ ను రద్దు చేస్తూ యోగీ సర్కార్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని కోసం మళ్ళీ టెండర్లను పిలవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో మరింత ఆశ్చ‌ర్యం కలిగించే విషయమేంటంటే మోడీకి అతి సన్నిహితుడిగా పేరుబడ్డ యూపీ విద్యుత్ శాఖా మంత్రి అరవింద్ కుమార్ శర్మకు కూడా ఈ ఆర్డర్ రద్దు నిర్ణయం తెలియదు. ప్రకటన బైటికి వచ్చాక ఆయనకు కూడా తెలిసిందని సమాచారం.

అసలే అదానీని కాపాడుకోవడంతో పాటు, తనను తాను రక్షించుకోవడం కోసం మోడీ ఆయన అనుచరులు ఒక వైపు తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉంటే యోగీ ఈ విధమైన చర్యలు చేపట్టడం మోడీకి ఇబ్బందులను తెచ్చిపెట్టింది. దాంతో మోడీ యోగీ మీద గుర్రుగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో మరో సంఘటన జరిగింది.

ఉత్తర ప్రదేశ్ కొత్త డిజీపీగా తనకు అత్యంత ఆప్తుడైన దేవేంద్ర సింగ్ చౌహాన్ ను నియమించాలని యొగి నిర్ణయించుకొని, అందుకు అనుగుణంగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. అయితే అప్పటికే యోగీ పై గుర్రు మీద ఉన్న మోడీ ఆ ప్రతిపాదనను ఒప్పుకోకుండా అనేక ప్రశ్నలు సంధిస్తూ ఫైల్ ను వెనక్కి పంపాడు. ఆ ప్రశ్నలకు జావాబు ఇవ్వాలని కూడా కేంద్ర యూపీని ఆదేశించింది. అయితే యోగీ ఆ ప్రశ్నలకు జవాబు ఇవ్వకపోగా దేవేంద్ర సింగ్ చౌహాన్ ను డీజీపీగా నియమించారు. అక్కడితో ఆగలేదు. ఆయననే డీజీ విజిలెన్స్, డిజీ, ఇంటలీజన్స్ గా కూడా నియమించారు. ఈ మూడు పోస్టుల్లో ఒక్కరినే నియమించ కూడదన్న సుప్రీం తీర్పును కూడా యోగీ పట్టించుకోలేదు. నిజం చెప్పాలంటే మోడీ చర్యకు ప్రతి చర్యగానే కాకుండా యోగీ , మోడీకి సవాల్ విసిరారు. కేంద్రం ఒప్పుకోక పోయినా దేవేంద్ర సింగ్ చౌహాన్ ను డీజీపీగా నియమించడమే కాకుండా ఆయన‌కే మరో రెండు కీలక బాధ్యతలను అప్పజెప్పడం ద్వారా మోడీని రెచ్చగొట్టారాయన.

ఇక్కడితో ఆగలేదు యోగి. మహిళా రెజ్లర్ల ను లైంగిక వేధింపులకు గురి చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) అధ్యక్షుడు, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను కాపాడటానికి ఒకవైపు మోడీ సర్కార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉండగా యోగీ ఆయనను ఏమీ చేయలేక ఆయన మేనల్లుడు బీజేపీ ఎమ్మెల్యే సుమిత్ సింగ్ పై దాడి మొదలు పెట్టాడు.

సుమిత్ సింగ్ తో సహా మరో 8 మంది ఆయన అనుచరులు ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నందుకు గోండా సిటీ కొత్వాలి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.

దాక్షాయణి ఎంటర్‌ప్రైజెస్‌ యజమాని సుమిత్‌సింగ్‌ ప్రభుత్వ రికార్డులను తారుమారు చేసి గోండా మున్సిపల్‌ బోర్డుకు చెందిన భూమిని ఆక్రమించారని పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. ఫోర్జరీతో సహా, ఇతర సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేశారు. జిల్లా యంత్రాంగం ఈ భూమిలో నిర్మించిన సరిహద్దు గోడను బుల్డోజర్లతో కూల్చివేసింది.

ఈ విషయంలో బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తో పాటు మోడీ కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. అసలే మోడీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో యోగీ ఆదిత్యనాథ్ ఇలా ఎందుకు చేస్తున్నట్టు ?

ఆయన దగ్గరివాళ్ళు చెప్తున్నదాన్ని బట్టి చాలాకాలంగా యోగీ గుజరాత్ లాబీపై గుర్రుగా ఉన్నార‌ని, తాము చేసే ప్రతి నిర్ణయంలో, ప్రతి పనిలో గుజరాత్ లాబీ జోక్యంపై ఆయన ఆగ్రహం ఉన్నార‌ని తెలుస్తోంది. యూపీలో గుజరాత్ రాజ్యమేంటని తన దగ్గరివాళ్ళతో అనేక సార్లు అన్నారని సమాచారం. గుజరాత్ లాబీపై , వారికి మద్దతుగా ఉన్న మోడీ పై ఎప్పటి నుంచో కోపంగా ఉన్న యోగి సమయం చూసి దెబ్బకొడుతున్నాడని యూపీలో చర్చ జరుగుతోంది. మరి ఈ కోల్డ్ వార్ ఎంత దూరం వెళ్తుందో చూడాలి.

First Published:  8 Feb 2023 3:11 AM GMT
Next Story