Telugu Global
National

విమానంలో సిగరెట్.. కేంద్ర మంత్రి సహా అందరూ ఫూల్స్ అయ్యారా..?

ఈ క్రమంలో అసలు ఆ వీడియో ఒరిజినల్ కాదని, అందులో కనిపిస్తున్న ఫ్లైట్ కూడా ఒరిజినల్ కాదని తేల్చి చెప్పారు కటారియా. దుబాయ్‌లో ఓ షూటింగ్ సందర్భంగా డమ్మీ ఫ్లైట్‌లో తాను సిగరెట్ తాగానని వివరణ ఇచ్చాడు.

విమానంలో సిగరెట్.. కేంద్ర మంత్రి సహా అందరూ ఫూల్స్ అయ్యారా..?
X


విమానంలో బాబీ కటారియా అనే వ్యక్తి పడుకుని సిగరెట్ తాగిన వీడియో రెండు రోజులుగా సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఈ వీడియో బయటకు రాగానే హడావిడిగా కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దీనిపై విచార‌ణ జ‌రిపి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పౌరవిమానయాన భద్రతను పర్యవేక్షించే సీఐఎస్ఎఫ్ వెంటనే కేసు నమోదు చేసింది. ఆ తర్వాత స్పైస్ జెట్ సంస్థ వివరణ కూడా ఇచ్చింది. ఈ ఘటన ఈ ఏడాది జనవరిలో జరిగిందని చెప్పింది. దుబాయ్ నుంచి ఢిల్లీకి వచ్చే స్పైస్ జెట్ విమానంలో కటారియా సిగరెట్ తాగాడని, విమాన సిబ్బంది అంతా తనిఖీలలో బిజీగా ఉండగా అతను ఈ పని చేసి ఉంటాడని చెప్పింది. అంతే కాదు 15 రోజులపాటు సదరు కటారియాపై ప్రయాణ నిషేధం విధించినట్టు పేర్కొంది.

అసలది ఒరిజినల్ వీడియో కాదు..

ఈ మధ్య సోషల్ మీడియాలో బయటపడుతున్న వీడియోల్లో ఏది ఒరిజినలో, ఏది మార్ఫింగో తేల్చుకోవడం కష్టంగా మారింది. ఈ క్రమంలో అసలు ఆ వీడియో ఒరిజినల్ కాదని, అందులో కనిపిస్తున్న ఫ్లైట్ కూడా ఒరిజినల్ కాదని తేల్చి చెప్పారు కటారియా. దుబాయ్‌లో ఓ షూటింగ్ సందర్భంగా డమ్మీ ఫ్లైట్‌లో తాను సిగరెట్ తాగానని వివరణ ఇచ్చాడు.

లైటర్ తీసుకెళ్లడం సాధ్యమేనా..?

విమానాల్లో సిగరెట్లు తీసుకెళ్లొచ్చేమో కానీ, లైటర్ తీసుకెళ్లడం ఏమాత్రం సాధ్యం కాదని అంటున్నారు కటారియా. అలాంటిది లైటర్‌తో విమానంలో సిగరెట్ ముట్టించడం ఎలా సాధ్యపడుతుందని ఎదురు ప్రశ్నిస్తున్నాడు. మన ఎయిర్ పోర్టుల్లో తనిఖీలు మరీ అంత నాసిరకంగా ఉన్నాయా అంటూ విమానయాన సంస్థలు, ఎయిర్ పోర్ట్ అథారిటీలనే టార్గెట్ చేశాడు కటారియా. ప్రస్తుతం ఆయన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో నడిరోడ్డుపై కటారియా మందుకొడుతున్న వీడియోలు కూడా ఇప్పుడు కలకలం సృష్టిస్తున్నాయి. అది డమ్మీ విమానమే అయితే, అసలు ఆ సంఘటన జరగలేదనుకుంటే.. హడావిడిగా స్పందించిన విమానయాన శాఖ మంత్రితోపాటు, దాన్ని కవర్ చేసుకోవాలని చూసిన స్పైస్ జెట్ సంస్థ కూడా ఫూల్స్ అయినట్టే లెక్క.

First Published:  12 Aug 2022 7:25 AM GMT
Next Story