Telugu Global
National

ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ పుట్టక ముందు హిందువులు లేరా..?

ఖాకీ నిక్కర్ తగలబడితే హిందుత్వానికి వచ్చిన ముప్పేంటని ప్రశ్నించారు ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ సీఎం భూపేష్ బఘేల్. ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ పుట్టుకొచ్చి వందేళ్లు కూడా కాలేదని, 1925లో ఆయా సంస్థలు ఏర్పాటయ్యాయని, అంతకు ముందు హిందువులు లేరా అని ప్రశ్నించారు.

ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ పుట్టక ముందు హిందువులు లేరా..?
X

సోషల్ మీడియాలో ఖాకీ నిక్కర్ తగలబడిపోతున్న ఫొటోతో ఆర్ఎస్ఎస్ నాయకులు బాగా హర్ట్ అయ్యారు. అయితే దీన్ని హిందూ వ్యతిరేక వ్యవహారంగా మార్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. విద్వేషంతోనే కాంగ్రెస్ ఇలాంటి పనులు చేస్తోందని, విద్వేషంతోనే ప్రజలు ఏకం కావాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు ఆర్ఎస్ఎస్ సంయుక్త ప్రధాన కార్యదర్శి మన్మోహన్ వైద్య. కాంగ్రెస్ ని హిందూ ద్వేషిగా చిత్రీకరించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే దీనిపై గట్టిగానే కౌంటర్లు పడుతున్నాయి.

ఖాకీ నిక్కర్ వేసుకుంటే హిందువులైపోతారా..?

ఖాకీ నిక్కర్ తగలబడితే హిందుత్వానికి వచ్చిన ముప్పేంటని ప్రశ్నించారు ఛ‌త్తీస్‌గ‌ఢ్‌ సీఎం భూపేష్ బఘేల్. అసలు హిందువులకి ఖాకీ నిక్కర్ కి సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ పుట్టుకొచ్చి వందేళ్లు కూడా కాలేదని, 1925లో ఆయా సంస్థలు ఏర్పాటయ్యాయని, అంతకు ముందు హిందువులు లేరా అని ప్రశ్నించారు. హిందువులకు ప్రతిరూపం తామేనంటూ చెప్పుకుంటున్న ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ వాళ్లంతా ఏ దేవుడు, ఏ దేవతను ఆరాధిస్తారని, ఎవరిని అనుసరిస్తారని ప్రశ్నించారు.

హింస, గూండాగిరి మన సంస్కృతి కాదు..

మ‌హాత్మా గాంధీని పొట్ట‌న‌పెట్టుకుంది ఆర్ఎస్ఎస్ సంస్థేనని అన్నారు భూపేష్ బఘేల్. హింస‌, గూండాగిరి మ‌న సంస్కృతి కాద‌ని అన్నారు. మనుషుల‌ను కూడా వారు జంతువుల కంటే హీనంగా చూస్తున్నార‌ని మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ కి అసలు హిందుత్వం ఎక్కడినుంచి వచ్చిందని ప్రశ్నించారు. ఖాకీ నిక్కర్ పై ఆర్ఎస్ఎస్ రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు.

First Published:  13 Sep 2022 3:01 AM GMT
Next Story