Telugu Global
National

బీహార్ లో మళ్లీ కుప్పకూలిన బ్రిడ్జ్..

ఈ బ్రిడ్జ్ పడిపోవడం ఇదే మొదటి సారి కాదు. గతేడాది ఏప్రిల్ లో భారీ వర్షాలకు, గాలివానకు ఇదే వంతెన కొంతభాగం ధ్వంసమైంది.

బీహార్ లో మళ్లీ కుప్పకూలిన బ్రిడ్జ్..
X

1700 కోట్ల రూపాయలు నీళ్లపాలయ్యాయి. బీహార్ లో గంగానదిపై నిర్మిస్తున్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలింది. భాగల్ పూర్ లో గంగానదిపై ఈ వంతెన నిర్మిస్తున్నారు. అగువానీ, సుల్తాన్ గంజ్ మధ్య ఈ వంతెన నిర్మాణం జరుగుతోంది. ఖగారియా, భాగల్ పూర్ జిల్లాలను ఈ వంతెన కలుపుతుంది. వంతెన కూలిపోతున్న దృశ్యాలను స్థానికులు సెల్ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఈ వంతెనలో ఉన్న రెండు భాగాలు, ఒకదాని తర్వాత మరొకటి వెంటవెంటనే కుప్పకూలాయి.


అప్పట్లో గాలివానకు..

ఈ బ్రిడ్జ్ పడిపోవడం ఇదే మొదటి సారి కాదు. గతేడాది ఏప్రిల్ లో భారీ వర్షాలకు, గాలివానకు ఇదే వంతెన కొంతభాగం ధ్వంసమైంది. కాంట్రాక్టర్ మరీ కక్కుర్తి పడటంతో ఆ తప్పు జరిగినట్టు తేలింది. దీనిపై విచారణ మొదలైంది, నిర్మాణ పనుల్లో నాణ్యత పెంచాలని సూచించారు అధికారులు. అయినా కూడా కాంట్రాక్టర్ కు చీమకుట్టినట్టయినా లేదు. ఇప్పుడు మొత్తం బ్రిడ్జ్ గంగానదిలో కలసిపోయింది.


కాంట్రాక్ట్ పనుల్లో అవినీతి మేత అందరికీ తెలిసిందే. అయితే మరీ నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ ఇలా నాణ్యత లేకుండా కుప్పకూలిపోవడం మాత్రం దారుణం అంటున్నారు స్థానికులు. కాంట్రాక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. బ్రిడ్జ్ ప్రారంభం అయిన తర్వాత ఈ ప్రమాదం జరిగి ఉంటే ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయేవారని అంటున్నారు. నిర్మాణంలో ఉండగానే ఈ బ్రిడ్జ్ కూలిపోవడంతో అవినీతి మేత ఏ స్థాయిలో ఉందో తేటతెల్లమైంది.

First Published:  4 Jun 2023 2:42 PM GMT
Next Story