Telugu Global
National

బాక్సింగ్ ఫెడరేషన్ వివక్ష.... మహిళా బాక్సర్ కి మెంటల్ టార్చర్

దేశంలో ప్రతి రంగాన్ని రాజకీయాలు భ్రష్టుపట్టిస్తున్నాయి. ఈ రాజకీయాల వల్ల అద్భుతమైన నైపుణ్యమున్నవాళ్ళు కూడా వెనకబడిపోతున్నారు. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తనను మెంటల్ టార్చర్ కు గురి చేస్తోందని టోక్యో ఒలంపిక్స్ లో కాంస్య పతకం సాధించిన బాక్సర్ లవ్లీనా ఆవేదన వ్యక్తం చేస్తోంది.

బాక్సింగ్ ఫెడరేషన్ వివక్ష.... మహిళా బాక్సర్ కి మెంటల్ టార్చర్
X

బాక్సింగ్ రింగ్ లో ప్రత్యర్థులను చిత్తు చేసే బాక్సర్లు కూడా పాలిటిక్స్ ముందు డీలా పడిపోతున్నారు. ఈ అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎందుకిలా జరుగుతోందో అర్థం కాదు. విదేశీ పోటీల్లో గెలిచి ఇండియాకు ప్రతిష్ట తెచ్చే అథ్లెట్లు దేశంలోని సంకుచిత ప్రయోజనాల ముందు దీనంగా, బేలగా మారిపోతున్నారు. ఇందుకు తాజా ఉదాహరణ బాక్సర్ లవ్లీనా ! తనకు మెంటల్ హరాస్ మెంట్ ఎక్కువైపోతోందని ఈ బాక్సర్ వాపోతోంది. రాబోయే రోజుల్లో బర్మింగ్ హామ్ లో జరగనున్న కామన్ వెల్త్ పోటీలకు ప్రిపేరవుతున్న తన పట్ల బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వివక్ష చూపుతోందని ఆమె ఆరోపించింది. తనతో ఈ సంస్థ చెత్త రాజకీయాలు చేస్తోందని ఆమె దుయ్యబట్టింది. టోక్యో ఒలంపిక్స్ లో కాంస్య పతకం సాధించిన ఈ బాక్సర్ సుదీర్ఘమైన ట్వీట్ చేస్తూ .. తాను ఒలింపిక్ మెడల్ సాధించడానికి, తన విజయాలకు తనకు తోడ్పడిన కోచ్ లను ఫెడరేషన్ తొలగిస్తోందని తెలిపింది.

ద్రోణాచార్య అవార్డు గ్రహీత అయిన సంధ్య గురుంగ్ జీ తన కోచ్ అని,ఆమెను, మరో కోచ్ ని వారు ఎన్నో అభ్యర్థనలు చేసిన తరువాతే ట్రెయినింగ్ క్యాంప్ లోకి అనుమతిచ్చారని ఆమె పేర్కొంది. ఆందువల్ల తన శిక్షణా ప్రక్రియ దెబ్బ తింటోందని లవ్లీనా విచారం వ్యక్తం చేసింది. ఈ ఇద్దరు కోచ్ లను ఆలస్యంగా అనుమతించడం లోని ఉద్దేశమేమిటో తనకు అర్థం కావడం లేదని ఆమె పేర్కొంది. ప్రస్తుతం సంధ్య గురుంగ్ జీ కామన్ వెల్త్ విలేజ్ బయటే ఉన్నారు. ఆమె ప్రవేశానికి అనుమతించడం లేదు. గేమ్స్ ప్రారంభం కావడానికి 8 రోజుల ముందు నా ట్రెయినింగ్ ప్రాసెస్ నిలిచిపోయింది అని లవ్లీనా తెలిపింది. ఇలా చేయరాదని నేను ఎంతగా ప్రాధేయపడినప్పటికీ నాకు ఈ మెంటల్ హరాస్ మెంట్ తప్పడం లేదు అని ఆమె దాదాపు కన్నీటి పర్యంతమైంది. నా రెండో కోచ్ ని ఇండియాకు తిప్పి పంపేశారని, ఇది తన చివరి వరల్డ్ ఛాంపియన్ షిప్ అని ఆమె వాపోయింది. ఈ రాజకీయాల కారణంగా తన కామన్ వెల్త్ గేమ్స్ ని వదులుకోరాదన్నది తన ఉద్దేశమని, ఈ డర్టీ పాలిటిక్స్ ని ఛేదించి.. నా దేశానికి మెడల్ తేగలనని ఆశిస్తున్నానని లవ్లీనా వెల్లడించింది. 2020 లో టోక్యోలో 69 కేజీల విభాగంలో తన ప్రత్యర్థిని ఓడించి ఈమె కాంస్య పతకం సాధించింది. విజేందర్ సింగ్, మేరీ కోమ్ తరువాత ఒలింపిక్స్ లో మెడల్ సాధించిన మూడో భారత బాక్సర్ ఈమె. జులై 28 న బర్మింగ్ హామ్ లో కామన్ వెల్త్ క్రీడలు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 8 న ఇవి ముగుస్తాయి.




First Published:  25 July 2022 3:18 PM GMT
Next Story