Telugu Global
National

ఈత కొడుతుంటే.. గొంతులో ఇరుక్కున్న చేప – బాలుడిని కాపాడేందుకు చెమటోడ్చిన వైద్యులు

ఛత్తీస్‌గఢ్‌లోని జాంబీర్‌ చాంపా జిల్లాలో ఈ ఘటన జరిగింది. అకల్తరా పోలీస్‌ స్టేషను పరిధిలోని కరుమహు గ్రామానికి చెందిన సమీర్‌ గోడ్‌ (14) అనే బాలుడు శుక్రవారం ఉదయం చెరువుకు ఈత కోసం వెళ్లగా ఈ ఘటన చోటుచేసుకుంది

ఈత కొడుతుంటే.. గొంతులో ఇరుక్కున్న చేప – బాలుడిని కాపాడేందుకు చెమటోడ్చిన వైద్యులు
X

చెరువులో ఈత కొట్టడం ఆ బాలుడికి మామూలే. ఎప్పటిలానే శుక్రవారం ఉదయం కూడా చెరువులో దిగి ఈత కొడుతున్నాడు. ఇంతలో ఊహించని ఘటన జరిగింది. ఒక చేప అనూహ్యంగా అతని నోట్లోకి వచ్చి.. గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో ఆ బాలుడి అవస్థలు అన్నీ ఇన్నీ కాదు. గొంతులో చిక్కుకున్న చేప తప్పించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలతో ఆ బాలుడు అల్లాడిపోయాడు. మరోపక్క సరిగా ఊపిరి అందక.. సతమతమయ్యాడు.

ఛత్తీస్‌గఢ్‌లోని జాంబీర్‌ చాంపా జిల్లాలో ఈ ఘటన జరిగింది. అకల్తరా పోలీస్‌ స్టేషను పరిధిలోని కరుమహు గ్రామానికి చెందిన సమీర్‌ గోడ్‌ (14) అనే బాలుడు శుక్రవారం ఉదయం చెరువుకు ఈత కోసం వెళ్లగా ఈ ఘటన చోటుచేసుకుంది. బాలుడి పరిస్థితిని చూసి ఆ కంగారుపడిన స్థానికులు ఆ చేపను బయటికి తీసేందుకు విఫలయత్నం చేశారు. అయినా ఫలితం లేకపోవడంతో వెంటనే బాలుడిని అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. అకల్తరా కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ వైద్యులు అతికష్టం మీద సగం చేపను బయటికి తీశారు.

అప్పటికే బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో బిలాస్‌పూర్‌కు బాలుడిని హుటాహుటిన తరలించారు. అప్పటికే ఆస్పత్రి వైద్యులకు దీనిపై సమాచారం కూడా అందించడంతో అక్కడ సిద్ధంగా ఉన్న వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. బాలుడి మెడ దగ్గర చిన్న రంధ్రం చేసి మిగతా చేపను విజయవంతంగా బయటికి తీశారు. ప్రస్తుతం బాలుడు వైద్యుల పరిశీలనలో ఉన్నాడు. బాలుడు కోలుకుంటున్నాడని డాక్టర్‌ రామకృష్ణ కశ్యప్‌ తెలిపారు.

First Published:  30 March 2024 4:53 AM GMT
Next Story