Telugu Global
National

ఔరంగాబాద్ సభ కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్న బీఆర్ఎస్

స్థానిక నాయకులు బీఆర్ఎస్‌లో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్‌లోకి భారీ సంఖ్యలో నాయకులు చేరారు.

ఔరంగాబాద్ సభ కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్న బీఆర్ఎస్
X

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఈ నెల 24న జరుగనున్న భారీ బహిరంగ సభ కోసం బీఆర్ఎస్ నాయకులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆంఖాస్ మైదానంలో సభకు అనుమతి నిరాకరించడంతో బీఆర్ఎస్ పార్టీ ప్రత్యామ్నాయ వేదికను ఖరారు చేసింది. నగరంలోని జబిందా మైదానంలో బీఆర్ఎస్ బహిరంగ సభ జరుగనున్నది. ఇప్పటికే ఔరంగాబాద్ పోలీసులతో కలిసి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మైదాన్ని పరిశీలించారు. ఈ సభకు పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. అందుకే బహిరంగ సభా ఏర్పాట్లను ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దగ్గర ఉండి చూసుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా ఔరంగాబాద్‌లోనే ఉన్న ఎమ్మెల్యే సభ కోసం స్థలాన్ని వెతకడమే కాకుండా.. విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు. ఔరంగాబాద్ లోక్‌సభ పరిధిలోని గ్రామాలు, పట్టణాలకు ప్రచార రథాలను తీసుకొని వెళ్లి.. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలను వివరిస్తున్నారు.

మరోవైపు స్థానిక నాయకులు బీఆర్ఎస్‌లో చేరడానికి ఆసక్తి చూపిస్తున్నారు. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్‌లోకి భారీ సంఖ్యలో నాయకులు చేరారు. రాష్ట్రవాది ప‌శ్చిమ షెహర్ ఉపాధ్యక్షుడు షేక్ అబ్రార్, షేక్ ఫైజాన్, షేక్ ఇమ్రాన్, షేక్ అద్నాన్, రమేశ్ పాటిల్, రాజ్ గైక్వాడ్, ఆకాశ్ గైక్వాడ్ వంటి కీలక నేతలు జీవన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. వీరందరికీ గులాబీ కండువాలు కప్పి ఆయన పార్టీలోకి ఆహ్వానించారు.

ఇక పలువురు స్థానిక నాయకులు కూడా ప్రచార రథాల వెంట గ్రామాల్లో తిరుగుతున్నారు. అంతే కాకుండా పార్టీలో చేరికలను కూడా ప్రోత్సహిస్తున్నారు. నాందేడ్, కందార్ లోహ సభలు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన జీవన్ రెడ్డే.. ఈ సభ ఏర్పాట్లు కూడా చేస్తుండటంతో తప్పకుండా సక్సెస్ అవుతుందని పార్టీ నాయకులు అంటున్నారు. ఇప్పటికే సభ గురించి విస్తృతంగా ప్రచారం చేయడంతో మరాఠా ప్రజలు కేసీఆర్ ప్రసంగం వినాలనే ఆసక్తితో ఉన్నారు. తెలంగాణలో అమలు అవుతున్న రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, కల్యాణ లక్ష్మీ, ఆసరా పింఛన్ల వంటి పథకాల గురించి తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు.

బీఆర్ఎస్ గెలిస్తే దేశమంతా తెలంగాణలో ఉన్న పథకాలను అమలు చేస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. త్వరలో మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరుగనున్నాయి. ఇందులో బీఆర్ఎస్ పోటీ చేయాలని భావిస్తోంది. రాబోయే రోజుల్లో మరిన్ని సభలు పెట్టి.. ఎన్నికల్లో మిగిలిన పార్టీలకు గట్టి పోటీ ఇవ్వాలని అనుకుంటోంది. గతంలో హైదరాబాద్ స్టేట్‌లో ఉన్న ప్రాంతాల ప్రజలు తప్పకుండా పార్టీని ఆదరిస్తారని కేసీఆర్ అంచనా వేస్తున్నారు. ఔరంగాబాద్ సభ ద్వారా బీఆర్ఎస్‌ను ప్రజల్లోకి మరింతగా తీసుకొని వెళ్లాలని భావిస్తున్నారు. అందుకే టైట్ షెడ్యూల్ ఉన్నా 24న సభకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.


First Published:  22 April 2023 3:02 AM GMT
Next Story