Telugu Global
National

అయోధ్యలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు గుడి

శ్రీరాముడిలా ధనుస్సు చేతపట్టుకుని నడుచుకుంటూ వస్తున్నట్లు యోగి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆలయంలో రోజూ పూజలు చేస్తున్నారు. కాగా శ్రీరాముడి రూపంలో యోగి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి.

అయోధ్యలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు గుడి
X

మనదేశంలో దేవతలకే కాదు.. తాము అభిమానించే రాజకీయ నాయకులు, సినీ నటులకు కూడా గుడి కట్టి పూజలు చేస్తుంటారు ప్రజలు. మొదట ఈ సంస్కృతి తమిళనాడులో మొదలు కాగా.. ఆ తర్వాత దేశమంతటా వ్యాపించింది. కొన్నేళ్ల కిందటే తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్, సినీ నటి ఖుష్బూకు గుడి కట్టి పూజలు చేశారు. ఇప్పుడు దేశంలో రాజకీయ నాయకులు, పేరున్న సినీ నటులకు గుళ్ళు నిర్మించడం సర్వసాధారణం అయిపోయింది.

ప్రధానమంత్రి మోదీకి గుజరాత్‌లోని రాజ్ కోట్, మహారాష్ట్రలోని పుణె, అలాగే ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రాల్లో గుడులు కట్టారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కరీంనగర్‌లో గుడి కట్టారు. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు ఆ రాష్ట్రంలోని అయోధ్యకు సమీపంలో మౌర్య కా పూర్వ గ్రామంలో గుడి నిర్మించారు.

శ్రీరాముడిలా ధనుస్సు చేతపట్టుకుని నడుచుకుంటూ వస్తున్నట్లు యోగి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆలయంలో రోజూ పూజలు చేస్తున్నారు. కాగా శ్రీరాముడి రూపంలో యోగి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వస్తున్నాయి. రాజకీయ నాయకులకు ఇలా గుళ్ళూ గోపురాలు కట్టి సంస్కృతి, సంప్రదాయాలను మంట కలపవద్దని నెటిజన్లు సూచిస్తున్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో సీఎం యోగికి గుడి కట్టడంపై ప్రముఖ నటుడు ప్రకాష్‌రాజ్ స్పందించారు. అయితే ఈ గుడిలో ప్రసాదంగా ఏం పెడుతున్నారంటూ.. ఆయన సెటైర్ వేశారు.

First Published:  19 Sep 2022 3:15 PM GMT
Next Story