Telugu Global
National

కేసీఆర్ మోడీకి ప్రత్యామ్నాయం కాగలరా..?

రాజకీయాల్లో నిరంతరం క్రియాశీలంగా ఉండాలనుకే వారికి కావలసింది ఇదే! నిరంతరం వార్తల్లో ఉండాలి. ఎల్లవేళలా చర్చలు వారి చుట్టూ పరిభ్రమిస్తూ ఉండాలి. ఈ ట్రిక్కు తెలంగాణ రాష్ట్ర నిర్మాత కేసీఆర్ కు తెలిసినంతగా మరెవరికీ తెలియదు.

కేసీఆర్ మోడీకి ప్రత్యామ్నాయం కాగలరా..?
X

''మోదీకి ప్రత్యామ్నాయంగా బలమైన నాయకుడిని ప్రజల ముందు ఉంచడంలో ప్రతిపక్షాలు విఫలమయ్యాయి. 2019లో బిజెపి ఈ కారణంగానే రెండోసారి భారీ మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది.'' అని 'ద రైజ్ ఆఫ్ ద బిజెపి: ద మేకింగ్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ' అనే పుస్తకాన్ని రచించిన బీజేపీ నాయకుడు, కేంద్రమంత్రి భూపేంద్రయాదవ్ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు.

భూపేంద్ర చెప్పింది అక్షరాలా నిజం. రాష్ట్రాలతో సహా జాతీయస్థాయిలోనూ ఒక నాయకుని కేంద్రంగా రాజకీయాలు నడవడం దాదాపు రెండు దశాబ్దాలుగా చూస్తున్నాం. మోడీ ప్రధాని అయింతర్వాత ఈ ధోరణి విశృంఖలంగా మారింది. మోడీ మైనస్ బీజేపీ గురించి ఇప్పుడు మాట్లాడే పరిస్థితి లేదు. కేసీఆర్ మైనస్ బిఆర్ఎస్, చంద్రబాబు మైనస్ తెలుగుదేశం, మమతా మైనస్ తృణమూల్ కాంగ్రెస్, స్టాలిన్ మైనస్ డీఎంకే, జగన్ మైనస్ వైసిపి, కేజ్రీవాల్ మైనస్ ఆప్, నితీష్ మైనస్ యునైటెడ్ జనతాదళ్, అఖిలేశ్ యాదవ్ మైనస్ సమాజ్ వాది పార్టీ.. ఇలా పలు పార్టీలు ఆయా పార్టీల అధినేతల కేంద్రంగానే రాజకీయ కార్యకలాపాలు నడుస్తున్నవి.

రాజకీయ విధానాలు, సిద్ధాంతాలతో ఎవరికీ పని లేదు. పార్టీ అధినేత చెప్పిందే వేదం. చేసిందే శాసనం. పార్టీలలో మోతాదుకు మించిన 'క్రమశిక్షణ' ఉండడం వలన అసమ్మతికి, సొంత అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి, స్వేచ్ఛగా మసలుకోవడానికి అవకాశం లేదు. అత్యంత ప్రజాస్వామిక పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ కూడా మినహాయింపు కాదు. ఆ పార్టీలో ఉన్న నాయకులు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకలను ధిక్కరించి ఎవరైనా మాట్లాడగలరా? మాట్లాడితే పార్టీలో కొనసాగగలరా? కొనసాగనిస్తారా ?నిజానికీ జాతీయపార్టీలకూ, ప్రాంతీయ పార్టీలకు మధ్య ప్రజాస్వామిక లక్షణాల విషయంలో మౌలికంగా కొంత తేడా ఉంటుందని ఆశించడం సహజం. అట్లా ఉండాలని కోరుకోవడమూ సహజమే. వ్యక్తి కేంద్రంగా పార్టీ నడిచినా విధానాల బలంతో, క్యాడర్ బేస్డ్ గా పార్టీ రూపాంతరం చెందగలిగితే సదరు పార్టీ దీర్ఘకాలం మనగలుగుతుంది. లేకపోతే ఆ పార్టీ ఎక్కువకాలం బతకదు.

కేంద్రమంత్రి భూపేంద్రయాదవ్ చెప్పినట్టుగా 'మోడీకి ప్రత్యామ్నాయంగా బలమైన నాయకుడు' ఇప్పుడు దేశానికి కావాలి. మోడీకి ప్రత్యామ్నాయం అనుకుంటున్న వారు చాలామందే ఉన్నారు. కానీ ఎవరి పరిమితులు, ఎవరి బలహీనతలు వారికున్నవి. 1.మోడీ, అమిత్ షా కుతంత్రాలను ఎదుర్కోలేమన్న భయం. 2.కాంగ్రెస్ పార్టీ ఇంజన్ కు తమ బోగీలను అటాచ్ చేయకతప్పదన్న అభిప్రాయం. ఈ రెండింటికి భిన్నంగా భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. జాతీయ రాజకీయాల్లో 'గుణాత్మక మార్పు' తీసుకురావడం కేసీఆర్ ఎజండా. ఆయన ఎజండాపై గడచిన నాలుగైదు రోజులుగా అనుకూలంగానో, వ్యతిరేకంగానో చర్చ జరుగుతోంది.

రాజకీయాల్లో నిరంతరం క్రియాశీలంగా ఉండాలనుకే వారికి కావలసింది ఇదే! నిరంతరం వార్తల్లో ఉండాలి. ఎల్లవేళలా చర్చలు వారి చుట్టూ పరిభ్రమిస్తూ ఉండాలి. ఈ ట్రిక్కు తెలంగాణ రాష్ట్ర నిర్మాత కేసీఆర్ కు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. 2001 నుంచి 2014 వరకు కేసీఆర్ మైనస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వార్తలు ఉండేవి కావు. చర్చలు ఉండేవి కావు. తెలంగాణ రాష్ట్ర అవతరణ తర్వాత కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ విధానాలు, ఇరిగేషన్ ప్రాజెక్టుల మెరుపులు, విద్యుత్తు వెలుగుల గురించి పాజిటివ్ చర్చలకు ఆయన కేంద్రబిందువు అయ్యారు. ఇక కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం, తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వాళ్లకు, తెలంగాణ ఉద్యమాన్ని కించపరచిన వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చారనో, ఇంకా అనేకానేక అధికార పదవులు కట్టబెట్టారనో విమర్శలు, ఆరోపణలు కూడా కేసీఆర్ ను నిత్యం వార్తల్లో, చర్చల్లో నిలబెడుతున్నవి.

కేసీఆర్ కు తెలంగాణ 'పిచ్'చాలా చిన్నది. కనుక ఆయన జాతీయ రంగస్థలాన్ని ఎంపిక చేసుకున్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ వంటి 'విజన్' ఉన్న నాయకుని అవసరం ఉన్నది. వెరపు లేకుండా మోడీతో తలపడగలిగిన దమ్మున్న వ్యక్తికి 'స్పేస్'ఉన్నది. ఎక్కడ ఎలాంటి స్పేస్ ఉంటుందో, ఏ సమయంలో ఎలాంటి ఎజండాతో కదనరంగంలోకి దూకాలో కేసీఆర్ కు 'తెలంగాణ' ఉద్యమం నేర్పింది.

ఇప్పుడు బిఆర్ఎస్ సక్సెస్ పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అనుమానాలు వ్యక్తమవుతున్నవి. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో ఓర్పుగా, నేర్పుగా పావులు కదుపుతున్నారు. 'దేశంలో రానున్నది రైతు ప్రభుత్వమ'ని ఆయన ప్రకటించారు.

కాగా 2024 లోక్ సభ ఎన్నికల్లో బిజెపి చెమటోడ్చవలసి ఉంది. మోదీ ప్రభావం ఇప్పటికే తారస్థాయికి చేరుకున్నది. ఇక ఇంతకంటే పెరిగే అవకాశం లేదు. మోదీ ఒక్కడి వల్లనో, లేదా సంస్థాగత బలాన్ని పటిష్టం చేయడం వల్ల కూడా విజయం సాధ్యం కాదని పరిశీలకులంటున్నారు. ప్రజల మనోభావాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారితే ఎంత బలమైన పార్టీ కూడా ఏమీ చేయజాలదు. అయితే పరాజయాలను కూడా విజయాలుగా మార్చుకోవడంలో బిజెపి అగ్రనాయక ద్వయం నరేంద్రమోదీ, అమిత్ షాల నుంచి కాంగ్రెస్ నాయకులు చాలా నేర్చుకోవలసి ఉన్నది.

2019 జనవరిలో కోల్‌కతాలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్‌వాది, నేషనలిస్టు కాంగ్రెస్, బిఎస్‌పి, డిఎంకెతో సహా 23 పార్టీలు ఉమ్మడిగా బ్రిగేడియర్ మైదానం బహిరంగ సభలో పాల్గొన్నవి. అయితే ప్రతి పార్టీ అధినేత తానే ప్రధానమంత్రి కావాలనుకోవడం వారి ప్రయోజనాలను దెబ్బతీసింది. మరోవైపు సంస్థాగత నిర్మాణం పటిష్టం చేసుకోవడం, నిరంతరం అగ్ర నాయకులు, కార్యకర్తల మధ్య సమన్వయ లోపం లేకుండా చూసుకోవడం బిజెపిని తిరుగులేని శక్తిలా మార్చివేశాయి. దేశంలోని 543 నియోజకవర్గాలకు గాను 160 లోక్ సభ నియోజకవర్గాల్లో 'డిజిటల్ మీడియా' ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు ఒక అధ్యయనంలో తేలింది. డిజిటల్ మీడియాను 2014 నుంచి బీజేపీ వలె సమర్ధంగా వినియోగిస్తున్న పార్టీ మనకు కనిపించదు. డిజిటల్ మీడియా ద్వారా తమ దేశభక్తిని చాటుకోవడంతో పాటు ప్రతిపక్షాలను దేశ వ్యతిరేకులుగా చిత్రించి అవాస్తవాలను వాస్తవాలుగా ప్రచారం చేస్తుండడంలో బీజేపీ సఫలమవుతోంది. ప్రతిపక్ష పార్టీలను, నాయకులను బలహీనపరిచేందుకు, లొంగదీసుకునేందుకు వివిధ కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్న ఘటనలు తరచూ కనిపిస్తున్నా దృశ్యాలే!

కాంగ్రెస్ పార్టీ ప్రజలతో సంబంధాలు కోల్పోయి కేవలం అధికారం చెలాయించే పార్టీగా మారిపోయింది. పైగా మతోన్మాద, హిదూత్వ భావజాలానికి విరుగుడు భావజాలాన్ని తయారుచేయడంలో ఈ జాతీయ పార్టీ దారుణంగా విఫలమైంది. కేసీఆర్ లాగా 'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' వంటి నినాదాన్ని కూడా కాంగ్రెస్ రూపకల్పన చేయలేకపోయింది. జనం బిజెపినే అధికంగా జాతీయవాద పార్టీగా ఎందుకు భావిస్తున్నారో కాంగ్రెస్ అర్థం చేసుకోలేకపోతోంది. గరీబీ హటావో, 20 సూత్రాల కార్యక్రమం నుంచి గ్రామీణ ఉపాధి, ఆహారభద్రత చట్టం, సమాచార హక్కు చట్టం సహా పలు చట్టాలను కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వచ్చినవే. కానీ కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణను విశృంఖలంగా అమలు చేస్తున్న బిజెపిని ప్రజలు ఎందుకు ఆదరిస్తున్నారో క్షేత్రస్థాయిలో సమగ్ర అధ్యయనం చేయవలసి ఉన్నది.

బిఆర్ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాలపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. బీజేపీ హిందుత్వ భావజాలానికి కౌంటర్ భావజాలాన్ని నిర్మించడానికి దేశవ్యాప్తంగా ఉన్న లౌకిక, ప్రజాతంత్ర వాదులు, ప్రగతిశీల శక్తులను సమీకరించనున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నవి.

First Published:  16 Dec 2022 9:30 AM GMT
Next Story