Telugu Global
National

మోదీ టీమ్ మంత్రాంగం.. నేడే కేంద్ర మంత్రి వర్గ సమావేశం

బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్న వేళ.. ఎన్డీఏని మరింత పటిష్ట పరిచేందుకు కమలనాథులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మిత్రపక్షాలను సంతృప్తి పరిచే క్రమంలో కేంద్రంలో ఉదారంగా మంత్రి పదవులు ఆశ చూపే అవకాశముంది.

మోదీ టీమ్ మంత్రాంగం.. నేడే కేంద్ర మంత్రి వర్గ సమావేశం
X

కేంద్ర మంత్రి వర్గం ఈరోజు సమావేశమవుతుంది. ప్రగతి మైదాన్‌ లో కొత్తగా నిర్మించిన కన్వెన్షన్‌ సెంటర్‌ లో కేబినెట్ భేటీ ఉంటుంది. ఈ ఏడాదిలో వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయా రాష్ట్రాలకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు ఈ సమావేశంలో తీసుకునే అవకాశముంది.

పోలవరం నిధులపై..

ఏపీలో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి నిధుల విడుదలపై కేబినెట్ లో నిర్ణయం తీసుకునే అవకాశముంది. రూ.12,911.15 కోట్ల నిధుల విడుదలకు సంబంధించి కేంద్ర మంత్రి మండలికి పంపాల్సిన ప్రతిపాదనను ఈరోజే ఖరారు చేయబోతున్నారు. కేంద్ర జల్‌ శక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఆధ్వర్యంలో జరిగే ఉన్నతస్థాయి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకుంటారు. అనంతరం ఈ ప్రతిపాదనను కేబినెట్ కి పంపిస్తారు. కేబినెట్ లో ఆమోద ముద్ర పడితే, నిధుల విడుదలకు మార్గం సుగమం అవుతుంది. ఏపీకి సంబంధించి ఇది కీలక అంశం కాబోతోంది.

మార్పులు, చేర్పులు..

ఎన్నికల వేళ కేంద్ర కేబినెట్ లో కీలక మార్పులు ఉంటాయనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. మహారాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామిగా మారిన అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ ఎంపీ ప్రఫుల్ పటేల్ కి కేంద్ర కేబినెట్ లో చోటు దక్కుతుందని అంటున్నారు. అదే సమయంలో ఇప్పటి వరకూ డిప్యూటీ సీఎం గా ఉన్న దేవేంద్ర ఫడ్నవీస్ ని కూడా కేబినెట్ లోకి తీసుకునే అకాశాలున్నాయని తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి మార్పు ఖాయమైతే.. కిషన్ రెడ్డి పదవికి ఎసరు వచ్చే అవకాశం కూడా ఉంది.

బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఏకమవుతున్న వేళ.. ఎన్డీఏని మరింత పటిష్ట పరిచేందుకు కమలనాథులు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. మిత్రపక్షాలను సంతృప్తి పరిచే క్రమంలో కేంద్రంలో ఉదారంగా మంత్రి పదవులు ఆశ చూపే అవకాశముంది. ఎన్నికల ఏడాదిలో ఇలాంటి జిమ్మిక్కులు బీజేపీకి అలవాటే. ఏడాది కాలం ఉండే మంత్రి పదవులను ఎరగా వేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోంది బీజేపీ. ఆ దిశగా పార్టీ వ్యూహాలు ఎలా ఉంటాయనేది ఈరోజు కేబినెట్ భేటీలో స్పష్టమయ్యే అవకాశముంది.

First Published:  3 July 2023 1:06 AM GMT
Next Story