Telugu Global
National

24న మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ

మహారాష్ట్ర నాయకుల కోరిక మేరకు 24న ఔరంగాబాద్ సభకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ రోజు జరిగే సభలో తప్పకుండా పాల్గొంటానని కేసీఆర్ ఆ రాష్ట్ర నాయకులకు చెప్పారు.

24న మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ
X

బీఆర్ఎస్‌ను మహారాష్ట్రలో మరింతగా విస్త‌రించాల‌ని పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇప్పటికే అక్కడ నిర్వహించిన రెండు సభలు విజయవంతం అయ్యాయి. నాందేడ్‌లోని తొలి సభ, కందార్ లోహలో నిర్వహించిన రెండో సభ సూపర్ సక్సెస్ అయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మూడో సభ జరపాలని అక్కడి పార్టీ నాయకులు పట్టుబడుతున్నారు. ఆ రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఔరంగాబాద్‌లో బీఆర్ఎస్ సభ నిర్వహిస్తే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతుందని నాయకులు సూచించారు.

ఇటీవల మహారాష్ట్రకు చెందిన నాయకులు భారీ ఎత్తున బీఆర్ఎస్‌లో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ రాణించాలంటే మరో సభ చాలా అవసరమని వారు సీఎం కేసీఆర్‌కు సూచించారు. ఈ క్రమంలోనే ఈనెల 24న సభ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వాస్తవానికి ఈ నెల 27న హైదరాబాద్‌లో పార్టీ ఆవిర్భావ సభ, 25న నియోజకవర్గాల ప్రతినిధుల సమావేశాలు ఉన్నాయి. టైట్ షెడ్యూల్ ఉన్నా.. మహారాష్ట్ర నాయకుల కోరిక మేరకు 24న ఔరంగాబాద్ సభకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ రోజు జరిగే సభలో తప్పకుండా పాల్గొంటానని కేసీఆర్ మహారాష్ట్ర నాయకులకు చెప్పారు.

సీఎం కేసీఆర్ నుంచి అనుమతి రావడంతో జన సమీకరణకు పార్టీ శ్రేణులు సన్నాహాలు ప్రారంభించాయి. ఔరంగాబాద్‌కు చెందిన నాయకులు కేసీఆర్‌తో సంప్రదింపులు జరుపుతూ.. సభా ఏర్పాట్ల వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు. తెలంగాణ బీఆర్ఎస్ నాయకులను సభా ఏర్పాట్లు పర్యవేక్షించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్, ఐడీసీ చైర్మన్ వేణుగోపాలాచారి ఇప్పటికే ఔరంగాబాద్ చేరుకొని.. సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఔరంగాబాద్‌లోని ఆంకాస్ మైదానాన్ని సభ కోసం సిద్ధం చేస్తున్నారు.

First Published:  16 April 2023 4:31 AM GMT
Next Story