Telugu Global
National

' పంజరం లోని చిలకకు కాషాయ రెక్కలొచ్చాయ్' - కపిల్ సిబల్

సీబీఐ పంజరంలోని చిలకగా మారిందని గతంలో కోర్టు వ్యాఖ్యానించింది. కానీ ఇప్పుడు ఇది పంజరం నుంచి బయటపడిన చిలక అయింది. దాని ఈకలు కాషాయ రంగును సంతరించుకున్నాయి అని కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. ఆప్ నేత శిసోడియా పై సీబీఐ దాడులు చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

 పంజరం లోని చిలకకు కాషాయ రెక్కలొచ్చాయ్ - కపిల్ సిబల్
X

మోడీ ప్రభుత్వంలో సీబీఐ, ఈడీ దర్యాప్తు సంస్థలు కీలుబొమ్మల్లా మారాయి. తమకు నచ్చని పార్టీల నేతల ఇళ్లమీద, వారి ఆస్తుల మీద దాడులు చేయించడానికి ప్రభుత్వం వీటిని ప్రయోగిస్తోంది. తమపై గళమెత్తి విమర్శించేవారి నోళ్లు మూయించేవారిపట్ల ఈ సంస్ధలు సర్కార్ చేతిలో పావులయ్యాయి. ఇలా విపక్షాలు ఎన్ని విమర్శలు చేస్తున్నా.. తన పంథా మాత్రం ఇదేనంటోంది బీజేపీ. ఢిల్లీలో లిక్కర్ స్కామ్ అంటూ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటిమీద సీబీఐ జరిపిన దాడులే ఇందుకు తాజా తార్కాణం. దాదాపు 14 గంటలపాటు ఈ సంస్థ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు చేశారు. ఆయనను ఎన్నో గంటలపాటు విచారించారు. ఆయన సెల్ ఫోన్, కంప్యూటర్ స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆయన గానీ, సీఎం అరవింద్ కేజ్రీవాల్ గానీ బెదరలేదు. పైగా సీబీఐ సిబ్బందికి 'వెల్ కమ్'చెప్పారు. తమ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అంటే మోడీ ప్రభుత్వం భయపడుతోందని, తనను మరో రెండు, మూడు రోజుల్లో ఆరెస్టు చేసినా ఆశ్చర్యం లేదని మనీష్ సిసోడియా వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో మాజీ కాంగ్రెస్ నేత, ఎంపీ, సీనియర్ లాయర్ కపిల్ సిబల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని అస్థిర పరచేందుకే బీజేపీ.. సీబీఐ, ఈడీ దాడులకు పాల్పడుతోందన్నారు. ఇలాంటివి ఆ పార్టీకి అలవాటేనన్నారు.

ఈ సందర్భంగా ఆయన.. సీబీఐ ని 'పంజరం నుంచి బయటికొచ్చేసినచిలక' గా అభివర్ణించారు. 2013 లో ఈ దర్యాప్తు సంస్థను సుప్రీంకోర్టు.. 'పంజరం లోని చిలక'గా పేర్కొందని గుర్తు చేశారు. ఈ సంస్థకు ఎలాంటి ప్రత్యేకాధికారాలు లేవని, ఇది పంజరంలోని చిలకగా మారిందని నాడు కోర్టు వ్యాఖ్యానించింది. కానీ ఇప్పుడు ఇది పంజరం నుంచి బయటపడిన చిలక అయింది. దాని ఈకలు కాషాయ రంగును సంతరించుకున్నాయి అని కపిల్ సిబల్ .. వ్యాఖ్యానించారు. దీని రెక్కలే 'ఈడీ'గా మారాయన్నారు. తన మాస్టర్ (మోడీ) ఎలా చెబితే అలా ఈ 'చిలక' నడచుకుంటుంది అని సెటైర్ వేశారు. కేజ్రీవాల్ ప్రాబల్యం పెరిగిపోతుండడంతో.. ఢిల్లీలో ఆప్ ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు అసలు లిక్కర్ (ఎక్సయిజు) పాలసీలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు జరిగాయో పాలక పార్టీ చెప్పాలి..అన్నారు. మొదట బీజేపీ తన టార్గెట్ గా మంత్రి సత్యేంద్ర జైన్ ని చేసుకుంటే.. ఇప్పుడు మనీష్ సిసోడియా అయ్యారు.. అని సిబల్ ట్వీట్ చేశారు.

సీపీఎం నేత బృందా కారత్ కూడా ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించారు. విపక్ష నేతలపై రాజకీయ కక్ష తీర్చుకునేందుకు కేంద్రం ఇలాంటి దర్యాప్తు సంస్థలను వినియోగించుకుంటోంది.. మనీష్ సిసోడియా ఢిల్లీ ఉపముఖ్యమంత్రి.. అందువల్లే ఆయనమీద ఫోకస్ పెట్టారు. ఆయన ఆర్ఎస్ఎస్ లోనో, బీజేపీలోనో ఉండి మోకరిల్లిన పక్షంలో ఇలా జరిగేదా అని ఆమె ప్రశ్నించారు.

రూ. 144.36 కోట్లు మాఫీ చేశారా ?

మనీష్ సిసోడియా ఆధ్వర్యంలోని ఎక్సయిజు శాఖ..మద్యం షాపు యజమానుల నుంచి రావలసి ఉన్న దాదాపు రూ. 144 కోట్లను మాఫీ చేసిందని ఆరోపణలు వచ్చాయి. ఇందులో ఎన్నో అవకతవకలు జరిగినట్టు భావించిన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీ.కె. సక్సేనా ..దీనిపై సీబీఐ విచారణ జరపాలని ఆదేశించారు. ఫలితంగా కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త మద్యం పాలసీ రద్దయింది. పాత విధానాన్నే కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు. కొత్త పాలసీ ప్రకారం ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరవాలని భావించామని, కానీ పసలేని ఆరోపణల నేపథ్యంలో ఆరు నెలల పాటు పాత విధానాన్నే కొనసాగిస్తామని మనీష్ సిసోడియా తెలిపారు.

First Published:  20 Aug 2022 10:41 AM GMT
Next Story