Telugu Global
Editor's Choice

కేంద్రం ఒక మిథ్య !

''రాష్ట్రాలు లేనిదే కేంద్రం లేదు. రాష్ట్రాలు పన్నులు కట్టకుండా, కేంద్రానికి ఎటువంటి ప్రతిపత్తీ లేదు కేంద్రం అనేది మిథ్య''అని తెలుగుదేశం పార్టీ నిర్మాత ఎన్ఠీఆర్ చెప్పిన సంగతిని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు సభల్లో గుర్తు చేశారు.

central government is not cooperating with the development of the states
X

అసలు శ్రీలంకకు, భారతదేశంలోని రాష్ట్రాలకూ పొంతన ఏమిటి? అప్పులలో కూరుకుపోయి, ఆర్థికంగా సంక్షోభ దిశగా పయనిస్తున్నట్టు కేంద్రం చెబుతున్న రాష్ట్రాలన్నీ దేశంలో అంతర్భాగంగా ఉన్నాయి. రాష్ట్రాలు విడిగా లేవు. ప్రత్యేక దేశాలుగా ప్రకటించుకోలేదు. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా అప్పులు చేసే అవకాశాల్లేవు. అలాగే అందరిదీ అంబేద్కర్ రాజ్యాంగమే ! అటువంటప్పుడు కొన్ని రాష్ట్రాలను, అవి కూడా బీజేపీకి ప్రత్యర్థులుగా ఉన్న టిఆర్ఎస్, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ పాలిత తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, బీజేపీ 'మిత్ర'పార్టీ వైసీపీ పాలిత ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ త్వరలో శ్రీలంకగా మారిపోనున్నదని తెలుగుదేశం, బీజేపీ, జనసేన కొన్ని నెలలుగా ఆరోపిస్తూనే ఉన్నాయి. జగన్ ప్రత్యర్థుల వాదనలకు బలం చేకూర్చేలా కేంద్రం ప్రవర్తిస్తుండడం పట్ల ఏపీ ముఖ్యమంత్రి జగన్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు అమరావతి నుంచి సమాచారం అందుతోంది.

రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుందన్నది సాధారణ సూత్రం. కానీ రాష్ట్రాలు బలహీనపడాలని కోరుకోవడం, బలహీనపరిచే ప్రయత్నాలు చేయడం బీజేపీ రాజకీయ కుట్రలను బహిర్గతం చేస్తోంది.''రాష్ట్రాలు లేనిదే కేంద్రం లేదు. రాష్ట్రాలు పన్నులు కట్టకుండా, కేంద్రానికి ఎటువంటి ప్రతిపత్తి లేదు కేంద్రం అనేది మిథ్య''అని తెలుగుదేశం పార్టీ నిర్మాత ఎన్ఠీఆర్ చెప్పిన సంగతిని టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పలు సభల్లో గుర్తు చేశారు. దేశంలో అభివృద్ధి ఏ ప్రాంతంలో జరిగినా అది దేశ జీడీపీకే సమకూరుతుంది. దేశంలో ఎనిమిది రాష్ట్రాలు ఎక్కువ శాతం దేశ జీడీపీకి అందిస్తున్నవి. అందులో తెలంగాణ రాష్ట్రమూ ఉంది.

''పాలనలో అప్రతిహతంగా ముందుకు సాగుతున్న తెలంగాణ మీద ప్రధాని మోడీకి కన్నుకుట్టింది. నిబంధనల పేరుతో ఆర్థికంగా తెలంగాణను అణచివేయాలనుకుంటున్నారు. తెలంగాణకు వ్యతిరేకంగా కేంద్రం తీసుకునే నిర్ణయాలు బీజేపీ సోషల్ మీడియా గ్రూప్‌లకు ఎట్లా చేరుతున్నాయో బీజేపీ నాయకత్వం స్పష్టం చేయాలి. దేశానికి, రాష్ట్రాలకు నడుమ గోప్యంగా ఉండాల్సిన ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా లీక్ చేసి, తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేయడం నేరపూరిత చర్య''అని ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజుల కిందటే అన్నారు.

ఆయన వ్యాఖ్యలు నిజమని మంగళవారం ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం జరిపిన అఖిలపక్ష సమావేశం తీరు తెన్నులు రుజువు చేశాయి. శ్రీలంక ఆర్థిక‌ సంక్షోభం, ఆ దేశంలో నెలకొన్న ఆందోళనకరమైన పరిస్థితులపై కేంద్రప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి అందులో తెలంగాణ, ఆంధ్ర‌ప్ర‌దేశ్, తమిళనాడు, బెంగాల్ వంటి రాష్ట్రాలు ఎట్లా అప్పులలో కూరుకుపోయాయో వివ‌రించ‌డం ఎందుకు? కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ లక్ష్యం రాజకీయ దురుద్దేశాలతో కూడుకున్నట్టు చెప్పడానికి ఇంకేమి ఉదాహరణ కావాలి! బిజెపియేతర పార్టీల పాలిత రాష్ట్రాలను ఆర్థికంగా దిగజార్చడం, రాజకీయంగా దెబ్బతీయడం, లొంగదీసుకోవడం వంటి వికృత క్రీడ ఎనిమిదేండ్లుగా జరుగుతూనే ఉంది.

రాజకీయ కక్షతో ప్రగతిశీల తెలంగాణను ప్రోత్సహించకుండా, తెలంగాణ అభివృద్ధిపై కేంద్ర ప్రభుత్వం విద్వేషపూరితంగా వ్యవహరిస్తోందనడానికి ఎన్నో ఆధారాలున్నాయి. తెలంగాణ ఏర్పడి ఎనిమిదేళ్లు గడచినా రాష్ట్ర విభజన హామీలు సహా పలు హక్కులను బీజేపీ హరిస్తున్న వైఖరిని కేసీఆర్ తో పాటు మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి తదితర నాయకులు తర‌చూ నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. నిజానికి దేశంలోని 22 రాష్ట్రాల అప్పులు తెలంగాణ కంటే ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. ఎఫ్ఆర్ బిఎం పరిధికి లోబడే తెలంగాణకు అప్పులు లభిస్తాయి. దాని ప్రకారమే ఆర్థిక వ్యవహారాలు నడుస్తున్నాయి. ఎనిమిదేళ్ల కాలంలో ఒక్క పైసా కూడా డిఫాల్ట్ కాకుండా తిరిగి చెల్లించిన ట్రాక్ రికార్డు తెలంగాణ సొంతం చేసుకుంది.

ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి ప్రతి ఏటా కేంద్రం ప్రకటిస్తుంది. ఆ తర్వాతే రాష్ట్రాలు వారి బడ్జెట్లను రూపొందించుకుంటాయి. తెలంగాణ ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిని కేంద్రం రూ.53వేల కోట్లుగా ప్రకటించి తర్వాత మాట మార్చివేసినది. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ఆమోదం పొందిన తర్వాత అకస్మాత్తుగా, కక్షపూరితంగ రూ.23వేల కోట్లకు కుదించింది. తాజాగా విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్రం తమకు అయినవారికి అప్పనంగా దోచిపెట్టేందుకు రాష్ట్రాల మీద ఒత్తిడి తీసుకురావడం పట్ల బీజేపీయేతర పార్టీలు విమర్శిస్తున్నవి. కాగా తెలంగాణ ఏర్పడిన నాటి నుంచీ నీతి ఆయోగ్ పలు సందర్భాల్లో రాష్ట్రాన్ని ప్రశంసించింది. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రగతిని సాధిస్తున్న రాష్ట్రాలను కేంద్రప్రభుత్వం ప్రోత్సహించాలని కూడా 'నీతి ఆయోగ్' చేసిన చేసిన సిఫారసులు బుట్ట దాఖలు చేసింది.

ఇదిలా ఉండగా కేంద్రప్రభుత్వం గత ఎనిమిదేండ్లలో చేసిన అప్పు ఎంత? కేంద్ర ప్రభుత్వానికి అప్పు చేసే అధికారాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 292 ఇచ్చింది. రాష్ట్రాలు చేసే అప్పు ఆర్టికల్‌ 293 కిందకు వస్తుంది. దేశ భూభాగం పరిధిలో ఎఫ్‌ఆర్‌బీఎంకు అనుగుణంగా రాష్ట్రాలు అప్పులు చేయవచ్చు. పార్లమెంటు చట్టాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు అప్పులు ఇవ్వవచ్చు. అయితే 292 అధికరణం ప్రకారం నిర్దేశించిన పరిమితులు దాటకూడదు. రాష్ట్రాల చేసే అప్పులకు కూడా కేంద్రం హామీలు ఇవ్వవచ్చు. కాగా గతంలో కేంద్ర -రాష్ట్ర ఆర్థిక సంబంధాలపై అధ్యయనం చేసిన కమిటీ తన నివేదికలో ఓపెన్‌ మార్కెట్‌ నుంచి నేరుగా కేంద్రం అనుమతితో సంబంధం లేకుండా అప్పు తీసుకునే అధికారం రాష్ట్రాలకు ఉండాలని, రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులను అనుసరించి మార్కెట్‌ క్రెడిట్‌ రేటింగ్స్‌ లభిస్తాయని తెలియచేసింది.

2022 మార్చి నాటికి తెలంగాణ జీఎస్‌డీపీలో ఔట్‌స్టాండింగ్‌ లయబిలిటీ 27.4 శాతం ఉంది. పంజాబ్‌ 53.5 శాతం, కేరళ 38.3 శాతం, పశ్చిమ బెంగాల్‌ 38.8 శాతం, ఆంధ్రప్రదేశ్‌ 37.6 శాతం, హర్యానా 35.3 శాతం, యూపీ 34.2 శాతం, బీహార్‌ 34 శాతం, అస్సాం 31.9 శాతం కలిగి ఉన్నాయని రిజర్వ్ బ్యాంకు లెక్కలే చెబుతున్నాయి. అన్ని రాష్ట్రాలూ 'తెలంగాణ ఔట్‌స్టాండింగ్‌ లయబిలిటీ' కంటే ఎక్కువ అప్పులు కలిగి ఉన్నాయి.

ఇక మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, కాళేశ్వరం ఇతర ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఔట్‌స్టాండింగ్‌ గ్యారంటీలు రిజర్వు బ్యాంక్‌ సూచించిన నిబంధనల మేరకు ఉన్నాయి. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోని అప్పును తెలంగాణ తీసుకోకుండా కేంద్రం జాప్యం చేయడం, ఆంక్షలు విధించడం ఎఫ్‌ఆర్‌బీఎం చట్టాలకే కాక, రాజ్యాంగానికి, సుప్రీంకోర్టు తీర్పులకు కూడా విరుద్ధం.

తెలంగాణ ఔట్‌స్టాండింగ్‌ లయబిలిటీ (27.4 శాతం) తోపాటు ఔట్‌స్టాండింగ్‌ హామీ (11.5 శాతం)లు కలిపి చూస్తే 2022 మార్చి నాటికి 38.9 శాతం మాత్రమే ఉన్నది. తెలంగాణ ప్రభుత్వ రెవెన్యూ రాబడిలో వడ్డీ చెల్లింపులు దాదాపు పది శాతమే. తెలంగాణ ఆర్థిక పరిస్థితి భారత దేశ స్థూల ఆర్థిక పరిస్థితితో పోల్చితే ఎంతో మెరుగ్గా ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయినా కేంద్రం తెలంగాణ‌పై బుర‌ద‌జ‌ల్ల‌డం మానుకోవ‌డం లేదు.

First Published:  21 July 2022 1:45 AM GMT
Next Story