Telugu Global
National

రాష్ట్రపతి ప్రసంగానికి బీఆర్ఎస్, ఆప్ సహా కాంగ్రెస్ దూరం.. కారణం ఏమిటంటే!

ఇవ్వాల్టి రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్, ఆప్ బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాయి.

రాష్ట్రపతి ప్రసంగానికి బీఆర్ఎస్, ఆప్ సహా కాంగ్రెస్ దూరం.. కారణం ఏమిటంటే!
X

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలి సారిగా ఉభయ సభలను ఉద్దేశించి ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రసంగించనున్నారు. గత ఏడాది జులై 25న రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ముర్ము సెంట్రల్ హాల్‌లో లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను ఉద్దేశించి ప్రసంగించడం ఇదే తొలి సారి. రాష్ట్రపతి ప్రసంగం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను సభ ముందు ఉంచనున్నారు.

కాగా, ఇవ్వాల్టి రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్, ఆప్ బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాయి. కేంద్రం అన్ని అంశాల్లో విఫలమైందని, అందుకే రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు రెండు పార్టీలు పేర్కొన్నాయి. ప్రజా సమస్యలు పట్టించుకోనందుకు నిరసనగానే బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. మరో వైపు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన అఖిల పక్ష భేటీలో తృణమూల్ కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే పార్టీలకు చెందిన నాయకులు గవర్నర్లు పరిధి మీరి వ్యవహరిస్తున్న తీరుపై చర్చ కోసం డిమాండ్ చేశారు. అయితే రాజ్‌నాథ్ సింగ్ నుంచి దీనిపై ఎలాంటి సమాధానం రాలేదని తెలుస్తున్నది. దీనిపై కూడా బీఆర్ఎస్ పార్టీ అసంతృప్తితో ఉన్నది.

ఇక అఖిల పక్ష భేటీకి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రపతి ప్రసంగానికి కూడా హాజరు కాలేక పోతున్నది. దీనికి కారణం రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే అందుబాటులో లేకపోవడమే. ఖర్గే, రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ ఎంపీలు భారత్ జోడో యాత్ర ముగింపు సభకోసం శ్రీనగర్‌లో ఉన్నారు. అక్కడ వాతావరణ అనుకూలించక పోవడంతో ఢిల్లీకి వచ్చే విమానాలు ఆలస్యమయ్యాయి. అందుకే కాంగ్రెస్ పార్టీ అఖిల పక్ష భేటీకి, రాష్ట్రపతి ప్రసంగానికి హాజరుకాలేక పోతున్నట్లు పార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. మల్లిఖార్జున్ ఖర్గే ఢిల్లీ చేరుకున్న తర్వాత తమ డిమాండ్లను తెలియజేస్తారని మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలియజేశారు.

First Published:  31 Jan 2023 4:19 AM GMT
Next Story