Telugu Global
National

గుడ్డుకు గుడ్ బై.. స్కూల్ పిల్లలకు ప్యూర్ వెజ్

కమిటీలో స్కూల్ టీచర్లు కానీ, తల్లిదండ్రుల ప్రతినిధులు కానీ లేరు. కొంతమంది వైద్యులు, బీజేపీకి కావాల్సిన వ్యక్తులు ఉన్నారు.

గుడ్డుకు గుడ్ బై.. స్కూల్ పిల్లలకు ప్యూర్ వెజ్
X

దేశవ్యాప్తంగా స్కూల్ పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేర్పులపై కేంద్రం ఓ నిపుణుల కమిటీని వేసింది. ఆ కమిటీ రూపొందించిన సలహా నివేదిక ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా విద్యను కాషాయీకరణ చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఆహారాన్ని కూడా అందుకు అనుగుణంగా మార్చుకుంటున్నారనే అపవాదు కచ్చితంగా వినిపించే అవకాశాలున్నాయి. ఎందుకంటే విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనంలో గుడ్డుని కూడా తీసేయాలంటూ ఆ కమిటీ సూచించింది. ఒకవేళ స్థానిక ప్రభుత్వాలు ఎక్కడైనా మాంసాహారం పెడుతున్నా.. దాన్ని కూడా నిలిపివేయాలనే సూచన చేసింది. అయితే అధికారికంగా ఇది ఇంకా అమలులోకి రాలేదు కానీ, ఈ సలహాలను కేంద్రం యధాతథంగా పాటిస్తే మాత్రం గుడ్డుకి గుడ్ బై చెప్పేసినట్టే.

ప్రతిరోజూ గుడ్డు తినండి అనారోగ్యానికి దూరంగా ఉండండి అంటారు. వైద్యులు కూడా గుడ్డుతినే అలవాటు, అవకాశం ఉన్నవారు.. రోజుకు ఒక గుడ్డు తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు సమృద్ధిగా అందుతాయని చెబుతారు. కానీ, ఇక్కడ కేంద్రం నియమించిన కమిటీ మాత్రం గుడ్డుని చిన్నచూపు చూసింది. ఆ కమిటీలో స్కూల్ టీచర్లు కానీ, తల్లిదండ్రుల ప్రతినిధులు కానీ లేరు. కొంతమంది వైద్యులు, బీజేపీకి కావాల్సిన వ్యక్తులు ఉన్నారు. వారు సిద్ధం చేసిన నివేదిక ప్రకారం.. భోజనంలో వడ్డించే పదార్థాల్లో కొలెస్ట్రాల్ ఉండకూడదు. అంటే గుడ్డు ఉండకూడదనమాట.

అధిక క్యాల‌రీలు, కొవ్వు వల్ల ఊబకాయం వస్తుందని, హార్మోన్ల అసమతూకం ఏర్పడుతుందని, గుడ్లు, మాంసం తరచుగా తినడం వల్ల లభించే కొలెస్ట్రాల్‌తో షుగర్ వ్యాధి, ముందస్తు రుతుస్రావం, వంధ్యత్వం.. వంటి లక్షణాలు వస్తాయని చెబుతున్నారు. మాంసం వల్ల వల్ల హార్మోనల్ ప్రాబ్లమ్స్ వస్తాయని పలు దేశాల్లో జరిపిన అధ్యయనాలు తెలిపాయని నిపుణుల కమిటీ సూచనల్లో ఉంది. మరి ఈ సూచనలను కేంద్రం పరిగణలోకి తీసుకుంటుందో లేదో చూడాలి

గుడ్లు, మాంసం నుంచి మాంసకృత్తులు మాత్రమే కాకుండా బీ-12, ఐరన్‌ వంటి పోషకాలు కూడా లభిస్తాయనేది న్యూట్రిషనల్ ఎక్స్ పర్ట్ లు చెప్పేమాట. మరి దీన్ని పక్కనపెట్టి నిపుణుల కమిటీ గుడ్డు, మాంసాహారాన్ని పక్కనపెట్టాలని చెప్పడం ఎంతవరకు సమంజసం అని అంటున్నారు కొంతమంది. బీజేపీ కావాలనే మాంసాహారుల్ని టార్గెట్ చేసిందనే ఆరోపణలు వినపడుతున్నాయి.

First Published:  15 July 2022 4:59 AM GMT
Next Story