Telugu Global
National

మహారాష్ట్ర రాజకీయ పార్టీలను కలవర పెడుతున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర బాధ్యులు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

మహారాష్ట్ర రాజకీయ పార్టీలను కలవర పెడుతున్న బీఆర్ఎస్
X

'అబ్ కీ బార్ కిసాన్ సర్కార్' అనే నినాదంతో జాతీయ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన బీఆర్ఎస్ పార్టీ.. ఇప్పుడు మహారాష్ట్రలోని రాజకీయ పార్టీలను భయపెడుతోంది. ఇప్పటికే మహారాష్ట్రలో బీఆర్ఎస్ బలోపేతానికి అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. దేశాన్ని మార్చాలనే సంకల్పానికి మొదటి అడుగు మహారాష్ట్ర నుంచే పడుతుందని ఇటీవల నాగ్‌పూర్‌లో పార్టీ కార్యాలయం ప్రారంభం సందర్భంగా వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో పంచాయతీ ఎన్నికల నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.

బీఆర్ఎస్ పార్టీ మహారాష్ట్ర బాధ్యులు రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నారు. గ్రామగ్రామాన తెలంగాణ రాష్ట్రంలో అమలు అవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను వివరిస్తుండటంతో.. ఎంతో మంది తమకు కూడా తెలంగాణ మాడల్ అభివృద్ధి కావాలని కోరుతున్నారు. మహారాష్ట్రలో ఉన్న రాజకీయ పార్టీల నుంచి బీఆర్ఎస్‌లో చేరుతున్న వారి సంఖ్య ఇటీవల పెరుగుతోంది.

రైతులను, ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్న బీఆర్ఎస్‌లో చేరేందుకు శివసేన, ఎన్సీపీ, బీజేపీ, కాంగ్రెస్, శివసేన శిండే వర్గం, ఆప్, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన వంటి పార్టీల నుంచి బీఆర్ఎస్‌లో చేరుతున్నారు. దీంతో ఆయా పార్టీల నాయకులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయి నాయకులు బీఆర్ఎస్‌లో జాయిన్ అవుతుండటం మహరాష్ట్ర పార్టీలను కలవరపెడుతున్నది. కీలకమైన క్యాడర్ అంతా బీఆర్ఎస్‌లో కి వెళ్తే.. రాబోయే ఎన్నికల్లో పార్టీ కోసం ఎవరు పని చేస్తారనే భయం పట్టుకున్నది.

మహారాష్ట్రలో బీఆర్ఎస్‌ను కట్టడి చేయాలని ఇప్పటికే ఇతర పార్టీలు భావిస్తున్నాయి. బీఆర్ఎస్ వల్ల ఏం జరగబోతోందో ముందుగానే ఊహించిన ఎన్సీపీ నాయకుడు శరద్ పవర్.. అప్పుడే పలు ఆరోపణలు చేయడం మొదలు పెట్టారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ, సీఎం కేసీఆర్ తమకు ప్రధాన ప్రత్యర్థి బీజేపీనే అని స్పష్టం చేశారు. బీజేపీ మాతృసంస్థ అయిన ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం ఉన్న నాగ్‌పూర్‌లోనే మొదటి బీఆర్ఎస్ కార్యాలయం ఏర్పాటు చేసి ధీటైన జవాబు ఇచ్చారు.

దేశం ఇలా వెనుకబడిపోవడానికి, రైతులకు కనీసం సాగునీరు, ప్రజలకు తాగునీరు అందకపోవడానికి కేంద్రంలో ఉన్న బీజేపీనే కారణమని కూడా ప్రతీ సభలో దుయ్యబడుతున్నారు. కేంద్రంలో రైతు సర్కారు రావాలని.. ప్రజలే ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ పదే పదే చెబుతున్నారు. మరోవైపు మహారాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు కూడా శరద్ పవార్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. ఎన్సీపీనే బీజేపీకి బీ టీమ్ అని స్పష్టం చేస్తున్నారు.

బీఆర్ఎస్‌ది రైతు, యువత, మహిళల టీమ్. శరద్ పవార్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మహా బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. మహారాష్ట్రలో ఎన్సీపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన దారుణాలను ప్రజలు ఎప్పుడూ మరిచిపోరని బీఆర్ఎస్ కిసాన్ సమితి అధ్యక్షుడు మాణిక్ కదం పేర్కొన్నారు. సీఎంగా, కేంద్ర మంత్రిగా పని చేసిన శరద్ పవర్.. బీజేపీ ఆపదలో ఉన్న ప్రతీ సారి ఆదుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయబోతున్నదని మాణిక్ కదం ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రైతులు, యువత, మహిళలు బీఆర్ఎస్ వెంట ఉన్నారని చెప్పారు. మహారాష్ట్రలో తెలంగాణ మోడల్ ఆచరించి చూపిస్తామని ఆయన స్పష్టం చేశారు.

First Published:  18 Jun 2023 4:09 AM GMT
Next Story