Telugu Global
National

కూరగాయల షాపుకి బౌన్సర్ల భద్రత.. ఎందుకంటే..?

ఉత్తర ప్రదేశ్ లోని వారణాశిలో ఓ కూరగాయల షాపుకి బౌన్సర్లు రక్షణగా నిలిచారు. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కూరగాయల షాపుకి బౌన్సర్ల భద్రత.. ఎందుకంటే..?
X

హీరో హీరోయిన్లు, లేదా సెలబ్రిటీలు ఎవరైనా బయటకు వచ్చినపుడు, ఏదైనా ప్రైవేట్ ఫంక్షన్ జరుగుతున్నప్పుడు బౌన్సర్లు కనపడుతుంటారు. పబ్ లు, బార్ల దగ్గర గొడవలు జరగకుండా ఉండేందుకు కూడా బౌన్సర్లను ఉపయోగించుకుంటారు. కానీ ఉత్తర ప్రదేశ్ లోని వారణాశిలో ఓ కూరగాయల షాపుకి బౌన్సర్లు రక్షణగా నిలిచారు. ఈ వ్యవహారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

టమాటాల కోసం..

దేశవ్యాప్తంగా టమాటా రేటు ఆకాశాన్నంటిన నేపథ్యంలో పలుచోట్ల కూరగాయల షాపుల్లో దొంగలు పడ్డారు. మిగతా వాటిని అక్కడే వదిలేసి కేవలం టమాటా, మిర్చిని ఎత్తుకెళ్లిన ఉదాహరణలున్నాయి. కర్నాటకలో టమాటా తోటలో దొంగలు పడి 3 లక్షల రూపాయల విలువైన పంటను ఎత్తుకెళ్లిన సంఘటన కూడా సంచలనంగా మారింది. దీంతో యూపీ వ్యాపారి బౌన్సర్లతో రక్షణ ఏర్పాటు చేసుకున్నారు. తన షాపుకి వచ్చే కస్టమర్లు టమాటాలకోసం కొట్టుకుంటున్నారని, కొంతమంది తెలివిగా వాటిని సంచిలో వేసుకుని వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. సీసీ కెమెరాలు పెట్టినా కూడా పోయిన టమాటాలను రాబట్టుకోవడం కష్టంగా మారిందని, అందుకే దొంగతనాలకు అవకాశం లేకుండా బౌన్సర్లతో రక్షణ ఏర్పాట్లు చేసుకున్నానని చెప్పాడు.


దయచేసి టమాటాలు తాకవద్దు..

విలువైన వస్తువులు-దయచేసి ముట్టుకోవద్దు.. పగిలిపోయే వస్తువులు-దయచేసి తాకవద్దు.. అంటూ కొన్ని షాపుల్లో నోటీస్ బోర్డులు పెడుతుంటారు. ఇప్పుడు టమాటా కూడా ఆ వస్తువుల జాబితాలో చేరింది. బౌన్సర్లతో కాపలా పెట్టిన వ్యాపారి కొన్ని బోర్డులు కూడా పెట్టాడు. దయచేసి టమాటా, మిర్చిని ఎవరూ ముట్టుకోవద్దని చెబుతున్నాడు. ముందు డబ్బులు, ఆ తర్వాతే టమాటా అంటూ మరో బోర్డ్ కూడా షాపులో పెట్టాడు. ఇదంతా టమాటాల రక్షణ కోసమా, లేక ప్రచారం కోసమా అంటూ వినియోగదారులు సెటైర్లు వేస్తున్నారు.

First Published:  9 July 2023 1:17 PM GMT
Next Story