Telugu Global
National

శత్రువుల ఆస్తుల విక్రయంతో రూ. 3400 కోట్లు - కేంద్రం ప్రకటన

భారతదేశం నుంచి పాకిస్తాన్, చైనా వెళ్లి ఆయా దేశాల పౌరసత్వం తీసుకున్న వారికి సంబంధించిన ఆస్తులు దేశంలో ఉండిపోయాయి. ఈ ఆస్తుల్ని ఎనిమీ ప్రాపర్టీస్ గా పిలుస్తారు.

శత్రువుల ఆస్తుల విక్రయంతో రూ. 3400 కోట్లు - కేంద్రం ప్రకటన
X

దేశంలోని ఎనిమీ ప్రాపర్టీస్ విక్రయం ద్వారా కేంద్ర ప్రభుత్వం 3,407 కోట్ల రూపాయలను ఆర్జించింది. ఈ విషయాన్ని మంగళవారం కేంద్ర హోం శాఖ వెల్లడించింది. దేశంలోని శత్రువుల ఆస్తులు అత్యధిక భాగం కంపెనీల షేర్లు, బంగారం, రెవెన్యూ రిసీట్ల రూపంలోనే ఉన్నాయి.

భారత్ -పాకిస్తాన్ విభజన, 1962, 65లో జరిగిన యుద్దాల తర్వాత దేశంలోని ఎవరైనా పాకిస్తాన్, చైనా వెళ్లి స్థిరపడాలనుకుంటే వారికి భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే అలా వెళ్లి ఆయా దేశాల పౌరసత్వం తీసుకునే వ్యక్తులకు సంబంధించిన స్థిరచరాస్తులు భారత ప్రభుత్వ పరమవుతాయని అప్పట్లో ప్రకటించింది.

ఇలా భారతదేశం నుంచి పాకిస్తాన్, చైనా వెళ్లి ఆయా దేశాల పౌరసత్వం తీసుకున్న వారికి సంబంధించిన ఆస్తులు దేశంలో ఉండిపోయాయి. ఈ ఆస్తుల్ని ఎనిమీ ప్రాపర్టీస్ గా పిలుస్తారు. శత్రువుల ఆస్తులుగా పిలవబడే వీటి నిర్వాహణను కస్టోడియన్ ఆఫ్ ఎనిమీ ప్రాపర్టీ ఆఫ్ ఇండియా - CEPI కి అప్పగించారు.

ఆ ఆస్తులను విక్రయించడం ద్వారానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 3407 కోట్ల రూపాయలను ఆర్జించింది. 152 కంపెనీలకు చెందిన 7.53 కోట్ల షేర్ల ద్వారా రూ. 2708 కోట్లు వచ్చింది. రూ.699 కోట్లు రెవెన్యూ రిసీట్ల రూపంలో ఉంది. 1699.7 గ్రాముల గోల్డ్ విక్రయం ద్వారా రూ.49.14 లక్షలు, 28.89 కిలోల వెండి విక్రయం ద్వారా రూ.10.92 లక్షలు ఆర్జించినట్టు కేంద్ర ప్రభుత్వం గణాంకాలు విడుదల చేసింది. 2018 నుంచి జరిపిన ఎనిమీ ప్రాపర్టీస్ విక్రయం ద్వారా ఈ సొమ్మును కేంద్రం ఆర్జించింది.

స్థిరాస్తులను మాత్రం కేంద్ర ప్రభుత్వం తన ప్రకటనలో సొమ్ము చేసుకున్నట్టు వెల్లడించలేదు. ఈ తరహా శత్రువుల ఆస్తులు మన దేశంలో 12,611 ఉన్నాయి. ఇందులో 12,386 ఆస్తులు పాకిస్తాన్ పౌరసత్వం తీసుకొని వెళ్లిపోయిన వారివే. మరో 126 ఆస్తులు చైనాకు చెందిన వ్యక్తులవి. ఈ తరహా శత్రు ఆస్తులు ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా 6255 ఉన్నాయి. బెంగాల్‌లో 4088, ఢిల్లీలో 659, గోవాలో 295, మహారాష్ట్రలో 208, తెలంగాణలో 158, గుజరాత్‌లో 151, త్రిపురలో 105, బీహార్‌లో 84, మధ్యప్రదేశ్‌లో 94, చత్తీస్‌గడ్ లో 78 ఉన్నాయి.

First Published:  21 Feb 2023 1:07 PM GMT
Next Story