Telugu Global
National

గంటసేపు చర్చలు.. పొత్తులపై ఊహాగానాలు

తెలంగాణలో అధికారంలోకి రాకపోయినా కాంగ్రెస్ ని వెనక్కు నెట్టి ప్రధాన ప్రతిపక్షంగా మారడం, ఏపీలో ఒకటీ రెండు సీట్లతో అయినా అసెంబ్లీలో ఉనికి నిలబెట్టుకోవడం.. ఇదే ప్రస్తుతం బీజేపీ ముందు ఉన్న పొలిటికల్ అజెండా.

గంటసేపు చర్చలు.. పొత్తులపై ఊహాగానాలు
X

టీడీపీ-బీజేపీ మళ్లీ కలుస్తున్నాయా..? తెలుగు రాష్ట్రాల్లో జరగబోతున్న ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు ఉమ్మడిగా పోటీ చేస్తాయా..? ప్రస్తుతానికి కన్ఫర్మేషన్ లేకపోయినా.. ఆ దిశగా ఇన్ఫర్మేషన్ మాత్రం బలంగా ఉంది. కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు ఢిల్లీలో చర్చలు జరపడంతో కూటమి దిశగా అడుగులు పడినట్టు తెలుస్తోంది. అయితే ఈ చర్చల తర్వాత రెండు పార్టీల నేతలు ఎక్కడా నోరు మెదపకపోవడం విశేషం. కనీసం సోషల్ మీడియా అకౌంట్లలో కూడా ఈ చర్చల గురించి టీడీపీ ప్రస్తావించలేదు. ఒక్క ఫొటోని కూడా బయటకు వదల్లేదు.

ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇంటికి వెళ్లి ఆయనతో గంటసేపు చర్చలు జరిపారు చంద్రబాబు. అదే సమయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా అమిత్ షా ఇంటికి వచ్చి ఈ చర్చల్లో పాల్గొన్నారు. తెలంగాణ, ఏపీ ఎన్నికల్లో కలసి పోటీ చేసే విషయంలోనే చర్చలు జరిగాయని తెలుస్తోంది. అది మినహా మరే ఇతర ప్రాధాన్యత అంశం వీరి చర్చల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం లేదు. అయితే గంటసేపు జరిగిన మంతనాలు ఓ కొలిక్కి వచ్చాయని అనుకోలేం.

అవసరం ఎవరికి..? బాబుకా, బీజేపీకా..?

2014లో పరస్పర అవగాహనతో టీడీపీ, బీజేపీ జతకలిశాయి, మధ్యలో జనసేనతో కూడా కూటమి కట్టి విజయం సాధించాయి. ఆ తర్వాత 2018లో చంద్రబాబు తనకు తానుగా ఎన్డీఏనుంచి బయటకొచ్చేశారు. వస్తూ వస్తూ బీజేపీ వల్లే ఏపీ అభివృద్ధి ఆగిపోయిందంటూ నిందలేశారు, తిరుపతిలో అమిత్ షా పై రాళ్లు వేయించారు, మోదీ వస్తే నల్ల బెలూన్లు ఎగురవేయించారు. ఇంతా చేసిన బాబు ఇప్పుడు మళ్లీ బీజేపీకి దగ్గర కావాలనుకుంటున్నారు. చంద్రబాబుని నమ్మి టీడీపీతో కలసి వెళ్లడం బీజేపీకి ఏమాత్రం ఇష్టం లేకపోయినా తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పార్టీ పొత్తుకి సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. చంద్రబాబు అవసరాన్ని తమకి అనుకూలంగా మార్చుకునేందుకు కమలం పార్టీ అధిష్టానం పావులు కదుపుతోంది.

తెలంగాణలో అధికారంలోకి రాకపోయినా కాంగ్రెస్ ని వెనక్కు నెట్టి ప్రధాన ప్రతిపక్షంగా మారడం, ఏపీలో ఒకటీ రెండు సీట్లతో అయినా అసెంబ్లీలో ఉనికి నిలబెట్టుకోవడం.. ఇదే ప్రస్తుతం బీజేపీ ముందు ఉన్న పొలిటికల్ అజెండా. దక్షిణాదిన కర్నాటకలో అధికారం చేజారిన తర్వాత మిగతా రాష్ట్రాల్లో అయినా పట్టు సంపాదించాలని ఆలోచిస్తున్నారు బీజేపీ నేతలు. అందుకే తెలంగాణ, ఏపీ విషయంలో టీడీపీని దగ్గరకు తీస్తున్నారు. ఆల్రడీ జనసేన తమ గుప్పెట్లోనే ఉంది కాబట్టి.. మూడు పార్టీల కూటమికి అడుగులు పడుతున్నట్టే అనుకోవాలి. ప్రస్తుతానికి లెక్కలు తేలకపోయినా కూటమి మాత్రం ఖాయమేనని తెలుస్తోంది.

First Published:  4 Jun 2023 5:21 AM GMT
Next Story