Telugu Global
National

చికెట్ టిక్కా మసాలా కనిపెట్టిన షెఫ్ అహ్మద్ అస్లామ్ మృతి

1970లో అలీ తన రెస్టారెంట్‌లో తొలి సారిగా ఈ డిష్ వండారు.

చికెట్ టిక్కా మసాలా కనిపెట్టిన షెఫ్ అహ్మద్ అస్లామ్ మృతి
X

చికెట్ టిక్కా మసాలా.. మనం ఏ రెస్టారెంట్‌కు వెళ్లినా, ధాబాకు వెళ్లినా మెనూలో ఈ ఐటెమ్ కనపడుతుంది. రెగ్యులర్ ఇండియన్ నాన్-వెజ్ ఐటెమ్స్ కన్నా.. ఇది కాస్త ఘాటు తక్కువగా, తియ్యగా ఉంటుంది. మసాలా పేరు పెట్టి తియ్యగా వండినందుకు షెఫ్‌ను తిడుతుంటాము. కానీ, అసలు చికెన్ టిక్కా మసాలా అనే వంటే తియ్యగా ఉంటుంది. ఎందుకంటే దీన్ని మొదటి సారి బ్రిటిషర్ల కోసం తయరు చేశారు. ఆ విషయం స్వయంగా ఆ డిష్‌ను కనిపెట్టిన షెఫ్‌ అహ్మద్ అస్లామ్ అలీ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 1970లో ఆయన తన రెస్టారెంట్‌లో తొలి సారిగా ఈ డిష్ వండారు. కాగా, అలీ వయోభారంతో మృతి చెందినట్లు కుటుంబం బుధవారం ప్రకటించింది.

పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన ఓ కుటుంబం కొన్ని దశాబ్దాల క్రితం ఇంగ్లాండ్ వెళ్లింది. ఆ కుటుంబంలోని చిన్న పిల్లాడైన అలీ ఆ తర్వాత కాలంలో షెఫ్‌గా మారాడు. గ్లాస్గోలో షీష్ మహల్ అనే రెస్టారెంట్‌ను 1964లొ స్థాపించాడు. అక్కడ ఇండియన్, పాకిస్తానీ వంటకాలను వండి అందించేవాడు. ఒక రోజు ఓ కస్టమర్ చికెన్ టిక్కా ఆర్డర్ చేశాడు. దాన్ని కస్టమర్‌కు వడ్డించగా.. ఈ వంట చాలా డ్రైగా, ఘాటుగా ఉంది. నేను టమోటా సాస్ వేసుకొని తింటానని చెప్పాడు. ఆ రెస్టారెంట్‌కు వచ్చే చాలా మంది తన నాన్-వెజ్ డిష్‌లపై సాస్ వేసుకొని తినడం గమనించాడు.

తాను చేసిన వంటను నేరుగా తినకుండా ఇలా సాస్‌లు కలుపుకొని తినడం అలీకి నచ్చలేదు. దీంతో యోగర్ట్, క్రీమ్, టమోటా ప్యూరే, ఇతర మసాలా దినుసులు కలిపి చికెట్ టిక్కా మసాలా తయారు చేశాడు. దాన్ని కస్టమర్లకు అందించగా అద్భుతంగా ఉందని చెప్పారు. బ్రిటిషర్లకు ఈ వంటకం చాలా నచ్చింది. అలా యూకేలో అన్ని రెస్టారెంట్లకు చికెట్ టిక్కా మసాలా పాకింది. అక్కడి నుంచే ఇండియాకు ఆ వంటకం వచ్చింది. ఈ విషయాన్ని అస్లామ్ అలీ 2001లో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

గ్లాస్గో సెంట్రల్ నియోజకవర్గం లేబర్ పార్టీ ఎంపీ మహ్మద్ సర్వార్ 2009లో గ్లాస్గోను హోమ్ ఆఫ్ చికెన్ టిక్కా మసాలాగా ప్రకటించారు. అయితే ఈ కర్రీకి డిసిగ్నేషన్ ఆఫ్ ఆరిజిన్ స్టేటస్ కోసం హౌస్ ఆఫ్ కామన్స్ (దిగువ సభ)లో తీర్మానం ప్రవేశపెట్టగా.. అది ఆమోదానికి నోచుకోలేదు. అస్లామ్ అలీనే ఆ డిష్ తయారు చేసినట్లు ఆ తర్వాత చాలా మంది షెఫ్‌లు గుర్తించారు. ఇప్పటి వరకు ఆ డిష్ తమదే అని ఎవరూ క్లెయిమ్ చేసుకోలేదు.

అస్లామ్ అలీ (77) వయో భారంతో మృతి చెందడంతో షీష్ మహల్ రెస్టారెంట్‌ను 48 గంటల పాటు మూసేస్తున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. ఆయనకు భార్య, ఐదుగురు బిడ్డలు ఉన్నారు.

First Published:  23 Dec 2022 3:51 AM GMT
Next Story