Telugu Global
National

ఓ దళిత‌ కుటుంబాన్ని కాల్చి పారేస్తానన్న‌ కర్ణాటక మంత్రి... ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిన పోలీసులు

కర్నాటకకు చెందిన బీజేపీ మంత్రి ఆనంద్ సింగ్ ఓ దళిత కుటుంబాన్ని కాల్చిపడేస్తానని హెచ్చరించారు. దాంతో ఆ దళిత కుటుంబం ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. పోలీసులు మంత్రిపై, దళిత కుటుంబంపై కేసు నమోదు చేశారు.

ఓ దళిత‌ కుటుంబాన్ని కాల్చి పారేస్తానన్న‌ కర్ణాటక మంత్రి... ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిన పోలీసులు
X

న్యాయం చేయాలని కోరిన ఓ దళిత కుటుంబానికి అండగా నిలవకపోగా.. ఆ కుటుంబ సభ్యులందరినీ కాల్చి పారేస్తానని హెచ్చరించిన మంత్రి ఉదంతమిది.. కర్ణాటకలో ఇది సంచలనం రేపింది. ఇలా ఓ దళిత, నిరుపేద కుటుంబాన్ని బెదిరించిన టూరిజం శాఖ మంత్రి ఆనంద్ సింగ్ పై పోలీసులు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేశారు. హోస్పేట జిల్లాలో ఓ భూ వివాదానికి సంబంధించి పోలప్ప అనే వ్యక్తి తన కుటుంబంతో సహా వచ్చి.. తమగ్రామంలో తమ భూమిని కొందరు అన్యాయంగా ఆక్రమించుకుంటున్నారని, తమకు న్యాయం చేయాలని ఆనంద్ సింగ్ ని కోరాడు. ఎస్సీ సామాజికవర్గానికి చెందిన తాము వారిని ఎదిరించలేకపోతున్నామన్నాడు. అయితే ఆనంద్ సింగ్ వారికి ఎలాంటి హామీనివ్వకపోగా.. ఆ ఫ్యామిలీని మొత్తం కాల్చి పారేస్తానని హెచ్చరించాడు.

దీంతో పోలప్ప అతని కుటుంబ సభ్యులు నిన్న ఆయనపై హోస్పేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అదే సమయంలో మూకుమ్మడిగా తమను తాము సజీవ దహనం చేసుకునేందుకు యత్నించారు. అయితే పోలీసులు వారిని వారించి ఆసుపత్రికి తరలించారు. అటు ఆనంద్ సింగ్ పైన, మరో ముగ్గురిపైనా పోలీసులు ఎస్సీ,ఎస్టీ చట్టం కింద కేసు పెట్టడమే గాక.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారంటూ పోలప్ప కుటుంబం పై కూడా కేసు నమోదు చేశారు.

ఈ ఉదంతంపై మీడియా ఆనంద్ సింగ్ వివరణ కోరడానికి యత్నించినప్పటికీ ఆయన స్పందించలేదు.





First Published:  31 Aug 2022 2:51 PM GMT
Next Story