Telugu Global
National

శివసేనకు అగ్ని పరీక్ష

కేంద్ర హోం మంత్రి అమిత్ షా సవాలును ఎదుర్కోవడానికి తాము సిద్ధం అని జవాబిచ్చారు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే. త్వరలో బృహన్ ముంబై నగర పాలక సంస్థ (బి.ఎం.సి.) ఎన్నికలు జరగనున్నాయి.

శివసేనకు అగ్ని పరీక్ష
X

శివసేన రాజకీయాలు ఎక్కడ మొదల‌య్యాయో అక్కడే సమాధి చేస్తాం అని సవాలు విసిరారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. ఈ సవాలును ఎదుర్కోవడానికి తాము సిద్ధం అని జవాబిచ్చారు శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే. త్వరలో బృహన్ ముంబై నగర పాలక సంస్థ (బి.ఎం.సి.) ఎన్నికలు జరగనున్నాయి. లోకసభ లేదా శాసనసభ ఎన్నికలు శివసేనకు అంత ప్రధానం కాదు. శివసేన చీలిక వర్గం నాయకుడు ఏక్ నాథ్ షిండే శివసేనను చీల్చి ఉద్ధవ్ ఠాక్రేను గద్దె దింపి బీజేపీతో పొత్తు కూడి ఆ పీఠాన్ని అధిష్టించారు. బృహ‌న్ ముంబై ఎన్నికలలో కూడా బీజేపీతో కలిసి పోటీ చేస్తామని షిండే అంటున్నారు.

బాలాసాహెబ్ ఠాక్రే 1960లలో శివసేన ఏర్పాటు చేశారు. చాలా కాలం శివసేన మహారాష్ట్ర మహారాష్ట్రీయుల కోసమే అన్న ఉద్యమం సాగించింది తప్ప ఎన్నికల గోదాలోకి దిగలేదు. దిగినా అది ముంబైకే పరిమితం. గత అరవై ఏళ్ల నుంచి శివసేన ముంబై మీద ఆధిపత్యం చెలాయిస్తోంది. ఠాక్రే అధినేతగా ఉన్నప్పటి నుంచీ, ఆ తరవాత ఆ కుటుంబమే శివసేనను నడుపుతోంది. శివసేన సైతం వీర హిందుత్వ వాదే. కానీ బీజేపీతో బెడిసి పోయిన తరవాత ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ కలిసి మొన్న మొన్నటి దాకా మహారాష్ట్రలో అధికారంలో ఉంది.

ఎవరైనా పరాజితులైతే ఆ పక్షానికి బాధ కలుగుతుంది. కానీ వారి సొంత గడ్డ మీద అపజయం ఎదురైతే ఆ బాధ వర్ణణాతీతం అంటున్నారు అమిత్ షా. ఆ బాధ ఎలా ఉంటుందో శివసేనకు చూపిస్తామంటున్నారు అమిత్ షా. ఒక వేళ అదే నిజమైతే శివసేన అస్తిత్వానికే ముప్పు రావచ్చు. బృహన్ ముంబైలోని 227 సీట్లలో తాము 150 సాధిస్తామని బీజేపీ గర్జిస్తోంది. అలాగే జరిగితే ఉద్ధవ్ ఠాక్రే, ఆయన కుమారుడు ఆదిత్య ఠాక్రే రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడ్డట్టే. కానీ, శివసేన దృక్కోణంలోంచి చూస్తే బి.ఎం.సి. ఎన్నికలే శివసేనకు జీవన్మరణ సమస్య. 1968 బృహన్ ముంబై ఎన్నికలలో శివసేనకు ఓటు వేసిన వారు ప్రధానంగా మహారాష్ట్రీయులే. అయితే ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చి ముంబైలో పని చేసుకుంటున్న రోజు కూలీలు, ఉద్యోగులు కూడా శివసేనకు మద్దతిచ్చారు. బాలా సాహెబ్ ఠాక్రే నాయకత్వంలో కూడా ఉన్నత ఆదాయ వర్గాలు, మహారాష్ట్రలో ఉంటున్న గుజరాతీలు శివసేనకు మద్దతివ్వలేదు. ఢిల్లీలో ఇప్పుడు పెత్తనం చేస్తున్నది గుజరాతీలే కనుక ఏక్ నాథ్ షిండే చీలిక వర్గం, బీజేపీతో కూడిన ఐక్య సంఘటనకు గుజరాతీల మద్దతు సమకూరవచ్చు.

1985 నాటికి బాలాసాహెబ్ ఠాక్రే శివసేనను పూర్తి హిందుత్వ పార్టీగా మార్చేశారు. ముస్లింలను ద్వేషించడం ప్రారంభించారు. 1995లో మహారాష్ట్రలో శివసేనకు అధికారం దక్కినా ఠాక్రే ముఖ్యమంత్రి కాలేదు. మనోహర్ జోషీని ముఖ్యమంత్రిని చేశారు. ఆయనను నడిపించింది మాత్రం బాలా సాహెబ్ ఠాక్రేనే. అప్పుడూ బీజేపీతో పొత్తు ఉంది. బాలా సాహెబ్ ఆ దశలో విద్వేషం బహిరంగానే వ్యక్తం చేసే వారు. నాయకులను రోడ్డుకీడ్చి కొట్టే దశ వస్తుందన్నారు. దేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని తీవ్రంగా ఈసడించే వారు. మొదట శివసేన ఒక ముఠాలా వ్యవహరించింది. ఆ తరవాత సంస్థాపరంగా ఎదిగింది. ఆ తరవాత ఉద్యమబాట పట్టింది. అప్పుడు గానీ అధికారం రుచి మరగలేదు.

బాలా సాహెబ్ రంగం నుంచి వైదొలిగిన తరవాత రాజ్ ఠాక్రే మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎం.ఎన్.ఎస్.) నెలకొల్పారు. ఆ తరవాత ఆయన ఎన్నికలలో పెద్దగా ప్రభావం చూపకపోయినా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. ముంబైలో శివసేనను ఓడిస్తే తప్ప మహారాష్ట్రలో అధికారం దక్కదని అమిత్ షా మంగళవారం ముంబైలోనే అన్నారు. అంటే బి.ఎం.సి. ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికలకు దారి చూపుతాయనుకోవాలి. శివసేన అంతు చూడాలని ముఖ్యమంత్రి షిండేకు అమిత్ షా శషభిషలు లేకుండానే చెప్పేశారు. శివసేన రంగంలో ఉంటే హిందువుల ఓట్లన్నీ మనకు దక్కవని కూడా హితవు చెప్పారు.

ముఖ్యమంత్రి పదవి చేతిలో లేకపోతే బీజేపీ శివసేనను అంతం చేస్తుందని ఉద్ధవ్ ఠాక్రే గ్రహించారు కనుక బీజేపీతో విడిపోయి కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ తో పొత్తు కూడి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు అదే ముఖ్యమంత్రి పదవి ఉద్ధవ్ ఠాక్రే దగ్గర లేదు. బి.ఎం.సి. లో అధికారం లేకపోతే ఏ పక్షానికైనా మహారాష్ట్ర మీద ఆధిపత్యం దక్కదు. అందుకే ఎట్టి పరిస్థితిలోనూ శివసేనను బి.ఎం.సి. ఎన్నికలలో గెలవనివ్వకూడదన్నది అమిత్ షా పంతం. ముంబై ఆర్థిక శక్తికి కేంద్రం. అక్కడ అధికారంలో ఉంటే తప్ప కార్పొరేట్ సంస్థలు గుప్పెట్లో ఉండవు. శివసేన పటిష్టంగా ఉన్నంత కాలం ఆర్.ఎస్.ఎస్. కూడా కిమ్మనలేదు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కనుక ఆర్.ఎస్.ఎస్. కీలక పాత్ర పోషిస్తుంది. బి.ఎం.సి. ఎన్నికలు శివసేనకు చివరి పరీక్ష లాంటివే. అరవై ఏళ్ల చరిత్రలో శివసేన ఇంత సంకట స్థితిలో ఎప్పుడూ పడలేదు.

First Published:  8 Sep 2022 8:11 AM GMT
Next Story