Telugu Global
National

అప్పుడు హీరో.. ఇప్పుడు విలన్.. సమీర్ వాంఖడేపై సీబీఐ కేసు

మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ(NCB) ముంబై విభాగం మాజీ జోనల్‌ డైరెక్టర్‌, ఐఆర్‌ఎస్‌ అధికారి సమీర్‌ వాంఖడేపై సీబీఐ తాజాగా కేసు నమోదు చేసింది. పెద్ద మొత్తంలో ఆయన షారుఖ్ ఖాన్ నుంచి డబ్బులు డిమాండ్ చేశారని అభియోగాలు మోపారు.

అప్పుడు హీరో.. ఇప్పుడు విలన్.. సమీర్ వాంఖడేపై సీబీఐ కేసు
X

బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారణలో అప్పట్లో సమీర్ వాంఖడే అనే ఐఆర్ఎస్ అధికారి పేరు మారుమోగిపోయింది. హీరో కొడుకు అయినా సరే, పెద్ద స్థాయిలో ఒత్తిడి వచ్చినా సరే సమీర్ లొంగలేదని అనుకున్నారు. అయితే తర్వాతే వ్యవహారం తేడా కొట్టింది. కేవలం డబ్బులకు ఆశపడే ఆ కేసులో షారుఖ్ ఖాన్ కొడుకుని ఇరికించారనే ఆరోపణలొచ్చాయి. అవి కేవలం ఆరోపణలు కాదని, సమీర్ వాంఖడే నిజంగానే తప్పుచేశారంటూ సీబీఐ తాజాగా ఆయనపై కేసు నమోదు చేయడం విశేషం. అప్పట్లో సమీర్ ఫైల్ చేసిన కేసులో షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ కు NCB క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

మాదకద్రవ్యాల నియంత్రణ సంస్థ(NCB) ముంబై విభాగం మాజీ జోనల్‌ డైరెక్టర్‌, ఐఆర్‌ఎస్‌ అధికారి సమీర్‌ వాంఖడేపై సీబీఐ తాజాగా కేసు నమోదు చేసింది. పెద్ద మొత్తంలో ఆయన షారుఖ్ ఖాన్ నుంచి డబ్బులు డిమాండ్ చేశారని అభియోగాలు మోపారు. ఇందులో మరో నలుగురు కూడా ఉన్నారని, మొత్తంగా వారు 25కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేశారని సీబీఐ చెబుతోంది. ఈ అభియోగాల మేరకు సమీర్ పై కేసు నమోదు చేసింది సీబీఐ.

ముంబై, ఢిల్లీ, రాంచీ, కాన్పూర్‌ లో వాంఖడేకు చెందిన 29 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. సమీర్ వాంఖడే ముంబై విభాగం జోనల్‌ డైరెక్టర్‌ గా ఉన్నప్పుడు లంచం కింద అడ్వాన్స్ గా 50 లక్షల రూపాయలు తీసుకున్నారన్న సమాచారంతో సీబీఐ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత సిట్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. చివరకు ఆయన పాతిక కోట్లు డిమాండ్ చేశారని, అది ఇవ్వకపోవడంతో ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేసి ఇబ్బంది పెట్టారని అన్నారు. ప్రస్తుతం సీబీఐ.. సమీర్ వాంఖడేపై కేసు నమోదు చేయడం ఈ వ్యవహారంలో కీలక పరిణామం. అప్పట్లో డబ్బులకు లొంగలేదు అని పేరుతెచ్చుకున్న అధికారి, ఇప్పుడిలా లంచం కేసులో బుక్కవడం విశేషం.

First Published:  13 May 2023 7:53 AM GMT
Next Story