Telugu Global
National

పేర్ల మార్పు రాజకీయాలు: మరో రెండు ప్రముఖ పట్టణాల పేర్లు మార్పు

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పట్టణాన్ని ఛత్రపతి శంభాజీనగర్‌గా, ఉస్మానాబాద్ పట్టణానికి ధరాశివ్‌గా పేరు మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ధృవీకరించారు.

పేర్ల మార్పు రాజకీయాలు: మరో రెండు ప్రముఖ పట్టణాల పేర్లు మార్పు
X

బీజేపీ అధికారంలో ఉన్న చోట పురాతన నగరాల, వీదుల పేర్ల మార్పు కార్యక్రమం ఒక ఉద్యమంలా కొనసాగిస్తోంది. అధికారంలో లేని చోట్ల పేర్లు మారుస్తామంటూ ప్రజలను ఓట్లు అడుగుతుంది. ఇప్పటికే అనేక పట్టణాల , నగరాల పేర్లను మార్చిన బీజేపీ ఇప్పుడు మహారాష్ట్ర లో ఎంతో చరిత్ర గల రెండు ప్రముఖ పట్టణాల పేర్లను మార్చబోతోంది. దానికి కేంద్ర బీజేపీ సర్కార్ సహజంగానే ఆమోద ముద్ర వేసింది.

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ పట్టణాన్ని ఛత్రపతి శంభాజీనగర్‌గా, ఉస్మానాబాద్ పట్టణానికి ధరాశివ్‌గా పేరు మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ధృవీకరించారు.

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పేరు మీద‌ 17వ శతాబ్దంలో ఔరంగాబాద్‌కు ఆ పేరు పెట్టారు.హైదరాబాద్ చివరి పాలకుడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పేరు మీదుగా ఉస్మానాబాద్ పేరు పెట్టారు. అయితే ఆ ముస్లిం రాజుల పేర్లు మార్చి హిందువుల పేర్లు పెట్టాలని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది.

అయితే ఈ పేర్ల మార్పుకు ఆమోదింది బీజేపీ సర్కారే కానీ ప్రక్రియ మొదలు పెట్టింది ఆశ్చర్యంగా బీజేపీ కాదు.29 జూన్ 2022న అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అధ్యక్షతన జరిగిన మునుపటి మహా వికాస్ అఘాడి (MVA) ప్రభుత్వం చివరి క్యాబినెట్ సమావేశంలో, ఉద్దవ్ రాజీనామా చేయడానికి ముందు ఈ నగరాల పేరు మార్చడానికి నిర్ణయం తీసుకున్నారు.

ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చి వేసిబీజేపీ మద్దతుతో అధికారంలోకి వచ్చిన ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని ప్రభుత్వం ఔరంగాబాద్ నగరాన్ని ఛత్రపతి శంభాజీనగర్‌గా, ఉస్మానాబాద్ నగరానికి ధరాశివ్‌గా పేరు మార్చాలని తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని మహా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర అనుమతి కోసం పంపింది. కేంద్రం ఆ పట్టణాల పేర్లు మార్చ‌డానికి ఆమోదింది.

కాగా తమ‌ నగరం పేరుతో బిజెపి రాజకీయాలు చేస్తోందని ఔరంగాబాద్‌కు చెందిన ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఎంపీ ఇంతియాజ్ జలీల్ ఆగ్రహం వ్యక్తం చేశారు..

"ఔరంగాబాద్ ఎప్పటికీ మా నగరం. ఇప్పుడు ఔరంగాబాద్ కోసం మా శక్తి ప్రదర్శించేసమయం వచ్చింది. మా ప్రియమైన నగరం కోసం ఒక భారీ మోర్చా నిర్వహిస్తాం. మా నగరం పేరుతో రాజకీయాలు చేస్తున్న ఈ శక్తులను (బీజేపీ) ఓడించడానికి ఔరంగబాదీలను సిద్ధం చేస్తాం. పోరాటం కొనసాగిస్తాం’’ అని ట్వీట్‌ చేశారు.

కాగా, ఔరంగాబాద్, ఉస్మానాబాద్ పేర్లను మార్చేందుకు కేంద్రం అంగీకరించినందుకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు మహారాష్ట్ర సీఎం షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ లు కృతజ్ఞతలు తెలిపారు.

First Published:  25 Feb 2023 4:33 AM GMT
Next Story