Telugu Global
National

లవ్ చేస్తావా.. లేదా..? నీ ఫొటో స్టేటస్‌లో పెట్టేస్తా

ఇన్ స్టా గ్రామ్‌లో ఆ అమ్మాయి ఫొటోని స్టేటస్‌గా పెట్టి, పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. ఆ బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో, వారు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టారు.

లవ్ చేస్తావా.. లేదా..? నీ ఫొటో స్టేటస్‌లో పెట్టేస్తా
X

ప్రేమించకపోతే ప్రాణాలు తీస్తున్నవారిని, యాసిడ్ దాడులు చేస్తున్నవారిని చూస్తూనే ఉన్నాం. మరోవైపు మరికొంతమంది శాడిస్ట్ లు కూడా తయారవుతున్నారు. వీరు బెదిరింపులకు పాల్పడతారు. ముఖ్యంగా సోషల్ మీడియాని అడ్డుగా పెట్టుకుని ప్రేమించాలంటూ బెదిరిస్తుంటారు. మార్ఫింగ్ ఇమేజ్‌లతో లొంగదీసుకోవాలనుకుంటారు. ఇలాంటి ఓ బాలుడిపై మహారాష్ట్రలో పోక్సో చట్టం కింద కేసు పెట్టారు. తన తోటి విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధిస్తున్నందుకు పోలీసులు కేసు పెట్టి అదుపులోకి తీసుకున్నారు.

మహారాష్ట్రలోని పుణెలో ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదువుకుంటున్న 14 ఏళ్ల బాలుడు, తన క్లాస్ మేట్ అయిన 13 ఏళ్ల బాలికను లవ్ చేస్తున్నానంటూ వేధించడం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి అతడిని పట్టించుకోలేదు. వేధింపులు ఎక్కువయ్యే సరికి స్కూల్‌లో టీచర్లకు చెబుతానంటూ వార్నింగ్ ఇచ్చింది. అవమానంగా భావించిన ఈ బాలుడు, ఆ అమ్మాయిని కూడా సోషల్ మీడియా ద్వారా అవమానించాలనుకున్నాడు. ఇన్ స్టా గ్రామ్‌లో ఆ అమ్మాయి ఫొటోని స్టేటస్‌గా పెట్టి, పెళ్లి ప్రపోజల్ పెట్టాడు. ఆ బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో, వారు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టారు.

నా భార్యవు అవుతావా..?

గతంలో ఎవరైనా లవ్ ప్రపోజల్ చేయాలనుకుంటే గుట్టు చప్పుడు కాకుండా ప్రేమించినవారికి తమ మనసులోమాట చెప్పేవారు. మరికొందరు ప్రేమలేఖలు రాసేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రేమ అయినా, ద్వేషం అయినా పదిమందికీ తెలిసేలా చేస్తున్నారు. ఇటీవల లవ్ ప్రపోజల్స్ అన్నీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లోనో, జనసమ్మర్థం ఉన్న ప్రాంతాల్లోనో, లేక స్కూల్, కాలేజీలో స్నేహితులందరూ చూస్తుండగానో చేస్తున్నారు. పుణె బాలుడు కూడా ఇదే పద్ధతి అవలంబించాడు. ఇన్ స్టా గ్రామ్‌లో స్నేహితురాలి ఫొటో పెట్టి, నా భార్యవు అవుతావా అంటూ ప్రపోజ్ చేశాడు. ఫొటో పెట్టి మరీ తన పరువు బజారు కీడ్చినందుకు ఆ బాలిక తల్లిదండ్రులకు చెప్పి పోలీస్ కేసు పెట్టించింది. దీంతో అతడికి బేడీలు పడ్డాయి.

First Published:  24 Nov 2022 7:00 AM GMT
Next Story