Telugu Global
National

భారత గగనతలంలో ప్రయాణిస్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. రంగంలోకి ఎయిర్‌ఫోర్స్

విమానాన్ని జైపూర్‌ ఎయిర్ పోర్టులో దింపాలని ఢిల్లీ ఏటీసీ సూచించింది. కానీ పైలెట్ వినలేదు. ఆ తర్వాత చండీఘర్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేయాలని కోరినా పైలెట్ నిర్లక్ష్యం చేశాడు. దీంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు సదరు మహాన్ విమానం చైనా గగనతలంలోకి ప్రవేశించే వ‌ర‌కు వెంట వెళ్లాయి.

భారత గగనతలంలో ప్రయాణిస్తున్న విమానానికి బాంబు బెదిరింపు.. రంగంలోకి ఎయిర్‌ఫోర్స్
X

భారత గగనతలంలో ప్రయాణిస్తున్న ఓ విమానానికి బాంబు బెదిరింపు రావడంతో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ విమానాలు రంగంలోకి దిగాయి. సదరు విమానాన్ని బలవంతంగా ఇండియాలో దించడానికి రెండు యుద్ద విమానాలు ఆ ప్రయాణికుల విమానం పక్కనే చాలా దూరం ప్రయాణించాయి. కానీ, పైలెట్ ఇండియాలో విమానాన్ని దించడానికి నిరాకరించాడు. సోమవారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.

ఇరాన్‌ రాజధాని టెహ్రాన్ నుంచి చైనాలోని గ్వాంగ్జూకు మహాన్ ఎయిర్‌కు చెందిన విమానం సోమవారం ఉదయం బయలుదేరింది. కాగా, ఢిల్లీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌ సెంటర్‌కు ఉదయం 9.20 గంట‌ల‌కు సదరు విమానంలో బాంబు ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన ఏటీసీ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీకి సమాచారం అందించింది. వెంటనే సదరు సంస్థలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌ను అప్రమత్తం చేశాయి. ఐఏఎఫ్‌కు చెందిన యుద్ద విమానాలు వెంటనే ఆ విమానం దగ్గరకు వెళ్లాయి.

ఢిల్లీ ఏటీసీ, ఐఏఎఫ్ పదే పదే మహాన్ ఎయిర్ పైలెట్లను హెచ్చరించాయి. విమానాన్ని జైపూర్‌ ఎయిర్ పోర్టులో దింపాలని సూచించాయి. కానీ పైలెట్ వారి మాట వినలేదు. ఆ తర్వాత చండీఘర్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ చేయాలని కోరినా పైలెట్ నిర్లక్ష్యం చేశాడు. దీంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాలు సదరు మహాన్ ఎయిర్ ఫ్లైట్ చైనా గగనతలంలోకి ప్రవేశించే వ‌ర‌కు వెంట వెళ్లాయి. ఆ తర్వాత ఢిల్లీ ఏటీసీ గ్వాంగ్జూ ఏటీసీకి బాంబు బెదిరింపు సమాచారాన్ని చేరవేసింది. అంతే కాకుండా సదరు పైలెట్ నిర్లక్ష్యాన్ని టెహ్రాన్ ఏటీసీకి తెలిపింది. ప్రయాణికుల భద్రత కోసం విమానాన్ని ల్యాండ్ చేయాలని చెప్పినా పైలెట్ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు ఢిల్లీ ఏటీసీ పేర్కొంది.

కాగా ఢిల్లీ ఏటీసీకి బాంబు బెదిరింపు సమాచారం పాకిస్తాన్‌లోని లాహోర్ ఏటీసి నుంచి రావడం గమనార్హం. కాగా, సదరు విమానం పాకిస్తాన్ గగనతలంలో కంటే భారత గగనతలంలోనే ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. కాబట్టి గాల్లో పేలితే కింద కూడా ఎంతో ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉండటంతో ఢిల్లీ ఏటీసీని అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది.

First Published:  3 Oct 2022 2:30 PM GMT
Next Story