Telugu Global
National

అమర్త్యసేన్ పై బుల్డోజర్ రాజకీయం..!

మే 6వ తేదీలోపు అమర్త్యసేన్ ఇల్లు ఖాళీ చేయాలంటూ తాజాగా యూనివర్సిటీ డెడ్‌లైన్‌ విధించింది. లేకుంటే ఆ ఇంటిని బుల్డోజర్‌లతో కూల్చేస్తామని హెచ్చరించింది.

అమర్త్యసేన్ పై బుల్డోజర్ రాజకీయం..!
X

తరచుగా బీజేపీ సర్కార్ విధానాలను విమర్శించే ప్రముఖ ఆర్థికవేత్త.. నోబెల్‌ గ్రహీత, భారతరత్న అమర్త్యసేన్ పై బీజేపీ కక్షకట్టిందా..? ఆయనను వేధింపులకు గురి చేస్తోందా..? అంటే అవుననే అనిపిస్తున్నాయి పశ్చిమ బెంగాల్ లో జరుగుతున్న పరిణామాలు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా అదే మాట అంటున్నారు.

1943 నుంచి శాంతినికేతన్‌లో అమర్త్య సేన్‌ కుటుంబం నివసిస్తోంది. 6,600కు పైగా గజాల స్థలంలో ఉన్న ఆ ఇల్లు సేన్‌ తండ్రి అశుతోష్‌ పేరు మీదే ఉండేది. సేన్‌ తల్లిదండ్రులు మరణించాక.. అది ఆయన పేరు మీదకు బదిలీ అయ్యింది. అయితే అందులో 600 గజాల యూనివర్సిటీ జాగాను ఆయన ఆక్రమించారనేది విశ్వ భారతి యూనివర్సిటీ వాదన. అందువల్ల మే 6వ తేదీలోగా ఖాళీ చేయాలని, లేకుంటే బలవంతంగా ఖాళీ చేయించి ఆక్రమిత ప్రదేశంలో ఉన్న కట్టడాల్ని కూల్చేస్తామని విశ్వ భారతి ఆయనకు హెచ్చరికలు జారీ చేసింది.

ఈ ఏడాది జవనరిలో అమర్త్య సేన్ కు చెందిన 6,600కు పైగా గజాల స్థలానికి చెందిన అధికారిక పత్రాలను స్వయంగా సీఎం మమతా బెనర్జీనే శాంతినికేతన్‌లో సేన్‌ను కలసి అందించారు.

విశ్వ భారతి యూనివర్సిటీ వాదనపై తాజాగా అమర్త్య సేన్ స్పందించారు. అది తమ వారసత్వ నివాసమని, అందులో ఎలాంటి ఆక్రమిత స్థలం లేదని అమెరికాలో ఉన్న ఆయన యూనివర్సిటీకి తాజాగా లేఖ రాశారు. ''1943 నుంచి ఆ ప్రాంతం మా కుటుంబం స్వాధీనంలో నే ఉంది. ఆపై పక్కన కొంత స్థలం కొనుగోలు చేశాం. నా తల్లిదండ్రుల మరణానంతరం అది నా పేరు మీదకు వచ్చింది. జూన్‌లో నేను శాంతినికేతన్‌కు వస్తా. పూర్తి వివరాలు సమర్పిస్తా'' అని లేఖలో యూనివర్సిటీకి సేన్ తెలియజేశారు.

మరోవైపు ఈ వ్యవహారంపై ఆ ఇంటి కేర్‌టేకర్‌ గీతికాంతా మజుందార్‌.. కోర్టును ఆశ్రయించారు. దీంతో.. జూన్‌ 6వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని.. భీర్బూమ్‌ ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌ స్టేటస్‌ కో ఆదేశాలు ఇచ్చారు. అయినప్పటికీ యూనివర్సిటీ మాత్రం స్థలాన్ని స్వాధీనం చేసుకుని తీరతామని అంటోంది.

మే 6వ తేదీలోపు ఇల్లు ఖాళీ చేయాలంటూ తాజాగా యూనివర్సిటీ డెడ్‌లైన్‌ విధించింది. లేకుంటే ఆ ఇంటిని బుల్డోజర్‌తో కూల్చేస్తామని హెచ్చరించింది. దీనిపై బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు. ఒకవేళ వారు బుల్డోజర్ తో కూల్చివేసే ప్రయత్నం చేస్తే ఆ బుల్డోజర్‌ ముందు తానే కూర్చుంటానంటూ ప్రకటించారామె.

''అమర్త్యసేన్ పై ప్రతీరోజూ దాడి జరుగుతోంది. కేంద్రం మాత్రం వేడుక చూస్తోంది. ఆయన ఇంటిని ఎలా కూల్చివేస్తారో చూస్తా. బుల్డోజరా? మానవత్వమా? ఏది శక్తివంతమైందో తేల్చుకుంటా.'' అని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో విశ్వభారతి యూనివర్సిటీని అడ్డుపెట్టుకొని కేంద్రం అమర్త్యసేన్ పై కక్ష తీర్చుకుంటోందని మేధావులు మండిపడుతున్నారు.

First Published:  27 April 2023 7:29 AM GMT
Next Story