Telugu Global
National

ఆమె ఎంపీగా పనికిరారు.. ప్రగ్యా ఠాకూర్ పై మండిపడ్డ మాజీ ఐఏఎస్ లు

ప్రగ్యా ఠాకూర్ ఇటీవల చేసిన వ్యాఖ్యల్ని వారు తీవ్రంగా ఖండించారు. మైనారిటీలకు వ్యతిరేకంగా సమాజంలో ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని, ముస్లింలు, క్రైస్తవులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో రోజూవారీగా విషం చిమ్ముతున్నారని అన్నారు.

ఆమె ఎంపీగా పనికిరారు.. ప్రగ్యా ఠాకూర్ పై మండిపడ్డ మాజీ ఐఏఎస్ లు
X

ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని, లౌకికవాదం, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని కాపాడతానని ప్రమాణం చేసి, ఇప్పుడు వాటన్నిటినీ ఉల్లంఘించడం తప్పే కదా అని ప్రశ్నిస్తున్నారు మాజీ ఐఏఎస్ అధికారులు. ప్రగ్యా ఠాకూర్ ఇటీవల చేసిన వ్యాఖ్యల్ని వారు తీవ్రంగా ఖండించారు. మైనారిటీలకు వ్యతిరేకంగా సమాజంలో ద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నారని, ముస్లింలు, క్రైస్తవులకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో రోజూవారీగా విషం చిమ్ముతున్నారని అన్నారు. సమాజంలో వారి స్థాయిని తగ్గించేలా ప్రయత్నిస్తున్నారని, ప్రగ్యాఠాకూర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ కోవలోనివేనని ఆరోపించారు. ఆమెపై చర్యలు తీసుకోవాల్సిందిగా లోక్ సభ స్పీకర్ కు లేఖ రాశారు.

భోపాల్ బీజేపీ ఎంపీగా ఉన్న ప్రగ్యా ఠాకూర్, డిసెంబర్ 25న కర్నాటకలోని శివమొగ్గలో విద్వేష ప్రసంగం చేశారు. వారికి ‘జిహాద్’ సంప్రదాయం ఉందని, హిందూ బాలికలను ప్రలోభపరుచుకోవడానికి వారంతా ‘‘లవ్ జీహాద్’’ చేస్తారని అన్నారు. లవ్ జీహాద్ కు పాల్పడే వారికి సమాధానం చెప్పాలని, అలా చెప్పాలంటే హిందువులందరి ఇళ్లలో ఆయుధాలు ఉంచుకోవాలని, కనీసం కూరగాయలు కోసే కత్తులనైనా దగ్గర ఉంచుకోండి అంటూ ఆమె సలహా ఇచ్చారు. ఇలాంటి వ్యాఖ్యలు ఇతర వర్గాలనుంచి వస్తే దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమనేవి. కానీ ప్రగ్యా ఠాకూర్ వ్యాఖ్యలపై ఎవరూ స్పందించలేదు. పోలీసులు కూడా కేసు పెట్టలేదు. కానీ 103మంది మాజీ ఐఏఎస్ లు మాత్రం ఆమె వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ కి లేఖ రాశారు.

కేంద్ర సామాజిక న్యాయశాఖ మాజీ కార్యదర్శి అనితా అగ్నిహోత్రి, రాజస్థాన్ మాజీ సీఎస్ సలావుద్దీన్ అహ్మద్, కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ మాజీ అదనపు కార్యదర్శి ఎస్పీ ఆంబ్రోస్ సహా మరికొంతమంది ఉన్నతాధికారులుగా పనిచేసి రిటైర్ అయినవారు ఈ లేఖ రాసి సంతకాలు చేశారు. లోక్ సభ నైతిక కమిటీ చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రగ్యా ఠాకూర్ వ్యాఖ్యలను కనీసం శివమొగ్గ పోలీసులు పట్టించుకోలేదని, ఆమెపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

First Published:  7 Jan 2023 3:43 PM GMT
Next Story