Telugu Global
National

టీవీ, కంప్యూటర్ ఇచ్చారు.. కరెంటు మరిచారు..

దేశవ్యాప్తంగా కరెంటు ఉత్పత్తిలో, వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. అయితే మధ్యప్రదేశ్ టాప్ -10లో కూడా చోటు సంపాదించలేదు. అక్కడ ఉత్పత్తికి, వినియోగానికి చాలా అంతరం ఉంది.

టీవీ, కంప్యూటర్ ఇచ్చారు.. కరెంటు మరిచారు..
X

జాతీయ నూతన విద్యా విధానంతో సమూల మార్పు తెస్తామంటూ ఘనంగా ప్రకటించుకుంటున్న కేంద్రం.. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అస్తవ్యస్థ విధానాలతో అభాసుపాలవుతోంది. మధ్యప్రదేశ్ లో రూ.6,952 కోట్లతో మొదలుపెట్టిన స్మార్ట్‌ క్లాస్‌ పథకం ఇప్పుడు నిరుపయోగంగా మారుతోంది.

అసలేంటీ పథకం..?

మధ్యప్రదేశ్ లోని పాఠశాలల్లో రూ.6,952 కోట్లతో స్మార్ట్‌ క్లాస్‌ పథకం ప్రారంభించాలని గతేడాది నిర్ణయించింది బీజేపీ ప్రభుత్వం. ఉన్న స్కూల్స్ కి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను పంపిణీ చేయడం.. కొత్తగా 9200 హైక్వాలిటీ స్కూల్స్ ని ఏర్పాటు చేయడం ఈ పథకం లక్ష్యం. మొదటి విడతలో జిల్లా, తాలూకా కేంద్రాల్లోని 350 స్కూల్స్ లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలులో పెట్టింది. విద్యుత్ సరఫరా, కంప్యూటర్లు, ఇంటర్నెట్‌ లాంటి కనీస సౌకర్యాలు కల్పించాల్సి ఉన్నా.. ఆచరణలో అది సరిగా అమలు కాలేదు. దీంతో వేలకోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరులా మారుతున్నాయి.

దేశవ్యాప్తంగా కరెంటు ఉత్పత్తిలో, వినియోగంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉంది. అయితే మధ్యప్రదేశ్ టాప్ -10లో కూడా చోటు సంపాదించలేదు. అక్కడ ఉత్పత్తికి, వినియోగానికి చాలా అంతరం ఉంది. వ్యవసాయం, పరిశ్రమలకే 24గంటల కరెంటు సరఫరా ఉండదు. అలాంటిది స్కూల్స్ కి కరెంటు సరఫరా ఉంటుందని ఆశించలేం. ఉన్న నిధులన్నీ కంప్యూటర్లు, ఎల్ఈడీ టీవీలు కొనడానికే ఖర్చుపెట్టడంతో ఇప్పుడు కరెంటు సరఫరా చేయలేకపోతోంది ప్రభుత్వం. దీంతో ఎలక్ట్రానిక్ ఉపకరణాలన్నీ నిరుపయోగంగా మారాయి.

50 శాతం పాఠశాలల్లో స్మార్ట్‌ క్లాస్‌ పథకం మూలన పడింది. కొన్ని స్కూల్స్ లో కరెంట్ ఉన్నా ఇంటర్నెట్‌ సౌకర్యం లేదు. దీంతో టీచర్లు తమ సెల్‌ ఫోన్‌ లోని మొబైల్‌ డేటాతో పనికానిచ్చేస్తున్నారు. హాట్‌ స్పాట్‌ ద్వారా పాఠాలు చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. కానీ అనుకోని విద్యుత్ కోతలతో ఈ పని కూడా సరిగా జరగడంలేదు. విద్యుత్ కోతల వల్ల విద్యార్థుల, ఉపాధ్యాయుల సమయం వృథా అవుతోంది. దీంతో ఆ ఉపకరణాలను పక్కనపెట్టి తరగతి బోధనకే పరిమితం అవుతున్నారు ఉపాధ్యాయులు. ప్రభుత్వ తీరుపై జిల్లా అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో నాణ్యమైన విద్యుత్ సరఫరాతోపాటు, ప్రత్యేకంగా టీ-శాట్‌ ద్వారా విద్యార్థులకు, నిరుద్యోగులకు నిరంతర పాఠాలు అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. మధ్యప్రదేశ్ లో మాత్రం అధికార బీజేపీ అస్తవ్యస్థ విధానాలతో అభాసుపాలవుతోంది.

First Published:  20 Sep 2022 3:03 AM GMT
Next Story