Telugu Global
National

కేంద్రంతో పోరుకు కాంగ్రెస్ మ‌ద్ద‌తు కోరుతున్న కేజ్రీవాల్‌

బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల మధ్య ఐక్యతను పెంపొందించడానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలోనే కేజ్రీవాల్ పార్ల‌మెంటులో కాంగ్రెస్ మ‌ద్ద‌తు కోరేందుకు రాహుల్‌గాంధీ, ఖ‌ర్గేల‌తో స‌మావేశం కావాల‌ని కోర‌డం కీల‌క‌మైన మ‌లుపుగా విశ్లేష‌కులు భావిస్తున్నారు.

కేంద్రంతో పోరుకు కాంగ్రెస్ మ‌ద్ద‌తు కోరుతున్న కేజ్రీవాల్‌
X

పార్ల‌మెంటులో కేంద్రంతో పోరుకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అర‌వింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తు కోరేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌ రాహుల్ గాంధీ, ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేలతో సమావేశం కావాలని యోచిస్తున్నారు. ఈ విష‌యాన్ని శుక్ర‌వారం అరవింద్ కేజ్రీవాల్ ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు.

ఢిల్లీ బ్యూరోక్రాట్ల నియంత్రణపై కేంద్రం రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లును ఓడించేందుకు తగిన మద్దతును పొందేందుకు కేజ్రీవాల్ ఇప్ప‌టికే వివిధ ప్రతిపక్ష పార్టీల నేతలతో సమావేశమయ్యారు.

బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, NCP నాయకుడు శరద్ పవార్, శివసేన (UBT) నాయకుడు ఉద్ధవ్ థాక్రేతో సమావేశమవ‌గా, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. రాజ్యాంగాన్ని తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తోందని, ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేస్తోందని ఆరోపిస్తూ ఆయా పార్టీలు ఆప్‌కి మద్దతుగా నిలిచాయి.

బ్యూరోక్రాట్‌ల బదిలీలు, నియామకాలపై కేంద్రం కాదు, ఢిల్లీలోని ఎన్నికైన ప్రభుత్వమే నియంత్రణ కలిగి ఉంటుందని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలను అధిగమించడానికి గత వారం ఆమోదించిన ఆర్డినెన్స్ స్థానంలో పార్లమెంటు వర్షాకాల సమావేశంలో బిల్లును తీసుకురావాలని కేంద్ర‌ ప్రభుత్వం యోచిస్తోంది.

2024 జాతీయ ఎన్నికలకు ముందు బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీల మధ్య ఐక్యతను పెంపొందించడానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలోనే కేజ్రీవాల్ పార్ల‌మెంటులో కాంగ్రెస్ మ‌ద్ద‌తు కోరేందుకు రాహుల్‌గాంధీ, ఖ‌ర్గేల‌తో స‌మావేశం కావాల‌ని కోర‌డం కీల‌క‌మైన మ‌లుపుగా విశ్లేష‌కులు భావిస్తున్నారు.

First Published:  26 May 2023 8:33 AM GMT
Next Story