Telugu Global
National

పనీర్ బట్టర్ మసాలా పై జీఎస్టీ ఎంతో లెక్కకట్టండి... బ్రిలియంట్ సెటైర్

ప్రజల నిత్యావసరాలపై కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ విధించడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ అసంతృప్తిని, అసహనాన్ని సోషల్ మీడియాలో రకరకాల రూపాల్లో వెళ్ళగక్కుతున్నారు.

పనీర్ బట్టర్ మసాలా పై జీఎస్టీ ఎంతో లెక్కకట్టండి... బ్రిలియంట్ సెటైర్
X

కేంద్రం ప్రభుత్వం కొత్తగా కొన్ని వస్తువులపై జీఎస్టీ విధించడం పట్ల దేశవ్యాప్తంగా వ్యతిరేకత వస్తోంది. ముఖ్యంగా ప్రజల అత్యవసర వస్తువులపై పెద్ద ఎత్తున జీఎస్టీ విధించడం పట్ల నిరసన వ్యక్తమవుతోంది. ఒకవైపు ధనికులు మాత్రమే కొనే వస్తువులపై తక్కువ పర్సెంటేజ్ జీఎస్టీ విధిస్తూ, సామాన్యులకు రోజూ అవసరం పడే వస్తువులపై అధిక శాతం జీఎస్టీ విధించడంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు.

ప్రజల ఆగ్రహం సోషల్ మీడియాలో వెల్లువెత్తుతోంది. కొందరు సీరియస్ గా స్పందిస్తే మరికొందరు తమ వ్యగ్యంతో మోదీ ప్రభుత్వానికి చురకలేస్తున్నారు. అలాంటి వ్యంగ్యంతో కూడుకున్న ఓ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాంగ్రెస్ ఎంపీ శశి ధ‌రూర్ ఆ పోస్టర్ ను ట్విట్టర్ లో పోస్ట్ చేసి ...

''ఈ వాట్స‌ప్ మెసేజ్ ఎవరు ఫార్వార్డ్ చేశారో నాకు తెలియదు, కానీ ఇది అద్భుతమైన వ్యంగ్యంతో GST యొక్క మూర్ఖత్వాన్ని ఎండగట్టింది'' అని కామెంట్ చేశారు. ఇంతకూ ఆ పోస్టర్ లో ఏముందంటే ...

''పనీర్ పై GST 5 శాతం

బట్టర్ పై GST 12 శాతం

మసాలా పై GST 5 శాతం

కొత్త గణిత ప్రశ్న: పనీర్ బటర్ మసాలాపై GSTని లెక్కించండి'' అని రాసి ఉంది. దీనిపై నెటిజనుల ను‍ంచి మరింత కామెడీతో కూడిన కామెంట్లు వస్తున్నాయి.

పనీర్ బట్టర్ మసాలా అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్ లో ట్రెండింగ్ లో ఉంది. ఈ హ్యాష్ ట్యాగ్ తో వేల ట్వీట్లతో నిండిపోతోంది ట్విట్టర్.

అసలు 'పనీర్ బటర్ మసాలా' ఎందుకు ట్విట్టర్ ట్రెండింలో ఉంది ? ప్యాక్ చేసి అమ్మే రోజువారీగా వినియోగించే ఆహార పదార్థాలపై కేంద్రం ఇటీవల 5% జీఎస్టీని విధించింది. ప్యాక్ చేసిన పనీర్, పెరుగు, మసాలా దీని కిందకు వచ్చాయి. ఒకవైపు GSTపై రాజకీయ దుమారం కొనసాగుతుండగా, సోషల్ మీడియాలో నెటిజనులు ఈ గణిత సమస్యను పరిష్కరించడంలో బిజీగా గడిపారు

a+b కి కొత్త సిద్దాంతం కనిపెట్టిన విశ్వగురువే దీనికి సరైన జవాబు చెప్పగలరు అని ఒక నెటిజన్ కామెంట్ చేస్తే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ పై కూడా మరి కొందరు వ్యగ్యంగా స్పందించారు. నేను పెరుగు తినను, అన్నం తినను. పెరుగన్నం మాత్రమే తింటాను పెరుగన్నంపై GST లేదు అని నిర్మలా సీతారామన్ చెప్తున్నట్టు ఒక నెటిజన్ పోస్టర్ పోస్ట్ చేశారు.

First Published:  21 July 2022 6:43 AM GMT
Next Story