Telugu Global
National

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచారం..! ఎప్పటి నుంచి అంటే...

కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ఈసీఐ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ప్రచారానికి వెళ్లాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రచారం..! ఎప్పటి నుంచి అంటే...
X

కర్ణాటక అసెంబ్లీకి ఏప్రిల్/మే నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కర్ణాటక ఎన్నికల్లో పాల్గొంటుందా? లేదంటే ప్రచారానికే పరిమితం అవుతుందా అనే అనుమానాలు నెలకొన్నాయి. అయితే బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి మద్దతు ఇస్తున్న జేడీఎస్ చీఫ్ హెచ్‌డీ కుమారస్వామికి సీఎం కేసీఆర్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కర్ణాటక ఎన్నికల బరిలో బీఆర్ఎస్ పోటీకి దిగదని.. జేడీఎస్‌కు మద్దతు ఇస్తుందని పార్టీలో చర్చ జరుగుతున్నది.

కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ఈసీఐ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత ప్రచారానికి వెళ్లాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్లు తెలుస్తున్నది. ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నాయి. హెచ్‌డీ కుమార స్వామి పంచరత్న రథయాత్ర పేరుతో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత డిసెంబర్ నుంచి సుడిగాలి పర్యటన చేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ కూడా జేడీఎస్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుందని గతంలోనే ప్రకటించారు. కర్ణాటకకు 'కాబోయే ముఖ్యమంత్రి' అంటూ కుమారస్వామిని అభివర్ణించారు. జేడీఎస్‌కు బీఆర్ఎస్ మద్దతు తప్పకుండా ఉంటుందని గతంలోనే చెప్పారు.

ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే దాదాపు 50 మంది బీఆర్ఎస్ నాయకులతో కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో ప్రచారం చేయించడానికి సీఎం కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారు. పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఈ ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉన్నది. అయితే కేసీఆర్ ఈ ఎన్నికల ప్రచారానికి వెళ్తారా లేదా అనే విషయంపై స్పష్టత రాలేదు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కంటే 2024 జనరల్ ఎన్నికల సమయంలో జేడీఎస్‌తో కలిసి కొన్ని పార్లమెంటు స్థానాల్లో పోటీ చేయడానికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం.

బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి ఎలాంటి కార్యక్రమం జరిగినా కుమారస్వామి స్వయంగా హైదరాబాద్ వచ్చి పాల్గొన్నారు. కేసీఆర్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ స్నేహాన్ని ఇలాగే కొనసాగించాలని కూడా కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ప్రచారం చేసి.. జనరల్ ఎలక్షన్ సమయంలో కర్ణాటక నుంచి పోటీ చేయాలని నిర్ణయించారు. కుమార స్వామి కూడా ఇదే కోరుకుంటున్నారని కూడా తెలుస్తున్నది. సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్‌తో కలిసి పోటీ చేయడమే బెటర్ అని భావిస్తున్నారు. ఆ సమయంలో సీట్లు పంచుకొని ఎన్నికలకు వెళ్లాలని అనుకుంటున్నారు. ప్రస్తుతానికి అయితే బీఆర్ఎస్ మద్దతును తీసుకొని ఎన్నికల ప్రచారానికి వెళ్లాలని కుమారస్వామి కూడా భావిస్తున్నారు.

First Published:  8 March 2023 12:42 AM GMT
Next Story