Telugu Global
National

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్..!

కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ సింగ్ పటేల్ సైతం మహిళా రిజర్వేషన్ బిల్లుపై ట్వీట్ చేశారు. మహిళా రిజర్వేషన్ డిమాండ్‌ను మోడీ సర్కార్ నెరవేరుస్తుందన్నారు.

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్ సిగ్నల్..!
X

ప్రధాని మోడీ అధ్యక్షతన సోమవారం జరిగిన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుకు ఆమోదం తెలిపింది. అయితే ఈ విషయంపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సాధారణంగా కేబినెట్‌ మీటింగ్ తర్వాత సమావేశంలో ఏం చర్చించారనేదానిపై బ్రీఫింగ్ ఉంటుంది. కానీ, ఈసారి మాత్రం ప్రభుత్వం ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టింది. దీంతో కేబినెట్‌ మీటింగ్‌లో ఏం చర్చించారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.

అయితే ఈసారి చారిత్రాత్మక నిర్ణయాలు ఉంటాయని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు కేంద్ర కేబినెట్‌ సమావేశంపై ఆసక్తిని పెంచాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు, ఓబీసీ రిజర్వేషన్లు, ఒకే దేశం-ఒకే ఎన్నిక, దేశం పేరు మార్పు లాంటి బిల్లులను కేబినెట్ క్లియర్ చేస్తుందని మొదటి నుంచి ప్రచారం జరిగింది. సమావేశం తర్వాత దీనిపై స్పష్టత వస్తుందని అనుకున్నప్పటికీ.. ప్రభుత్వం బ్రీఫింగ్‌ చేయకపోవడంతో సస్పెన్స్ కొనసాగుతోంది. సమావేశం ముగిసిన తర్వాత.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి.

మరోవైపు కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ సింగ్ పటేల్ సైతం మహిళా రిజర్వేషన్ బిల్లుపై ట్వీట్ చేశారు. మహిళా రిజర్వేషన్ డిమాండ్‌ను మోడీ సర్కార్ నెరవేరుస్తుందన్నారు. ఆ ధైర్యం మోడీ సర్కార్‌కే ఉందని.. మంత్రి వర్గ ఆమోదంతో ఇది రుజువైందన్నారు. కాసేపటికే ఈ ట్వీట్‌ను ప్రహ్లాద్‌ సింగ్ తొలగించారు. పార్లమెంట్ స్పెషల్‌ సెషన్స్‌లో ఈ కీలక బిల్లుకు ఆమోదం తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందితే.. లోక్‌సభతో పాటు రాష్ట్రాల శాసనసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి.

First Published:  19 Sep 2023 2:18 AM GMT
Next Story