Telugu Global
National

తాగుడు అలవాటుపై ముఖ్యమంత్రి సీరియస్ కామెంట్స్

మందు తాగినా చెడిపోని ఐరన్ లివర్ తనకేమీ లేదన్నారు. తాను కూడా సాధారణ మనిషినేనని, తాగితే లివర్ పాడవుతుందని, ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని, తాగుడు మానేశానని చెప్పుకొచ్చారు.

తాగుడు అలవాటుపై ముఖ్యమంత్రి సీరియస్ కామెంట్స్
X

ఆ ముఖ్యమంత్రికి మందు తాగే అలవాటుంది. కానీ ఆయన ఇప్పుడు దాన్ని మానేశారు. అయినా సరే పదే పదే తాగుబోతు అనే కామెంట్ ని ఆయన భరించలేకపోతున్నారు. పదే పదే తనని ఎందుకలా వేధిస్తారంటూ ప్రశ్నిస్తున్నారు పంజాబ్ సీఎం భగవంత్ మన్. తనపై విమర్శలు చేయడానికి ప్రతిపక్షాలకు ఇతర విషయాలేవీ దొరకలేదా అని ప్రశ్నించారు.

పంజాబ్ సీఎం భగవంత్ మన్ కి మందు తాగే అలవాటు ఉందనే విషయం చాలామందికి తెలుసు. ఆ విషయంలో ఆయన తల్లి కూడా చాలాసార్లు మందలించారు. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన తర్వాత 2019లో ఓ బహిరంగ సభలో భగవంత్ మన్ తాగుడు మానేస్తున్నానంటూ తన తల్లికి మాటిచ్చారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలోనే ఈ ప్రమాణం చేశారు భగవంత్ మన్. ఆ తర్వాత తాను అసలు మద్యం జోలికి వెళ్లలేదని చెబుతారాయన. కానీ ప్రతిపక్షాలు మాత్రం ఆయన్ను పదే పదే తాగుబోతు అంటూ విమర్శలు చేస్తుంటాయి. గతేడాది జర్మనీ పర్యటనలో కూడా భగవంత్‌ మన్‌ బాగా తాగి నడవలేని స్థితిలో ఉండటంతో విమానం నుంచి సిబ్బంది ఆయన్ను దించేశారనే వదంతులు వచ్చాయి. ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఆయన మందు తాగి పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేవారని, ఇప్పుడు కూడా ఆయన ఆ అలవాటు మానుకోలేకపోతున్నారని, నిత్యం ఆయన మద్యం మత్తులోనే ఉంటారని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఆ విమర్శలపై తాజాగా భగవంత్ మన్ సీరియస్ గా స్పందించారు.


నాదేమైనా ఐరన్ లివరా..?

12 ఏళ్లుగా నిత్యం మందు తాగే వ్యక్తి వ్యక్తి కచ్చితంగా అనారోగ్యానికి గురవుతాడు కదా అని ప్రతిపక్షాలను ప్రశ్నిస్తున్నారు పంజాబ్ సీఎం భగవంత్ మన్. మద్యం తాగితే లివర్ పాడవుతుంది కదా, దానికి తానేమీ మినహాయింపు కాదు కదా అని అంటున్నారు. మందు తాగినా చెడిపోని ఐరన్ లివర్ తనకేమీ లేదన్నారు. తాను కూడా సాధారణ మనిషినేనని, తాగితే లివర్ పాడవుతుందని, ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని, తనకు తాగుడు అలవాటు లేదని, మానేశానని చెప్పుకొచ్చారు.

First Published:  18 Jun 2023 4:51 PM GMT
Next Story