Telugu Global
National

కోరమాండల్ ప్రమాదంపై సీబీఐ ఎంక్వయిరీ..

ఒడిశా ప్రమాదం తర్వాత రైల్వే మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్లు వినిపించాయి. కానీ దీన్ని కేంద్రం లైట్ తీసుకుంది. తమ తప్పేమీ లేదని చెప్పుకోడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది.

కోరమాండల్ ప్రమాదంపై సీబీఐ ఎంక్వయిరీ..
X

కోరమాండల్ ఎక్స్ ప్రెస్ ప్రమాదంపై సీబీఐ దర్యాప్తుకి సిఫారసు చేస్తున్నట్టు రైల్వేబోర్డ్ నిర్ణయించిందని తెలిపారు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్. భువనేశ్వర్‌ లో మీడియాతో మాట్లాడిన ఆయన.. సహాయక కార్యక్రమాలు పూర్తయ్యాయని చెప్పారు. ప్రమాదం జరిగిన చోట రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని అన్నారు. డౌన్ లైన్ ట్రాక్ ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించారు. అక్కడ రైళ్ల రాక మొదలైంది. మెయిన్ లైన్ ని కూడా పూర్తి చేసి బుధవారం ఉదయానికల్లా అక్కడ రైళ్లు యధావిధిగా నడిచేలా చేస్తామన్నారు మంత్రి అశ్వినీ వైష్ణవ్.


రాజీనామా డిమాండ్ ని తప్పించుకోడానికేనా..?

ఒడిశా ప్రమాదం తర్వాత రైల్వే మంత్రి రాజీనామా చేయాలంటూ డిమాండ్లు వినిపించాయి. కానీ దీన్ని కేంద్రం లైట్ తీసుకుంది. తమ తప్పేమీ లేదని చెప్పుకోడానికి తీవ్ర ప్రయత్నాలు చేసింది. రైల్వేలకు కేంద్రం పెడుతున్న ఖర్చు లెక్కలు బయటకు తీసింది. అయితే అంతలోనే కాగ్ రిపోర్ట్ కూడా బయటకు రావడంతో ఖంగుతిన్నది. రైల్వేకు ఖర్చు పెడుతున్నారు కానీ, ప్రమాదాల నివారణకు కేటాయింపులు లేవని, కనీసం ఆ విభాగంలో ఉద్యోగాల భర్తీ కూడా చేపట్టలేదని తేలడంతో కేంద్రం నష్టనివారణ చర్యలకు దిగింది. ప్రస్తుతం ఈ కేసును ప్రభుత్వ రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తుండగా, సీబీఐకి అప్పగించేందుకు రైల్వే బోర్డ్ నిర్ణయం తీసుకుంది.

రైలు ప్రమాదానికి గల కారణాల విషయంలో ఇప్పటికే ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. సిగ్నలింగ్‌ లో సమస్య కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా తేలిందని చెప్పారు రైల్వే బోర్డు సభ్యురాలు జయవర్మ సిన్హా. రైల్వే సేఫ్టీ కమిషనర్‌ నుంచి పూర్తి స్థాయి నివేదిక రావాల్సి ఉందన్నారు. ఆగి ఉన్న గూడ్స్‌ రైలులో ఇనుప ఖనిజం ఉండటం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని అనుమానిస్తున్నారు అధికారులు. డ్రైవర్‌ తప్పిదం లేకపోవచ్చని రైల్వేశాఖ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.

First Published:  4 Jun 2023 5:47 PM GMT
Next Story