Telugu Global
National

ఎయిర్ పోర్ట్‌ల‌ భద్రత గాలికి.. ఆర్ఎస్ఎస్ ఆఫీస్‌కి టైట్ సెక్యూరిటీ

ఆర్ఎస్ఎస్ పై అంత ప్రేమ ఉంటే.. ప్రైవేట్ సెక్యూరిటీ పెంచుకోవచ్చుకదా అని సూచించారు కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, శశిథరూర్. ఎయిర్ పోర్ట్‌ల నుంచి CISF దళాలను ఉపసంహరించుకోవడంపై వారు మండిపడ్డారు.

ఎయిర్ పోర్ట్‌ల‌ భద్రత గాలికి.. ఆర్ఎస్ఎస్ ఆఫీస్‌కి టైట్ సెక్యూరిటీ
X

ఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ ఆఫీస్ కి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సెక్యూరిటీని ఏర్పాటు చేసింది కేంద్రం. కానీ ఈ CISF సెక్యూరిటీని ఎయిర్ పోర్ట్ ల నుంచి తరలించడమే ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఎయిర్ పోర్టుల్లో సెక్యూరిటీని తగ్గించి ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి భద్రతగా పంపించాల్సిన అవసరం ఏమొచ్చిందని నిలదీస్తున్నారు కాంగ్రెస్ నేతలు. ఆర్ఎస్ఎస్ పై అంత ప్రేమ ఉంటే.. ప్రైవేట్ సెక్యూరిటీ పెంచుకోవచ్చుకదా అని సూచించారు కాంగ్రెస్ నేతలు జైరాం రమేష్, శశిథరూర్. ఎయిర్ పోర్ట్‌ల నుంచి CISF దళాలను ఉపసంహరించుకోవడంపై వారు మండిపడ్డారు.

50 సివిల్ ఎయిర్ పోర్టుల్లో ఉన్న 3049 CISF సెక్యూరిటీని వెనక్కి పిలిపించింది కేంద్రం. వీరి స్థానంలో 1,924 ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని నియమించబోతున్నారు. సీసీ టీవీ కెమెరాలు, బ్యాగేజ్ స్కానర్‌ ల వంటి స్మార్ట్ నిఘా సాంకేతికతను కూడా ఉపయోగించుకుంటామని చెబుతున్నారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఫైరయ్యారు. సామాన్యులు, విమాన ప్రయాణికుల భద్రత కేంద్రానికి పట్టదా అని ప్రశ్నించారు. కేంద్రానికి ఆర్ఎస్ఎస్ భద్రతే అంత ముఖ్యమా అని ఎద్దేవా చేశారు.

ఢిల్లీ ఝండేవాలన్‌ లో ఉన్న ఆర్ఎస్ఎస్ కార్యాలయం కేశవ్ కుంజ్ తోపాటు, ఉదాసిన్ ఆశ్రమం వద్ద కూడా సెప్టెంబర్ 1 నుంచి CISF భద్రత ఏర్పాటు చేశారు. ఈ ప్రైవేటు కార్యాలయాల భద్రత ప్రభుత్వానికెందుకంటూ నిలదీస్తున్నారు కాంగ్రెస్ నేతలు. మరోవైపు విమానాశ్రయాల వంటి ప్రభుత్వ ఆస్తుల భద్రతకు ప్రైవేటు సెక్యూరిటీని నియమించుకుంటున్నారని ఇదెక్కడి న్యాయమంటూ నిలదీస్తున్నారు. ప్రభుత్వ ఆస్తుల భద్రత ప్రైవేటు వారికి, ప్రైవేటు కార్యాలయాల భద్రత ప్రభుత్వ సిబ్బందికి కట్టబెట్టడం సరికాదంటున్నారు.

First Published:  7 Sep 2022 2:55 AM GMT
Next Story