Telugu Global
National

భారత్ లో నాసిరకం బొమ్మలతో కోట్ల రూపాయల వ్యాపారం

మేకిన్ ఇండియా అంటూ కేంద్రం జబ్బలు చరుచుకుంటున్నా.. చైనా వస్తువుల దిగుమతి ఆగలేదు. చైనా బొమ్మలు దిగుమతి చేసుకుని, వాటికి మేకిన్ ఇండియా స్టిక్కర్ అంటించి, రేటు పెంచి అమ్మేస్తున్నారు. జనాలను మోసం చేస్తున్నారు.

భారత్ లో నాసిరకం బొమ్మలతో కోట్ల రూపాయల వ్యాపారం
X

ఫుట్ పాత్ పై 50 నుంచి 100 రూపాయల లోపు రేటు పలికే బొమ్మలవి. కానీ అద్దాల షోరూమ్ లో పెట్టి అందమైన లేబుల్ అతికించి వాటిని వెయ్యి, రెండువేలకు విక్రయిస్తుంటారు. విమానాశ్రయాలు, ఇతర పెద్ద పెద్ద షాపింగ్ మాల్ లో హామ్లేస్, ఆర్చీస్ వంటి బ్రాండ్ లు కాస్ట్ లీ గానే ఉంటాయి. అయితే ఆ రేటుకి తగ్గట్టు ఆ బొమ్మలు, గిఫ్ట్ ఆర్టికల్స్ అంత క్వాలిటీగా ఉంటాయా అంటే అనుమానమే. కేవలం బ్రాండ్ కోసమే ఖర్చు పెడుతున్నామని వినియోగదారులకి కూడా తెలుసు.

కానీ అడ్డగోలుగా మోసపోతున్నామని మాత్రం వారు ఊహించి ఉండరు. అవును, కాస్ట్ లీ బ్రాండ్ ల పేరు పెట్టుకుని, నాసిరకం ఉత్పత్తుల్ని అమ్ముతున్నారంటూ వచ్చిన ఆరోపణలపై భారతీయ ప్రమాణాల మండలి విచారణ చేపట్టింది. నాసిరకం బొమ్మల విషయం వాస్తవమేనని తేల్చింది. దేశవ్యాప్తంగా విమానాశ్రయాలతోపాటు పలు ప్రాంతాల్లో ఉన్న హామ్లేస్‌, ఆర్చీస్‌ షాపులనుంచి 18,600 బొమ్మల్ని సీజ్ చేశారు అధికారులు. బీఐఎస్ ప్రమాణాలను అందుకోవడంలో ఆయా సంస్థలు విఫలమయ్యాయని తేల్చారు.

అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ కి వార్నింగ్..

ఆన్ లైన్ లో కూడా నాసిరకం బొమ్మలు అమ్ముతున్నారంటూ ఆరోపణలు వచ్చాయి. బీఐఎస్ ప్రమాణాలు లేకపోవడం, ఉన్నా కూడా నకిలీ లేబుల్స్ అతికించడం వంటివి చేస్తున్నారు. బొమ్మల నాణ్యతా నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించినందుకు ఇ-కామర్స్‌ సంస్థలైన అమెజాన్‌, ఫ్లిప్‌ కార్ట్‌, స్నాప్‌ డీల్‌ సంస్థలకు వినియోగదారు భద్రతా నియంత్రణ సంస్థ సీసీపీఏ నోటీసులు జారీ చేసింది.

మేకిన్ ఇండియా బూటకమే..

మేకిన్ ఇండియా అంటూ కేంద్రం జబ్బలు చరుచుకుంటున్నా.. చైనా వస్తువుల దిగుమతి ఆగలేదు. ఒకవేళ భారత్ లో తయారు చేసినా, వాటి ధరను చైనా వాటితో పోల్చలేం. అందుకే చైనా బొమ్మలు దిగుమతి చేసుకుని, వాటికి మేకిన్ ఇండియా స్టిక్కర్ అంటించి, రేటు పెంచి అమ్మేస్తున్నారు. జనాలను మోసం చేస్తున్నారు. దేశభక్తి అనే సెంటిమెంట్ తో కొడుతున్నారు. ఈ వ్యవహారం కూడా బయటపడటంతో భారత్ లో బొమ్మలు, గిఫ్ట్ ఆర్టికల్స్ షాపులపై వరుస దాడులు చేపట్టారు అధికారులు. 10 రూపాయల వస్తువుని 100 రూపాయలకి అంటగట్టడం గిఫ్ట్ ఆర్టికల్స్ షాపుల్లో సాధారణమేనని తేల్చారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని యాజమాన్యాలకు నోటీసులిచ్చారు. పెద్ద ఎత్తున బొమ్మలను సీజ్ చేశారు.

First Published:  13 Jan 2023 2:34 AM GMT
Next Story