Telugu Global
National

కాగ్ మొట్టికాయలు.. ఈసారి కేంద్రానికి..

ఏకంగా అప్పులపై క్లాస్ తీసుకోడానికి ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టి చీవాట్లు తిన్నది. ఇప్పుడు అదే కాగ్.. నేరుగా కేంద్రానికి మొట్టికాయలు వేసింది. కేంద్రం చేస్తున్న అప్పులు, వడ్డీ భారంపై ఆందోళన వ్యక్తం చేసింది.

కాగ్ మొట్టికాయలు.. ఈసారి కేంద్రానికి..
X

భారత కంప్ట్రోలర్ మరియు ఆడిటర్ జనరల్ (కాగ్) ఫలానా రాష్ట్రానికి అక్షింతలు వేసింది, ఫలానా రాష్ట్రం అప్పులు ఎక్కువ చేస్తోంది, ఆర్థికంగా దివాళా అంచున ఉందంటూ ఈ మధ్య కేంద్రం నానా యాగీ చేసింది. ఏకంగా అప్పులపై క్లాస్ తీసుకోడానికి ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టి చీవాట్లు తిన్నది. ఇప్పుడు అదే కాగ్.. నేరుగా కేంద్రానికి మొట్టికాయలు వేసింది. కేంద్రం చేస్తున్న అప్పులు, వడ్డీ భారంపై ఆందోళన వ్యక్తం చేసింది.

2015-16 నుండి అప్పులు భారీగా పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది కాగ్. 2015-16 నుంచి 2019-20 వరకు ఈ ఐదేళ్ల కాలంలో రుణం, జీడీపీ నిష్పత్తి, వడ్డీ చెల్లింపు, వడ్డీ రేటు వ్యాప్తి వంటి కొన్ని సూచికలు తీవ్ర ప్రతికూలంగా మారాయని పార్లమెంట్‌కి నివేదిక సమర్పించింది.

ఆదాయం వడ్డీలకే చెల్లు..

రుణం-జీడీపీ నిష్పత్తి 2015-16లో 50.5 శాతంగా ఉంది. 2019-20 నాటికి అది 52.3 శాతానికి చేరింది. అంటే.. ఆర్జించిన ఆదాయంలో 34 శాతం అప్పుపై వడ్డీ చెల్లించడానికే సరిపోతోందన్నమాట. జీఎస్టీ పేరుతో సామాన్యుడి ముక్కుపిండి వసూలు చేస్తున్న మొత్తం ఇలా అప్పులు, వడ్డీలు కట్టడానికే స‌రిపోతోందని తేలుతోంది. 2015-16లో సగటు వడ్డీ వ్యయం 6.91 శాతం కాగా.. 2020-21 నాటికి అది 6.61 శాతానికి స్వల్పంగా తగ్గింది. కానీ ఇక్కడ మొత్తం రుణాన్ని విస్తరించడం వల్ల ప్రభుత్వంపై భారం పెరుగుతోంది. ఐదేళ్ల కాలంలో రుణాలపై చెల్లించాల్సిన వడ్డీ రూ.4.57 లక్షల కోట్ల నుంచి రూ.6.55 లక్షల కోట్లకు పెరగడం ఆందోళన కలిగించే విషయం.

ఖర్చులు పెరుగుతున్నాయి, ఆదాయం పెరుగుతోంది, వడ్డీ కూడా పెరుగుతోంది అని సరిపెట్టుకోడానికి లేదు. ఎందుకంటే జీడీపీ వృద్ధి అంతకంతకూ పడిపోతోంది. జీడీపీ వృద్ధి రేటు, సగటు వడ్డీ వ్యయం మధ్య వ్యత్యాసం ఏడాదికేడాది పెరిగిపోవడాన్ని కాగ్ తీవ్రంగా ఆక్షేపించింది. ఇదే కొనసాగితే భారత్ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేసింది. తాజా ఆర్థిక సంవత్సరంలో అప్పులపై చెల్లించాల్సిన వడ్డీ రూ.8.05 లక్షల కోట్లకు చేరుకుంటోందని తెలిపింది. రుణం-జీడీపీ నిష్పత్తిని 40 శాతానికి పరిమితం చేయాలని సూచించింది.

ఎందుకీ అవస్థ..?

కుటుంబ ఆర్థిక ప్రణాళిక లాగే ప్రభుత్వ ఆర్థిక ప్రణాళిక కూడా ఉండాలి. అవసరానికి మించి అప్పులు చేయడం, స్థోమతకు మించి ఖర్చు పెట్టడం సరికాదు. ఇక్కడ దేశానికి అప్పులు కుప్పలు తెప్పలుగా రావొచ్చు, కానీ దాన్ని తీర్చే మార్గం కనిపించకపోగా ఆదాయం అంతా అప్పులకు వడ్డీ కట్టడానికే సరిపోతే తర్వాత పరిస్థితి ఏంటి..? ఐదేళ్ల తర్వాత ఎవరెవరు ఏ స్థానాల్లో ఉంటారో తెలియదు, కానీ ఐదేళ్ల తర్వాత అయినా భారత ప్రభుత్వం అప్పులు, వడ్డీలు చెల్లించాల్సిందే. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వ అస్తవ్యస్థ విధానాలతో ప్రభుత్వ ఆదాయం తగ్గిపోతోంది, కార్పొరేట్ల ఆదాయం వృద్ధి చెందుతోంది. ఫలితంగా ధనవంతుల సంఖ్య పెరుగుతున్నా, దేశం మాత్రం పేదరికంలో మగ్గిపోతోంది.

ప్రస్తుతం ప్రభుత్వ అప్పు రూ.128 లక్షల కోట్లకు చేరుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ప్రభుత్వ ఆదాయంలో 37 శాతం ఈ అప్పులకు వడ్డీ కట్టడానికే సరిపోతోంది. ఇది 2022-23 ఆర్థిక సంవత్సర అంచనా జీడీపీలో 54 శాతం కావడం విశేషం. రుణాలు తీసుకుని ఉత్పాదక ప్రయోజనాల కోసం వినియోగిస్తే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. 2014-15లో భారత ప్రభుత్వ వడ్డీ చెల్లింపు జీడీపీలో 2.5 శాతం నుంచి 3.1 శాతం మధ్య ఉండేది, ఇప్పుడది జీడీపీలో 54 శాతానికి ఎగబాకింది.

First Published:  11 Aug 2022 6:28 AM GMT
Next Story