Telugu Global
National

కోవిడ్ వ్యాక్సిన్ మరణం: కేంద్ర ప్రభుత్వం, బిల్ గేట్స్ కు బాంబే హైకోర్టు నోటీసులు

కరోనా వ్యాక్సిన్ దుష్ప్రభావాల వల్లే తన కూతురు మరణించిందని, అందువల్ల తనకు 1000 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ దిలీప్ లునావత్ అనే వ్యక్తి బోంబే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు, కేంద్ర ప్రభుత్వానికి, బిల్ గేట్స్ తదితరులకు నోటీసులు జారీ చేసింది.

కోవిడ్ వ్యాక్సిన్ మరణం: కేంద్ర ప్రభుత్వం, బిల్ గేట్స్ కు బాంబే హైకోర్టు నోటీసులు
X

కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ తీసుకోవడం వల్ల తన కుమార్తె మరణించినందున తనకు 1000 కోట్ల నష్ట‌పరిహారం చెల్లించాలంటూ ఓ తండ్రి వేసిన పిటిషన్ పై బోంబే హైకోర్టు స్పందించింది.

కోర్టు, భారత ప్రభుత్వం, సెరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII), మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ డైరెక్టర్, DCGI చీఫ్ తదిత‌రులకు నోటీసులు జారీ చేసింది.

మహారాష్ట్ర, ఔరంగాబాద్ కు చెందిన దిలీప్ లునావత్ కుమార్తె స్నేహల్ లునావత్ డాక్టర్. ఎస్ బీఎంటీ డెంటల్ కాలేజీ లెక్చరర్ గా పనిచేసేది. సదరు హాస్పిటల్ సిబ్బంది అందరూ టీకా డోస్ తీసుకోవాలని ఆదేశించినట్టు చెప్పారు. వ్యాక్సిన్ పూర్తిగా సురక్షితమైనదని, ఎటువంటి రిస్క్ ఉండదని తన కుమార్తెకు హామీ ఇచ్చినట్టు పిటిషనర్ లునావత్ వివరించారు. 2021 జనవరి 28న తన కుమార్తె టీకా తీసుకోగా.. దుష్ప్రభావాల కారణంగా మార్చి 1న చనిపోయినట్టు తెలిపారు. దీంతో పరిహారం ఇప్పించాలని ఆయన కోర్టును కోరారు.

దిలీప్ లునావత్ తన పిటిషన్‌లో, "COVID-19 వ్యాక్సిన్ గురించి తప్పుడు ప్రచారాలు చేయడం, వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్య నిపుణులు బలవంతం చేయడం, వ్యాక్సిన్ గురించి వాస్తవాలు చెప్పకుండా ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు చేయడం...ఇవన్నీ తన కూతురు మృతికి కారణాలుగా పేర్కొన్నారు

"జనవరి 4, 2021న ఓ వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ విజి సోమాని, వ్యాక్సిన్‌లు 110 శాతం సురక్షితమైనవని స్పష్టంగా పేర్కొన్నారు" అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

"ఇలాంటి ఇంటర్వ్యూలను ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా మరి కొంత మంది కూడా ఇచ్చారు. వ్యాక్సిన్‌లు అత్యంత సురక్షితమైనవని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌లు తీసుకోవాలని వారు కోరారు, "అని పిటిషన్‌లో దిలీప్ పేర్కొన్నారు.

కొరోనావైరస్ వ్యాక్సిన్ గురించి తప్పుడు కథనాలను ప్రచారం చేసినందుకు దిలీప్ అధికారులను నిందించారు.

" స్నేహల్ లునావత్ మరణం కోవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాల వల్లే జరిగిందని కేంద్ర ప్రభుత్వ AEFI కమిటీ 2021 అక్టోబర్ 2న అంగీకరించింది" అని పిటిషన్‌లో పేర్కొన్నారు.

First Published:  3 Sep 2022 6:28 AM GMT
Next Story