Telugu Global
National

ప్రాంతీయ మండలి సమావేశం.. తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మొండి చెయ్యి..

దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో తెలుగు రాష్ట్రాల సమస్యలకు పరిష్కారం చూపించే విషయంలో కేంద్రం మరోసారి మొండి వైఖరి ప్రదర్శించింది.

ప్రాంతీయ మండలి సమావేశం.. తెలుగు రాష్ట్రాలకు మళ్లీ మొండి చెయ్యి..
X

తిరువనంతపురంలో జరిగిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో తెలుగు రాష్ట్రాల సమస్యలకు పరిష్కారం చూపించే విషయంలో కేంద్రం మరోసారి మొండి వైఖరి ప్రదర్శించింది. ముఖ్యంగా ఏపీకి చెందిన డిమాండ్లపై ఏమాత్రం సానుకూలంగా స్పందించలేదు. కనీసం ప్రాజెక్ట్ లకు సాయం చేస్తామనే హామీ కూడా కేంద్రం నుంచి రాలేదు. అటు తెలంగాణపై కోపంతో ఏపీకి విద్యుత్ బకాయిలు తక్షణం చెల్లించాల్సిందేనని మరోసారి కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.

ఎనిమిదేళ్లుగా అభివృద్ధి ప్యాకేజీ ఊసే లేదు..

గతేడాది జరిగిన సమావేశాల్లో ప్రత్యేక హోదా గురించి సీఎం జగన్ ప్రశ్నించారు. ఈ సమావేశాలకు ఏపీ తరపున హాజరైన ఆర్థిక మంత్రి బుగ్గన.. హోదా ప్రస్తావన చేయలేదు. దాని బదులు.. ఏపీలోని 7 జిల్లాలకు విభజన చట్టం ప్రకారం ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. బుందేల్ ఖండ్ తరహాలో ఈ ప్యాకేజీ ఉంటుందని ఆనాడు పార్లమెంట్‌లో హామీ ఇచ్చారని, ఎనిమిదేళ్లవుతున్నా అది అమలుకి నోచుకోలేదని చెప్పారు బుగ్గన.

అభ్యర్థనలు తప్ప హామీలు లేవు..

ఏపీలో పోలవరం పూర్తి చేయడానికి కేంద్రం తన సహకారం కొనసాగించాలని కోరారు మంత్రి బుగ్గన. ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు ఇచ్చినట్టే తమ రాష్ట్రంలోని పరిశ్రమలకు కూడా రాయితీలివ్వాలని అన్నారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ త్వరగా ఏర్పాటు చేయాలన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, సంస్థల విభజన త్వరగా పూర్తయ్యేలా చూడాలన్నారు. కేంద్ర వ్యవసాయ యూనివర్శిటీ మంజూరు చేయాలని కోరారు. అయితే వీటిలో ఏ ఒక్కదానికి కూడా అమిత్ షా హామీ ఇవ్వలేదని తెలుస్తోంది, కేవలం పరిశీలనకు తీసుకుంటున్నట్టుగానే ఆయన తెలియజేశారని సమాచారం.

తెలంగాణపై కోపంతో..

తెలంగాణ రాష్ట్రంపై రగిలిపోతున్న కేంద్రం.. తాజాగా ఏపీకి చెల్లించాల్సిన విద్యుత్ బకాయిల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని చూస్తోంది. ఏపీకి విద్యుత్‌ బకాయిల్ని చెల్లించి తీరాల్సిందేనని మరోసారి ఈ మీటింగ్‌లో తెలంగాణకు స్పష్టం చేశారు అమిత్ షా. రూ.6,756 కోట్ల బకాయిల్ని నెల రోజుల్లో చెల్లించాలని కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ ఇప్పటికే ఆదేశాలివ్వగా, దీనిపై ప్రాంతీయ మండలి సమావేశంలోనూ చర్చ జరిగింది. అయితే విభజన చట్టం ప్రకారం ముందు కేంద్రం నుంచి తమకు రావాల్సిన వాటి సంగతేంటని తెలంగాణ ప్రతినిధులు ప్రశ్నించారు. కేంద్రం ఇవ్వాల్సినవి ఆలస్యం చేస్తూ, బకాయిలు చెల్లించాలంటూ తెలంగాణపై ఒత్తిడి చేయడం సరికాదన్నారు. ఇప్పటికే దీనిపై ఇంధన శాఖ ఆదేశాలిచ్చింది కాబట్టి.. బకాయిల చెల్లింపు అంశాన్ని అజెండా నుంచి తొలగించాలని తెలంగాణ ప్రతినిధులు కోరారు. కానీ బకాయిలు చెల్లించే వరకు అది అజెండా అంశంగానే ఉంటుందని చెప్పారట అమిత్ షా. తెలంగాణపై తనకున్న అక్కసుని ఆయన అలా బయట పెట్టుకున్నారు.

First Published:  4 Sep 2022 5:01 AM GMT
Next Story