Telugu Global
National

పండగ చేసుకోండి.. పీల్చే గాలి మీద పన్ను లేదు..

జీఎస్టీ లేని వస్తువు అంటే అది కచ్చితంగా అరుదైనదే. పిల్లలు తాగే పాలు, పెరుగుపై కూడా జీఎస్టీ బాదిపడేస్తున్న ఎన్డీఏ సర్కారు పీల్చే గాలి వంటి వాటిపై మాత్రం పన్ను వసూలు చేయడంలేదని జోకులు పేలుతున్నాయి.

పండగ చేసుకోండి.. పీల్చే గాలి మీద పన్ను లేదు..
X

ఇందుగలడందులేడని సందేహము వలదు.. విష్ణుమూర్తి గురించి చెప్పే పద్యం ఇది. కానీ దీన్ని ఇప్పుడు జీఎస్టీకి చక్కగా అన్వయం చేసుకోవచ్చు. దీనిపై ఉంది, దానిపై లేదు అనే సందేహం లేకుండా అన్నింటిపై జీఎస్టీ బాదుడు ఉంది. ఒకవేళ నేేరుగా ఫలానా వస్తువుపై జీఎస్టీ లేదు అంటే.. కచ్చితంగా దాని మూలంలో అయినా, అంతిమ ఉత్పన్నంలోనయినా జీఎస్టీ ఉండే ఉంటుంది. గతంలో జీఎస్టీ ఉండే వస్తువులు, సేవలు అని ఓ లిస్ట్ ప్రకటించేవారు. ఇప్పుడు ప్రత్యేకంగా జీఎస్టీ లేని వస్తువులు, సేవలు అనే లిస్ట్ చదవాల్సి వస్తోంది. అంటే జీఎస్టీ లేని వస్తువు అంటే అది కచ్చితంగా అరుదైనదే. పిల్లలు తాగే పాలు, పెరుగుపై కూడా జీఎస్టీ బాదిపడేస్తున్న ఎన్డీఏ సర్కారు పీల్చే గాలి వంటి వాటిపై మాత్రం పన్ను వసూలు చేయడంలేదని జోకులు పేలుతున్నాయి.

బ్యాంక్ ల నుంచి తీసే నగదుపై పన్ను లేదు..

బ్యాంక్ ల నుంచి విత్ డ్రా చేసే నగదుపై జీఎస్టీ లేదు అంటూ ఇటీవల ఘనంగా ప్రకటించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. సరిగ్గా ఇక్కడే నెటిజన్లకు ఓ పెద్ద డౌట్ వచ్చేసింది. పన్ను లేదు అని ఇప్పుడు చెప్పారంటే భవిష్యత్తులో కచ్చితంగా దానిపై పన్ను వేసే ఆలోచన ప్రభుత్వానికి ఉంది అని అర్థం చేసుకోవాలంటున్నారు. బ్యాంక్ ల నుంచి పెద్ద మొత్తంలో నగదు విత్ డ్రా చేసుకుంటే పన్ను వేస్తేనే బాగుంటుందని, అప్పుడే డిజిటల్ లావాదేవీలు పెరుగుతాయని మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. మొత్తమ్మీద నగదు విత్ డ్రా పై పన్ను లేదు అని చెప్పడం నిజంగా ఓ వింత అనే చెప్పాలి. ఇదే పంథా కొనసాగితే భవిష్యత్తులో పీల్చే గాలిపై కూడా పన్ను లేదు అని ప్రభుత్వం ప్రకటిస్తుందని అంటున్నారు.

ఎన్డీఏ అంతం జీఎస్టీతోనేనా..?

కాంగ్రెస్ హయాంలో జీఎస్టీ ప్రవేశ పెట్టే ప్రయత్నాన్ని అడ్డుకున్న బీజేపీ.. ఒకసారి ఆ పన్నుతో వచ్చే ఆదాయం రుచి తెలిశాక, ఎడా పెడా ప్రతి దానిపై జీఎస్టీ బాదేస్తోంది. ఈమధ్య ఈ దూకుడు మరీ ఎక్కువైంది. పెట్రోలియం ఉత్పత్తులు ప్రస్తుతానికి జీఎస్టీ పరిధిలో లేకపోయినా వాటి రేట్లకు అడ్డూ అదుపూ లేదు. అంటే జీఎస్టీలో ఉన్నా, లేకపోయినా ప్రభుత్వం ప్రజల వద్ద ముక్కుపిండి పన్నుల్ని ఏదో ఒక రూపంలో వసూలు చేస్తోందనమాట. జీఎస్టీ విషయంలో ఎన్డీఏ ఎక్కడలేని విమర్శలు మూటగట్టుకుంటోంది, అన్ని వర్గాల ప్రజలు కేంద్రానికి శాపనార్థాలు పెడుతున్నారు. ఎన్డీఏ సర్కారు కూప్పకూలే పరిస్థితి వస్తే.. కచ్చితంగా అందులో జీఎస్టీదే సింహభాగం ఉంటుందనడంలో అతిశయోక్తి లేదు. కొండలా పెరుగుతున్న పన్ను రేట్లు, ఎన్డీఏ పాపాల రూపంలో జమ అవుతున్నాయి. ఎప్పుడో ఓ సారి ఆ ప్రతిఫలం కచ్చితంగా బీజేపీ అనుభవించాల్సిందే.

First Published:  3 Aug 2022 6:02 AM GMT
Next Story