Telugu Global
National

బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ కాదు.. రైతులకు మెయిన్ టీమ్ : మహారాష్ట్రలో సీఎం కేసీఆర్

బీఆర్ఎస్ పార్టీ ఎవరికీ బీ టీమ్ కాదు.. కేవలం రైతులకు, దళితులకు మెయిన్ టీమ్ అని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు.

బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ కాదు.. రైతులకు మెయిన్ టీమ్ : మహారాష్ట్రలో సీఎం కేసీఆర్
X

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. అలాంటి అభివృద్ధి మహారాష్ట్రలో మాత్రం ఎందుకు సాధ్యం కాదు. బీఆర్ఎస్ పార్టీ మీద అన్ని పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. బీజేపీకి బీఆర్ఎస్ బీ-టీమ్ అంటూ అవాకులు చవాకులు పేలుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎవరికీ బీ-టీమ్ కాదు.. కేవలం రైతులకు, దళితులకు మెయిన్ టీమ్ అని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. అబ్‌ కీ బార్ కిసాన్ సర్కార్ అనే నినాదంతో బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళ్తోందని ఆయన చెప్పారు. దేశాన్ని సరికొత్త పంథాలో నడపాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలో రెండు రోజుల పర్యటనకు వెళ్లిన బీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్.. షోలాపూర్ జిల్లా సర్కోలీలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ..

దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు గడిచిపోయింది. కానీ ఇప్పటికీ దేశానికి ఏమైనా లక్ష్యం ఉందా అని ప్రశ్నించారు. ఇదే సరైన సమయం.. ఇక కొత్తగా స్వాతంత్ర పోరాటం చేపట్టాలి, కొత్త ఉదయం దిశగా అడుగులు వేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. దక్షిణ కొరియా, జపాన్, సింగపూర్, మలేషియా వంటి చిన్న దేశాలు ఎంతో ప్రగతిని సాధించాయి. చైనా ఒక దశలో పేద దేశంగా ఉండేది. కానీ ఇప్పుడు చైనా ఎంతో ముందుకు వెళ్లిపోయింది. కానీ, మనం మాత్రం వెనుకబడే ఉన్నామని కేసీఆర్ చెప్పారు.

మహారాష్ట్ర చాలా పెద్దదే కాదు.. ధనవంతమైన రాష్ట్రం. కానీ గతంలో పాలించిన కాంగ్రెస్, బీజేపీ, శివసేన చేసింది ఏమీ లేదన్నారు. చేయాలనుకుంటే చేయవచ్చు.. కానీ ఆ పార్టీలు అభివృద్ధి, సంక్షేమం విషయంలో విఫలమయ్యాయని చెప్పారు. ఇకపై ఇలాంటి పరిస్థితులు ఉండవని.. మహానేతలు దివాళా తీసి.. కిసాన్లకు దివాళీ వచ్చే రోజులు రాబోతున్నాయని అన్నారు. ప్రస్తుతం భారత్ పరివర్తన్ మిషన్ నడుస్తోంది. త్వరలోనే దేశంలో కిసాన్ సర్కార్ రాబోతోందని కేసీఆర్ అన్నారు.

పండరీపూర్‌కు వచ్చి దర్శనం చేసుకోండి.. కానీ రాజకీయం చేయకండి అని చాలా మంది చెప్పారు. అందుకే పండరీపూర్‌లో దర్శనం చేసుకొని.. సర్కోలీ వచ్చి మాట్లాడుతున్నాను. బీఆర్ఎస్ విషయంలో మహారాష్ట్ర నేతలు ఎందుకు ఆక్రోషం చెందుతున్నారో అర్థం కావడం లేదని సీఎం కేసీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణ, మహారాష్ట్ర కోసమే బీఆర్ఎస్ ఏర్పడలేదని.. దేశంలో ఉన్న సమస్యలన్నింటికీ ఒక పరిష్కారం ఇవ్వాలనే పార్టీ ఏర్పడిందని కేసీఆర్ చెప్పారు.

ఔరంగాబాద్‌లో 8 రోజులకు ఒకసారి, షోలాపూర్‌లో 5 రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి. అకోలాలో కూడా నీళ్లు సరిగా రావడం లేదు. అందుకే కేంద్ర జలవిధానాన్ని తీసుకెళ్లి బంగాళాఖాతంలో వేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే జల విధానాన్ని మార్చేస్తామని.. సరికొత్త భారత్‌ను రూపొందిస్తామని కేసీఆర్ చెప్పారు. దేశంలో నీళ్లు పుష్కలంగా ఉన్నా.. ఏ ఒక్క నాయకుడు కూడా ఇవ్వలేకపోతున్నారు. కోట్లాది ఎకరాలకు సాగు నీరు అందించడమే బీఆర్ఎస్ లక్ష్యం అని కేసీఆర్ అన్నారు.

మన దేశంలో బిలియన్ టన్నుల కొద్దీ బొగ్గు నిల్వలు ఉన్నాయి. మన దేశానికి 125 ఏళ్లకు సరిపడా బొగ్గు ఉన్నట్లు కోల్ ఇండియా చెప్పింది. కానీ దేశంలో విద్యుత్‌కు మాత్రం కొరత ఉన్నదని కేసీఆర్ చెప్పారు. తెలంగాణలో రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని.. రాష్ట్రమంతా కరెంటు కోతలు లేకుండా సరఫరా చేస్తున్నామని కేసీఆర్ వెల్లడించారు. రైతులకు అనేక పథకాలు అందిస్తున్నాము. మహారాష్ట్రలో బీఆర్ఎస్ సర్కార్ వస్తే.. తెలంగాణలో అమలు అవుతున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

తెలంగాణలో ధరణి పోర్టల్‌తో భూములన్నీ డిజిటలైజ్ చేశాము. దీంతో రైతులకు అనేక పథకాలు నేరుగా అందుతున్నాయి. మహారాష్ట్రలో కూడా ఇలాంటి పథకాలు అందిస్తామని అన్నారు. బీఆర్ఎస్‌లో చేరిన మరాఠీ నేత భగీరథ్ బాల్కేకు పూర్తి మద్దతు ఇస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు. పశ్చిమ మహారాష్ట్రలో బీఆర్ఎస్‌కు తలుపులు తీసిన బాల్కేకు తప్పకుండా అండగా ఉంటామని అన్నారు.

First Published:  27 Jun 2023 9:00 AM GMT
Next Story