Telugu Global
National

చంద్రయాన్‌–3 ల్యాండింగ్‌ టైమ్‌ ఫిక్స్‌.. ప్రత్యక్ష ప్రసారానికి ఇస్రో ఏర్పాట్లు

బుధవారం సాయంత్రం 5.27 గంటల నుంచి ల్యాండింగ్‌ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని, ఇస్రో వెబ్‌సైట్, యూట్యూబ్‌ ఛానల్, ఫేస్‌బుక్‌ పేజీ, డీడీ నేషనల్‌ టీవీ ఛానల్‌ సహా ఆయా ప్లాట్‌ఫాంలపై అందుబాటులో ఉంటుందని ఇస్రో తెలిపింది.

చంద్రయాన్‌–3 ల్యాండింగ్‌ టైమ్‌ ఫిక్స్‌.. ప్రత్యక్ష ప్రసారానికి ఇస్రో ఏర్పాట్లు
X

చంద్రయాన్‌– 3 ల్యాండర్‌ కీలక ఘట్టానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే ల్యాండర్‌ రెండో, చివరి డీ–బూస్టింగ్‌లను విజయవంతంగా పూర్తిచేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) జాబిల్లిపై అది దిగే సమయాన్ని వెల్లడించింది. ఆగస్టు 23న సాయంత్రం 6.04 సమయంలో చంద్రుడిపై ’విక్రమ్‌’ ల్యాండర్‌ అడుగుమోపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. ఈ సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ప్రక్రియను ఆయా వేదికల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపింది.

బుధవారం సాయంత్రం 5.27 గంటల నుంచి ల్యాండింగ్‌ ప్రక్రియను ప్రత్యక్ష ప్రసారం చేస్తామని, ఇస్రో వెబ్‌సైట్, యూట్యూబ్‌ ఛానల్, ఫేస్‌బుక్‌ పేజీ, డీడీ నేషనల్‌ టీవీ ఛానల్‌ సహా ఆయా ప్లాట్‌ఫాంలపై అందుబాటులో ఉంటుందని ఇస్రో తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థల్లో ఈ ఈవెంట్‌ ప్రత్యక్ష ప్రసారానికి ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా ఇస్రో పిలుపునిచ్చింది.

జాబిల్లిపై పరిశోధనలకు గానూ జూలై 14న ’చంద్రయాన్‌ –3’ని ప్రయోగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం విక్రమ్‌ ల్యాండర్‌ మాడ్యుల్‌ చంద్రుడి నుంచి అత్యల్పంగా 25 కి.మీ, అత్యధికంగా 134 కి.మీ దూరంలో ఉన్న కక్ష్యలో పరిభ్రమిస్తోంది. ఇక చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై దిగడమే తరువాయి. అంతా సజావుగా సాగితే ఆగస్టు 23న సాయంత్రం 6.04 సమయంలో చంద్రుడిపై ల్యాండర్‌ విజయవంతంగా అడుగు పెడుతుంది.

First Published:  20 Aug 2023 1:11 PM GMT
Next Story