Telugu Global
National

సెస్, సర్‌ ఛార్జ్: కేంద్రానికి చెలగాటం.. రాష్ట్రాలకు ప్రాణ సంకటం

2016-2017లో సెస్, సర్ చార్జీలు కేవలం 12.2 శాతంగా ఉండేవి. కానీ 2022 నాటికి స్థూల పన్ను ఆదాయంలో వాటి వాటా 28.1 శాతానికి ఎగబాకింది. అంటే రెట్టింపు కంటే ఎక్కువ.

సెస్, సర్‌ ఛార్జ్: కేంద్రానికి చెలగాటం.. రాష్ట్రాలకు ప్రాణ సంకటం
X

నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి, ద్రవ్యోల్బణం భారీగా పెరిగిపోతోంది. అంతర్జాతీయ ఆర్థిక మాంద్యం దీనికి ఒక కారణం కాగా.. పన్నుల పేరుతో కేంద్రం దోపిడీయే అసలు కారణం. అయితే ఇక్కడ ధరలు పెరిగిపోవడం, ఈఎంఐలు భారం కావడం, ఇతరత్రా వస్తువులపై పన్నుల మోత గురించి సామాన్యులు.. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను దోషులుగా చూస్తుంటారు. ఒకరకంగా ఇది వాస్తవమే. కానీ ఇక్కడ రాష్ట్రాలు ఉద్దేశపూర్వకంగా పన్నుల్ని పెంచడంలేదు, కేంద్రమే పన్నుల మోత మోగించి, రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటాలకు అడ్డుకట్ట వేస్తోంది. ఫలితంగా ఆదాయం కేంద్రానికి, తిట్లు రాష్ట్రాలకు అనట్టుగా తయారైంది పరిస్థితి.

దోపిడీకి మారుపేర్లు సెస్, సర్ ఛార్జ్..

జీఎస్టీని అమలులోకి తెచ్చాక మళ్లీ సెస్, సర్ చార్జ్ ఏంటి అని ఎవరూ అడగడానికి లేదు. ఎందుకంటే కేంద్రం వాటిని వేయాలనుకుంది, వేస్తోంది. జీఎస్టీతో రాష్ట్రాలకు వాటా చెల్లించాలి కాబట్టి.. సెస్, సర్ చార్జీల పేరుతో నేరుగా స్వాహా మొదలు పెట్టింది. గత ప్రభుత్వకాలంలో ఈ పన్నులు ఉన్నా కూడా ఇప్పుడు దోపిడీ పరాకాష్టకు చేరింది. 2016-2017లో సెస్, సర్ చార్జీలు కేవలం 12.2 శాతంగా ఉండేవి. కానీ 2022 నాటికి స్థూల పన్ను ఆదాయంలో వాటి వాటా 28.1 శాతానికి ఎగబాకింది. అంటే రెట్టింపుకంటే ఎక్కువ. ప్రజలకు ఆమేరకు రెట్టింపుకంటే ఎక్కువ పన్నులు కట్టాల్సి వస్తోంది. ఆదాయం పెరగలేదు, అదే సమయంలో ఖర్చులు అనూహ్యంగా పెరిగాయి. అచ్చేదిన్ అంటే ఇవే అని సరిపెట్టుకోమంటున్నారు బీజేపీ నేతలు.

కాగ్ గుర్తించిన వాస్తవాలు..

సెస్‌, సర్‌చార్జీల ద్వారా కేంద్రం తాను పొందే ఆదాయం కంటే చాలా ఎక్కువ ఖర్చు చేస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో సెలవిచ్చారు. అయితే కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తాజా నివేదిక ఈ మోసాలను బయటపెట్టింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు వ్యతిరేకంగా సెస్ పెరిగిందని, ఆమేరకు రాష్ట్రాలకు కేటాయింపులు మాత్రం పెరగలేదని తేల్చింది. 2020-21 మధ్యకాలంలో సెస్, సర్ చార్జీల విషయంలో కొన్నిసార్లు అసలు ఆదాయం బదిలీ రాష్ట్రాలకు జరగలేదని, మరికొన్నిసార్లు మాత్రం స్వల్పంగా ఆదాయం బదిలీ జరిగిందని కాగ్ ఆడిట్ లో తేటతెల్లమైంది.

నిర్దిష్ట పథకాలు, కార్యకలాపాల కోసం సెస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్రాలతో పంచుకుంటుంది కేంద్రం. అయితే పెట్రోలియంపై ప్రత్యేక ఎక్సైజ్ సుంకాన్ని కేవలం కేంద్రమే ఉపయోగిస్తుంది, రాష్ట్రాలకు ఇవ్వదు. ఇటీవల ప్రీ బడ్జెట్ సమావేశాల్లో సెస్ ల గురించి, వాటి నుంచి వస్తున్న అధిక రాబడుడల గురించి రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వద్ద ప్రస్తావించారు. న్యాయబద్ధమైన వాటాలు ఇవ్వాల్సిందేనన్నారు. కానీ కేంద్రం కనికరించేలా లేదు. చివరకు భారత్ లో కో ఆపరేటివ్ ఫెడరలిజం కాస్తా బలవంతపు ఫెడరలిజంగా మారుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

First Published:  24 Dec 2022 3:50 PM GMT
Next Story