Telugu Global
National

రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్దరిస్తారా? ఆ ప్రక్రియ ఎలా ఉంటుంది?

సుప్రీంకోర్టు స్టే విధించిన వెంటనే కాంగ్రెస్ ఎంపీ ఆధిర్ రంజన్ చౌదరి వెంటనే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని వెంటనే పునరుద్దరించేలా చూడాలని కోరారు.

రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్దరిస్తారా? ఆ ప్రక్రియ ఎలా ఉంటుంది?
X

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. 'మోడీ ఇంటి పేరు' కేసులో గుజరాత్ హైకోర్టు రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. కాగా, తాజాగా ఆ తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో రాహుల్ గాంధీ లోక్‌సభలో అడుగుపెట్టడానికి మార్గం సుగమమం అయ్యింది. అయితే, రాహుల్ సభ్యత్వాన్ని లోక్‌సభ కార్యదర్శి ఎప్పుడు పునరుద్దరిస్తారనేదే ఇప్పుడు అందరి మదిని తొలుస్తున్న ప్రశ్న.

రాహుల్ గాంధీపై వేసిన అనర్హతను వెంటనే తొలగిస్తే.. ఆయన ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ సమావేశాలకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వంపై పెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగే చర్చలో, ఓటింగ్‌లో రాహుల్ గాంధీ పాల్గొనే అవకాశం ఉంది. అయితే రాహుల్ ఎంపీ సభ్యత్వాన్ని పునరుద్దరించడానికి ఎంత సమయం పడుతుందో మాత్రం కచ్చితంగా తెలియడం లేదు.

లోక్‌సభ సభ్యత్వాన్ని పునరుద్దరించాలంటే.. ముందుగా రాహుల్ గాంధీపై గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై.. సుప్రీం ఇచ్చిన స్టే ఆర్డర్‌ను లోక్‌సభ కార్యదర్శికి సమర్పించాల్సి ఉంటుంది. వాయనాడ్ పార్లమెంటు ఎంపీగా తన సభ్యత్వాన్ని పునరుద్దరించాలని కోరుతూ.. సుప్రీంకోర్టు ఆర్డర్‌ను కార్యదర్శికి అందజేయాలి. ఆ తర్వాత రాహుల్ గాంధీకి లోక్‌సభ కార్యదర్శి అంగీకారాన్ని తెలిపే పత్రాన్ని జారీ చేస్తారు. అయితే దీనికి ఎంత సమయం తీసుకుంటారనేది తెలియదు.

ఇటీవల లక్ష్యద్వీప్ పార్లమెంట్ సభ్యుడు మొహమ్మద్ ఫైజల్‌పై అనర్హత వేటు పడింది. కేరళ హైకోర్టు అతడి అనర్హతపై స్టే విధించిన తర్వాత కూడా లోక్‌సభ కార్యదర్శి ఎంపీ సభ్యత్వాన్ని పునరుద్దరించలేదు. దాదాపు రెండు నెలల పాటు సదరు అప్లికేషన్‌ను తన వద్దే పెట్టుకున్నారు. తీరా మొహమ్మద్ ఫైజల్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఆ పిటిషన్ విచారణకు ముందు ఫైజల్‌ సభ్యత్వాన్ని పునరుద్దరించారు. ఇప్పుడు రాహుల్ విషయంలో కూడా తాత్సరం జరిగే అవకాశం ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

కాగా, సుప్రీంకోర్టు స్టే విధించిన వెంటనే కాంగ్రెస్ ఎంపీ ఆధిర్ రంజన్ చౌదరి వెంటనే లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని వెంటనే పునరుద్దరించేలా చూడాలని కోరారు. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించడం.. సత్యానికి లభించిన విజయంగా ఆధిర్ రంజన్ చౌదరి అభివర్ణించారు.

First Published:  4 Aug 2023 12:57 PM GMT
Next Story