Telugu Global
National

సానియా మీర్జాను తిట్టిన నోటితోనే పొగుడుతున్న బీజేపీ నాయకులు... ఎందుకోసం ?

తెలంగాణకు చెంఫిన ఎంపీ, బీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే లక్ష్మణ్ 2014 లో తానన్న మాటల‌ను మర్చిపోయి సానియా మీర్జాపై పొగడ్తలు గుప్పించారు. ఆమెను భారత దేశానికి గర్వకారణంగా అభివర్ణించారు.

సానియా మీర్జాను తిట్టిన నోటితోనే పొగుడుతున్న బీజేపీ నాయకులు... ఎందుకోసం ?
X

2014లో తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత టీఆరెస్ ప్రభుత్వం హైదరాబాద్‌కు చెందిన అంతర్జాతీయ క్రీడాకారిణి సానియా మీర్జాను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. ఈ చర్యపై బీజేపీ నేతలు అప్పుడు నిప్పులు చెరిగారు.

ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఆందోళనలో మీర్జా ఎన్నడూ పాల్గొనలేదని, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మైనారిటీ ఓట్లను సాధించాలనే ఉద్దేశ్యంతో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆమెను గౌరవిస్తోందని బీజేపీ నాయకుడు కే లక్ష్మణ్ అప్పడు ఆరోపించారు..

మీర్జా నాన్-లోకల్ అని ఆమె మహారాష్ట్రలో జన్మించి ఆ తరువాత హైదరాబాద్‌లో స్థిరపడ్డారని. ఆమె పాకిస్థానీ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లాడిందని ఎత్తిచూపుతూ ఆమెను పాకిస్థాన్ "కోడలు" అని వర్ణించారు. పాకిస్తాన్ వ్యక్తిని తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ గా ఎలా నియమిస్తారంటూ విమర్శలు గుప్పించారు.

ఇది జరిగి 9 ఏళ్ళు గడిచిపోయింది. తాజాగా సానియా మీర్జా ఆటల్లోనుంచి కూడా రిటర్మెంట్ తీసుకున్నారు. తాజాగా మోడీ సానియా మీర్జాను పొగడ్తలతో ముంచెత్తారు. మీ అంత గొప్ప క్రీడాకారిణి భారతీయురాలైనందుకు మాకు గర్వంగా ఉందన్నారు మోడీ. మీ స్పూర్తితో వందలాది యువతులు టెన్నిస్‌ రంగంలోకి వచ్చారు. వస్తున్నారు అని మోడీ అన్నారు. మీ విజయం అనేకమందికి ప్రేరణ అని మోడీ పొగడ్తలు గుప్పించారు.

మోడీ మాటలతో ఒక్క సారి బీజేపీ నాయకులు తమ గత మాటలను మరిపించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. సానియా మీర్జా పాకిస్తానీ అని విమర్శించినవారంతా ఆమెపై పొగడ్తలు గుప్పించ‌డం మొదలుపెట్టారు.

తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీ, బీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కే లక్ష్మణ్ 2014 లో తానన్న మాటల‌ను మర్చిపోయి సానియా మీర్జాపై పొగడ్తలు గుప్పించారు. ఆమెను భారత దేశానికి గర్వకారణంగా అభివర్ణించారు.

సానియా మీర్జాను ఒకప్పుడు ‘పాకిస్థాన్ కోడలు’ అని పిలిచిన‌ లక్ష్మణ్ ఇప్పుడు ఆమె ‘భారతదేశానికి గర్వం’ అని కొనియాడారు.

“గతంలో నేను చేసిన‌ ప్రకటనలను తప్పుగా అర్థం చేసుకున్నారు, ఆమె గొప్ప క్రీడా స్టార్ . భారతదేశం గర్వపడేలా చేసింది. క్రీడ పట్ల ఆమెకున్న అభిరుచి అనేక సార్లు దేశం గర్వించేలా చేసింది. ఆమె ప్రజలపై విపరీతమైన ప్రభావాన్ని చూపింది. ’’ అని ఆయన అన్నారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న తరుణంలో మోడీ, లక్ష్మణ్ లు మీర్జాపై ప్రశంసలు కురిపించడం గమనార్హం.

"స్పోర్ట్స్ స్టార్ సానియా మీర్జాను ప్రధాని ప్రశంసించడం తెలంగాణ ఓటర్లకు పార్టీని దగ్గర చేసే ప్రయత్నం " అని బిజెపి వర్గాలు పేర్కొన్నాయి.

‘‘యువతను కనెక్ట్ చేసే శక్తి క్రీడలకు ఉంది. ఆమె ముస్లిం కుటుంబం నుండి వచ్చింది. ప్రస్తుతం బిజెపి రాష్ట్రంలోని ముస్లింలను చేరుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది, ”అని బీజేపీ వర్గాలు అభిప్రాయపడ్డాయి..



First Published:  13 March 2023 1:32 AM GMT
Next Story