Telugu Global
National

నాగ్‌పూర్ సమితి ఎన్నికల్లో బీజేపీని చావుదెబ్బ కొట్టిన కాంగ్రెస్..

నాగ్‌పూర్ లో ఇప్పటి వరకూ కాషాయ జెండాలే రెపరెపలాడేవి. కానీ కాంగ్రెస్ ఆ కంచుకోటను బద్దలుకొట్టింది. ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాకుండా బీజేపీని చావుదెబ్బ కొట్టింది.

నాగ్‌పూర్ సమితి ఎన్నికల్లో బీజేపీని చావుదెబ్బ కొట్టిన కాంగ్రెస్..
X

మహారాష్ట్రలో అధికార కూటమిని కూల్చి, పార్టీలను చీల్చి, షిండే గ్రూప్ తో కలసి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. కానీ, స్థానిక ఎన్నికల్లో మాత్రం బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. అది కూడా నాగ్‌పూర్ వంటి ప్రాంతంలో. స్వయానా ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వస్థలం అది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కూడా అక్కడినుంచే వచ్చారు. ప్రస్తుత బీజేపీ మహారాష్ట్ర చీఫ్ చంద్రశేఖర్ బవాంకులే సొంత జిల్లా నాగ్‌పూర్. ఇంకా చెప్పాలంటే ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం ఉన్న ప్రాంతం అది. అలాంటి నాగ్ పూర్ లో ఇప్పటి వరకూ కాషాయ జెండాలే రెపరెపలాడేవి. కానీ కాంగ్రెస్ ఆ కంచుకోటను బద్దలుకొట్టింది. ఒక్కటంటే ఒక్క సీటు కూడా రాకుండా బీజేపీని చావుదెబ్బ కొట్టింది.

నాగ్‌పూర్ జిల్లాలో పంచాయతీ సమితి చైర్మన్లు, డిప్యూటీ చైర్మన్ల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చూపించింది. చైర్మన్ స్థానాలు మొత్తం 13 కాగా ఆందులో 9 కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి. మూడింటిలో మహా ఘట్ బంధన్ లోని ఎన్సీపీ విజయం సాధించింది. ఒకచోట శివసేన షిండే వర్గం గెలుపొందింది. 13 స్థానాల్లో బీజేపీ స్కోర్ జీరో. 13 డిప్యూటీ చైర్మన్ స్థానాలకు గాను 8 కాంగ్రెస్ ఖాతాలో పడ్డాయి.

కాంగ్రెస్ లో ఆత్మవిశ్వాసం..

భారత్ జోడో యాత్రతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెరిగింది. అదే సమయంలో సీనియర్లు కొందరు పార్టీని వీడటం, పార్టీ పగ్గాలు చేపట్టబోనని రాహుల్ చెప్పడంతో కాస్త నిరుత్సాహం కూడా ఉంది. కానీ దేశవ్యాప్తంగా బీజేపీ వ్యతిరేక పవనాలు ఇలా తమ ఉనికి చాటుకుంటున్నాయి. తాజాగా నాగ్ పూర్ పంచాయతీ సమితి ఫలితాల్లో బీజేపీ జీరో స్కోర్ కి డకౌట్ అవ్వ‌డంతో కాంగ్రెస్ వర్గాలు పండగ చేసుకుంటున్నాయి. ఆర్ఎస్ఎస్ కేంద్ర స్థానం, బీజేపీ కీలక నేతల సొంత ప్రాంతంలో కాంగ్రెస్ గెలవడంతో ఈ ఆనందం రెట్టింపయింది.

డీలాపడ్డ బీజేపీ..

మహారాష్ట్రలో అధికారం చేజిక్కించుకున్న ఆనందం బీజేపీకి లేకుండా పోయింది. నాగ్ పూర్ ఎన్నికల్లో పరాభవంతో ఆ పార్టీ డీలా పడింది. పెరిగిన ద్రవ్యోల్బణంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆ ప్రభావం ఎన్నికల్లో కనిపిస్తోందని తేలిపోయింది. ఇదే రిపీట్ అయితే సమితి ఎన్నికల్లోనే కాదు, సార్వత్రిక ఎన్నికల్లో కూడా పరాజయం తప్పదని బీజేపీ అంచనా వేస్తోంది.

First Published:  17 Oct 2022 11:55 AM GMT
Next Story